నెగెటివ్‌ ఇంపాక్ట్‌

Negative impact– ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌పై దుమారం
– ఈ రూల్‌తో ఆల్‌రౌండర్ల పాత్రకు పాతర
– ఆటకు సైతం హాని చేస్తుందని ఆందోళన
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 17వ సీజన్‌లో సోమవారం వరకు 38 మ్యాచులు ముగిశాయి. ఇందులో 17 ఇన్నింగ్స్‌ల్లో 200 ప్లస్‌ పరుగులు నమోదు కాగా.. 190కి పైగా పరుగులు లెక్కలేనన్ని సార్లు వచ్చాయి. 250 పైచిలుకు పరుగులు ఏకంగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో నమోదు కాగా.. అందులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఒక్క జట్టే 277/3, 287/3, 266/7 భారీ ఇన్నింగ్స్‌లతో ఊచకోత కోసింది. బ్యాటర్లు భయమెరుగని దూకుడుతో చెలరేగుతుండగా, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌తో జట్ల దూకుడు వ్యూహం మరింత పదునెక్కింది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన తొలగిస్తేనే బంతికి, బ్యాట్‌కు సరసమైన సమరం ఉంటుందని క్రికెటర్లు, వ్యాఖ్యాతలు, విశ్లేషకుల మాట.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఇంపాక్ట్‌ ప్లేయర్‌.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో చర్చనీయంశమైన వివాదాస్పద నిబంధన. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీలో 2022లో ప్రయోగాత్మకంగా అమలు చేసి.. 2023 ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ను గ్లోబల్‌ తెరపైకి తీసుకొచ్చారు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ అమల్లోకి వచ్చిన రోజు నుంచి దీనిపై విపరీత చర్చ నడుస్తుంది. 11 మంది ఆటగాళ్లు పోటీపడాల్సిన జెంటిల్‌మెన్‌ క్రికెట్‌ గేమ్‌ వాణిజ్య విలువలు, వినోదం హంగుల కోసం 12 మంది పోటీపడగల ఆటగా మార్చివేసింది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌తో కొన్ని ప్రయోజనాలు సైతం ఉన్నాయి. కానీ ఈ తర్కంలేని నిబంధనతో క్రికెట్‌కు జరుగుతున్న చేటు అంచనాకు అందటం లేదు!. ప్రతి జట్టు మ్యాచ్‌లో ఏ దశలోనైనా ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సేవలు వినియోగించుకోవచ్చు. తుది జట్టులోని ఏదేని ఆటగాడి స్థానంలో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌, స్పెషలిస్ట్‌ బౌలర్‌, స్పెషలిస్ట్‌ ఆల్‌రౌండర్‌ను జట్టులోకి తీసుకునే వెసులుబాటు ఇంపాక్ట్‌ రూల్‌తో కలిగింది. ఐపీఎల్‌లో కొన్ని జట్లు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ను గొప్పగా వాడుకుంటుండగా.. మరికొన్ని జట్లు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌తో తీవ్రంగా నష్టపోతున్నాయి.
ఆల్‌రౌండర్ల అవసరం ఏదీ?
ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ ప్రధానంగా ఆల్‌రౌండర్లపై పడింది. హార్దిక్‌ పాండ్య, మిచెల్‌ మార్ష్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, రషీద్‌ ఖాన్‌ వంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు ఇప్పటికీ తుది జట్టులో నిలుస్తున్నా.. వర్థమాన ఆల్‌రౌండర్లకు ఈ నిబంధన గుదిబండగా మారింది. సగటు ఆల్‌రౌండర్‌ను తుది జట్టులోకి తీసుకునే బదులు.. ఓ స్పెషలిస్ట్‌ బ్యాటర్‌, స్పెషలిస్ట్‌ బౌలర్‌తో ఆడే అవకాశం ఈ రూల్‌తో కలిగింది. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన క్రికెటర్లు సైతం ఈ రూల్‌ కారణంగా బరిలోకి దిగుతున్నారు. జోశ్‌ బట్లర్‌, కెఎల్‌ రాహుల్‌, రింకూ సింగ్‌ వంటి క్రికెటర్లు కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే వస్తున్నారు. ఫీల్డింగ్‌ సమయంలో వీరి స్థానంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ బరిలోకి దిగుతున్నాడు. నాణ్యమైన ఆల్‌రౌండర్ల కొరత భారత క్రికెట్‌ను ఇప్పటికీ వేధిస్తోంది. ఐపీఎల్‌తో నాణ్యమైన ఆల్‌రౌండర్లు తయారయ్యే అవకాశం పూర్తిగా పోయింది.
బౌలర్లకు మరింత కష్టం
ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ను అన్ని జట్లు ప్రధానంగా బ్యాటింగ్‌ లైనప్‌ను బలోపేతం చేసుకునేందుకు వినియోగిస్తున్నాయి. సాధారణంగా ఓ ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కుప్పకూలితే.. సహజంగానే పరుగుల రాక మందగిస్తుంది. కానీ ఇంపాక్ల్‌ పేయర్‌ రూల్‌తో సమీకరణం మారిపోయింది. నాలుగు వికెట్లు పడినా.. ఆ తర్వాత బ్యాటర్‌ స్వేచ్ఛగా దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఇంపాక్ట్‌ రూపంలో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ సేవలు అందుబాటులో ఉండటంతో ఈ సీజన్లో భారీ స్కోర్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. భయమెరుగని బ్యాటింగ్‌, అదనపు బ్యాటర్‌ సేవలతో బౌలర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ఓవర్‌లో ఆరు బంతులనూ స్టాండ్స్‌లోకి పంపించేందుకు బ్యాటర్లు దూకుడు చూపిస్తున్నారు.
మార్పు అనివార్యం
వాణిజ్య, వినోద విలువల కోసం ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ను తీసుకొచ్చినా.. అది ప్రతికూల ఫలితాలకు దారితీసింది. వచ్చే ఏడాది ఐపీఎల్‌లోనైనా ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ను తీసివేయాలని క్రికెటర్లు కోరుతున్నారు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ను కొనసాగించేందుకు మొగ్గుచూపితే.. పిచ్‌ల నాణ్యతలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే, ఐపీఎల్‌లో 300 పరుగుల స్కోరు చేసేందుకు ఎంతోకాలం పట్టదు!.

Spread the love