కారులో కహానీ..

Story in the car..– ఆ రెండూ కాకుంటే కార్పొరేషన్‌ పదవులు
– బీఆర్‌ఎస్‌ బాస్‌కి బుజ్జగింపుల తలనొప్పి
– ‘రైతు బంధు సమితి’ వద్దంటున్న తాటికొండ రాజయ్య
– ఆర్టీసీ చైర్మెన్‌ వద్దు.. ఎమ్మెల్యే టిక్కెటే ముద్దంటున్న ముత్తిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వలేకపోతే ఎంపీగా…అదీ లేకుంటే ఎమ్మెల్సీ…
ఇదర్‌ కా మాల్‌ ఉదర్‌.. ఉదర్‌ కా మాల్‌ ఇదర్‌… (ఇక్కడి సరుకు అక్కడికి, అక్కడి సరుకు ఇక్కడికి) అనేది ఉర్దూలో బాగా పాపులర్‌ అయిన నానుడి. అధికార బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఇప్పుడు ఇదే తరహాలో కొనసాగుతున్నది. 2001 నుంచి కేసీఆర్‌తోపాటు నడిచిన ఉద్యమకారులు, సొంత పార్టీలోని సీనియర్లు, జూనియర్లు, ఇతర పార్టీల నుంచి వచ్చిన చేరిన నేతలు, వారితోపాటు అంగబలం, అర్థబలం ఉండి గులాబీ కండువా కప్పుకున్న బడా వ్యాపారవేత్తలు, పరిశ్రమాధిపతులు… వెరసి కారుకు లోడెక్కువైంది. ఎంతగా అంటే.. అది మోయలేనంతగా. ఇప్పుడు ఈ బరువే… గులాబీ పార్టీ అధినేతలకు ‘తల బరువు’గా మారింది. ఏండ్ల తరబడి బీఆర్‌ఎస్‌లో పదవుల కోసం ఎదురు చూసిన నేతలు ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే టిక్కెట్‌ దక్కించుకుని శాసనసభలో అడుగుపెట్టాలని భావించారు. కానీ సిట్టింగులకే అధిక ప్రాధాన్యతనిచ్చిన సీఎం కేసీఆర్‌, ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి పార్టీకి ఊపు తెద్దామనుకున్నారు. కానీ ఆ ఊపు సంగతేమోగానీ, అసమ్మతి రాగాలు, ధిక్కార స్వరాలు ఊపందుకున్నాయి. దీంతో ఇది కాకపోతే అది, అదీ కాకపోతే ఇంకోటి అంటూ నేతలను బుజ్జగించటం అధినేత వంతైంది.
ఒకవైపు పార్టీలో సీనియర్లుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి లీడర్లు పార్టీని వీడిన నేపథ్యంలో… మరోవైపు ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌లోకి వలసలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌ వైపు చూస్తున్న బీజేపీ నేతలకు గాలం వేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి లాంటి నేతలను గులాబీ గూటికి రప్పించేందుకు రంగం సిద్ధం చేశారు.ఆ వరసలో మరో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు కూడా వినిపిస్తుండటం గమనార్హం. బీఆర్‌ఎస్‌ తొలి జాబితాలో చోటు దక్కని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. వారితో మాట్లాడి, ఒప్పించి వేరే పదవుల్లో సర్దుబాటు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మెన్‌ పదవినీ, రాజయ్యకు రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇచ్చి సంతృప్తి పరిచేందుకు సీఎం ప్రయత్నించారు. ఆ మేరకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో చర్చలు, సమాలోచనలు కూడా కొనసాగాయి. కానీ ముత్తిరెడ్డి, రాజయ్య ఎమ్మెల్యే సీటు పైన్నే గురి పెట్టారని తెలుస్తోంది. సీఎం మాట కాదనలేక ఆర్టీసీ చైర్మెన్‌, రైతు బంధు సమితి పదవులకు ఒప్పుకున్నా… ‘తమకు ఇష్టం లేకపోయినా ఒప్పించారు…’ అంటూ వారు సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు వినికిడి. అందువల్ల వారు కచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక త్వరలో కారెక్కనున్న మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామికి పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని కేటాయించనున్నారని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆ హామీ మేరకే ఆయన గులాబీ తీర్థం పుచ్చుకున్నారని ఆయా వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం అక్కడి నుంచి ఎంపీగా ఉన్న నేతగాని వెంకటేశ్‌కు మున్ముందు ఏ పదవిని కట్టబెడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక జహీరాబాద్‌ అసెంబ్లీ టిక్కెట్‌ను ఆశించిన ఏర్పుల నరోత్తమ్‌కు రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మెన్‌ పదవిని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. త్వరలో బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరతారంటూ ప్రచారం జరుగుతున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా… తనకు చేవెళ్ల ఎంపీ టిక్కెట్‌ ఇచ్చేందుకు అంగీకరిస్తేనే పార్టీ మారతాననే సంకేతాలు ఇస్తుండటం గమనార్హం. కానీ అక్కడ ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నుంచే గడ్డం రంజిత్‌రెడ్డి సిట్టింగ్‌ ఎంపీగా ఉండటం గమనార్హం.
కొన్నింటిలో మార్పులు తప్పవా…?
బీఆర్‌ఎస్‌ తొలి జాబితాలో ప్రకటించిన పేర్లలో సైతం పలు మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయనే వాదన బలంగా వినబడుతున్నది. మహబూబాబాద్‌ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ పేరును ప్రకటించినప్పటికీ.. అక్కడి నుంచి ఎంపీ మాలోత్‌ కవితను పోటీ చేయించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. జనగామలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికే సీటు ఖాయమంటున్నప్పటికీ అక్కడి నుంచి మాజీ ఆర్మీ అధికారి భిక్షపతి పేరునూ సీఎం పరిశీలిస్తున్నారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరనున్న క్రమంలో… అక్కడి నుంచి బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజయ్యను బరిలోకి దింపాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఆ సీటును మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డికి కేటాయిస్తారనే ప్రచారం కూడా జరుగుతున్నది.

Spread the love