మేడారం బస్టాండ్‌లో తొక్కిసలాట

A stampede at Medaram bus stand– ప్రాణాపాయ స్థితిలో వృద్ధురాలు
– మరొకరి తలకు తీవ్ర గాయాలు
– బస్సుల కోసం గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ
నవతెలంగాణ-ఏటూరు నాగారం ఐటీడీఏ
మేడారం జాతరలో కోసం ఏర్పాటుచేసిన ఆర్టీసీ బస్టాండ్‌ సందర్శకులతో కిటకిటలాడటంతో తొక్కిసలాడ జరిగింది. అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నాక శుక్రవారం ఇంటిబాట పట్టిన సందర్శకులు.. హన్మకొండ వెళ్లేందుకు బస్సుల కోసం క్యూ లైన్‌లో గంటల తరబడి నిరీక్షించారు. ఈ క్రమంలో ములుగు-హన్మకొండ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు రావడంతో ప్రయాణికులంతా ఒకేసారి ఎగబడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో ఒక వృద్ధురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. మరోవ్యక్తి తలకు తీవ్రగాయాలయ్యాయి. వీరితో పాటు చాలా మంది ప్రయాణికులు స్వల్పగాయాలపాలయ్యారు. జాతరలో ఆర్టీసీ సేవల కోసం ప్రభుత్వం రూ.2.25 కోట్ల నిధులు కేటాయించింది. ఆరువేల బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ తెలిపారు. అయినా గంటకో బస్సు కూడా రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇంతపెద్ద జాతరలో ఏర్పాటు చేసిన బస్టాండ్‌లో కనీసం ఒక అంబులెన్స్‌ కూడా ఏర్పాటు చేయకపోవడంతో సందర్శకులు ఆర్టీసీ అధికారులపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు గాయపడిన వారిని గద్దెల వద్ద ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Spread the love