తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ
ఇందిరాపార్కు వద్ద ధర్నా
నవతెలంగాణ – ముషీరాబాద్
అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని బాధితుల సంఘం అధ్యక్షులు పశ్య పద్మ డిమాండ్ చేశారు. తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఆనంద్ అధ్యక్షతన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బినామీ పేర్లతో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనపరచు కోవాలని కోరారు. అగ్రిగోల్డ్ కంపెనీ మోసాలకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారికి సంబంధించి ఆ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అగ్రిగోల్డ్ కంపెనీ వేసిన వెంచర్లలో ఇండ్ల స్థలాలు, భూములు కొనుగోలు చేసి రిజిస్టర్ అయి ఉన్న వారందరికీ ఆ స్థలాలను భూములను అటాచ్మెంట్ నుంచి తొలగించి యజమానులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. 1995లో ఏర్పాటైన అగ్రిగోల్డ్ కంపెనీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా దాదాపు 8 రాష్ట్రాలలో 32 లక్షల మంది ఖాతాదారుల నుంచి సుమారు రూ.7,628 కోట్లు సేకరించి మోసం చేసిందని వివరించారు. కంపెనీ మోసాలను గుర్తించలేక అమాయక ప్రజలు కస్టమర్లుగా, డిపాజిట్ దారలుగా తమ జీవిత పొదుపులను అందులో పెట్టుబడి పెట్టారని తెలిపారు. తెలంగాణలో సుమారు మూడు లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని, ఇప్పటికే 200 మందికి పైగా ఆత్మహత్య లేదా అసహజ మరణాలు జరిగినట్టు తెలిపారు. బాధితులు సంఘటితంగా పోరాడుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు రూ.916 కోట్లను విడుదల చేసి సహాయం చేసినట్టు గుర్తు చేశారు. అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక కమిటీ, ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి, అగ్రిగోల్డ్‌కు చెందిన బినామీ ఆస్తులను జప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి జి.వి.ఆర్, ఉపాధ్యక్షులు రజిత, మానవ హక్కుల కమిటీ అధ్యక్షులు మల్లారెడ్డి, సతీష్, శాంత, హంసమ్మ, పి. సుగుణ, ఎం. యాదగిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అగ్రిగోల్డ్ బాధితుల కోసం ప్రత్యేక కమిటీ వేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



