అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరగా పూర్తి చేయాలి

– తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలి
– డ్రయినేజీ కొలతలో నిర్మించిన అక్రమ కట్టడాలు తొలగించండి
– కలెక్టర్‌ ప్రియాంక అలా
నవతెలంగాణ-పినపాక
అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరగా పూర్తి చేయాలని, తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ప్రియాంక అలా అన్నారు. మంగళవారం మండల పరిధిలో గల అమ్మ ఆదర్శ పాఠశాల పనులు, పార్లమెంటు ఎన్నికల నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ స్టేషన్లలో ఏర్పాట్లను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాండురంగాపురం ఎంపీయూపీఎస్‌ నందు జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను, పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి అక్కడ మంచినీటి కోసం నిర్మిస్తున్న సంపును పాఠశాలకు దూరంగా కాకుండా దగ్గరగా నిర్మించాలని, పాఠశాలలో పనులన్నీ వారంలో రోజుల్లోగా పూర్తిచేయాలని ఏఏపీఎస్‌ చైర్మెన్‌, మండల అసిస్టెంట్‌ ఇంజనీర్‌ను ఆదేశించారు. పాఠశాలల్లో ఏడవ తరగతి వరకు కేవలం 38 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని రాబోయే విద్యా సంవత్సరంలో బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలలో చేరేటట్టు తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం పాండురంగాపురంలో మహిళలతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది మహిళలు అక్కడ 10 ఇళ్లకు నెలరోజులుగా నీళ్లు రావడం లేదని కలెక్టర్‌కు తెలియజేశారు. కలెక్టర్‌ ఎంపీడీవో, ఆర్డబ్ల్యూఎస్‌ ఏఈని రెండు రోజుల్లో పైప్‌ లైన్‌ వేసి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ సుందరయ్య నగర్‌, గొత్తి కోయల ఆవాసములను సందర్శించి తాగునీటి సదుపాయాలు, పాఠశాల వసతులు, వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సుందరయ్య నగర్‌ అంగన్వాడీ పాఠశాల నందు టీచర్‌ పోస్ట్‌ కాళీ ఉన్నదని గుర్తించిన కలెక్టర్‌ మూడు రోజుల్లో డిప్యూటేషన్‌ పై వేరొక టీచర్‌ను నియమించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. పాత గుంపులో నీళ్లు రావడం లేదని తెలుపగా వెంటనే చేతి పంపు లేదా ట్యాంకర్‌ ద్వారా నీటి సదుపాయాన్ని కల్పించాలని ఎంపీడీవో, ఆర్డబ్ల్యూఎస్‌ ఏఈని ఆదేశించారు. సుందరయ్య నగర్‌ గ్రామస్తులు వారి ఆవాసము నుండి అకినేపల్లి మల్లారం వరకు రోడ్డు కావాలని కలెక్టర్‌ను అడగగా ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఎటువంటి నూతన పనులు చేపట్టకూడదని కాబట్టి ఎన్నికల పూర్తి అయిన అనంతరం రోడ్డు నిర్మాణం చేపడతామని కలెక్టర్‌ తెలిపారు. జడ్పీహెచ్‌ఎస్‌ జానంపేట నందు జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులు, ఎన్నికలు నిర్వహించే బడే రూములను తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల నిర్వహించబడే రూములో నందు ఏవైనా చిన్న చిన్న రిపేర్లు ఉన్నచో వెంటనే పూర్తి చేసి ప్రతి రూమ్‌లో నాలుగు లైట్లు నాలుగు ఫ్యాన్లు ఉండే విధంగా ఏర్పాటు చేయాలని, పనులన్నీ వారం రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ బయ్యారం క్రాస్‌ రోడ్‌, జానంపేట గ్రామంలో డ్రైనేజీ వెలుపల నిర్మాణాలు ఏర్పాటు చేశారని అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రోడ్డు ఆక్రమణలో ఉన్న నిర్మాణాలను తొలగించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ విద్యా చందన, మిషన్‌ భగీరథ ఈఈ తిరుమలేష్‌, మిషన్‌ భగీరథ నలిని, తహసీల్దార్‌ టి.సూర్యనారాయణ, మణుగూరు తహసీల్దార్‌ రాఘవరెడ్డి, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్‌ ఏఈ విజయ కృష్ణ, ఎంఈఓ వీరస్వామి, ఏపీఎంలు, ఏపీవోలు, ఈసీలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love