ప్రభావిత ప్రాంతాల్లో కూనంనేని పర్యటన

– పునరుద్ధరణ పనులు సత్వరమే పూర్తి చేయాలి
– ఇండ్లు కోల్పోయిన పేదలకు పరిహారంతోపాటు పక్కా గృహాలు
– పంట నష్టంపై సర్వే చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందించాలి
– ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం పట్టణం పరిధిలోని వర్ష ప్రాభావిత ప్రాంతాల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మంగళవారం పర్యటించారు. మున్సిపల్‌ పరిధిలోని గాజులరాజం బస్తి, బూడిదగడ్డ, కూలీలైన్‌, హానుమాన్‌ బస్తిల్లో ఈదురుగాలలు, వడగండ్ల వానతో దెబ్బ తిన్న ఇండ్లను పరిశీలించి జరిగిన నష్టాన్ని బాదితులను అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ శాఖ చేపట్టిన విద్యుత్‌ స్తంబాలు, విద్యుత్‌ లైన్ల ఏర్పాటు పనులను పరిశీలించారు. నిర్విరామంగా పనులు కొనసాగించి విద్యుత్‌ సరఫరాను సత్వరమే పునరుద్దరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల కురిసిన వడగండ్ల వాన, ఈదురు గాలులతో తీవ్ర నష్టం వాటిల్లిందని, పేదల ఇండ్లు, గుడిసెలు నెలమట్టమై నిరాశ్రయులుగా మారారని, వీరికి పునరావాసం కల్పించడంతోపాటు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇండ్లు కోల్పోయిన పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ గృహాల మంజూరులో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గాజులరాజం బస్తిలో ఇంటి రేకు మీదపడి గాయాలపాలైన దేవమ్మను పరామర్శించారు. జిల్లా వ్యాప్తంగా 278 విద్యుత్‌ స్తంబాలు కూలిపోయాయని, 48 ట్రాన్స్‌ ఫార్మర్లు దెబ్బతున్నాయని అధికారులు ప్రకటించారని, వీటి పునరుద్ధరణ దాదాపుగా పూర్తికావచ్చిందని తెలిపారు. మంగళవారం సాయంత్రంలోపు సాధారణ పరిస్థితులకు తీసుకొచ్చే విధంగా విద్యత్‌ శాఖ శ్రమించాలని కోరారు. ఈదురుగాలులతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని, అదేవిదంగా దాల్వ వరి సాగుచేసిన రైతులకు నష్టంవాటిల్లిందని, ఈ నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేపట్టి జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించడం ద్వారా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే విధంగా కృషి చేయాలన్నారు. కూనంనేని వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ కె.సాబీర్‌ పాషా, తదితరులు పాల్గొన్నారు.

Spread the love