రాబోయే తరాలకూ ఉపయోగపడే పుస్తకం

A useful book for future generations– ‘తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర’ పుస్తక ఆవిష్కరణలో చిరంజీవి
భారతీయ తొలి సినిమా పత్రిక విశేషాలు మొదలుకుని ఆ తర్వాత పరిణామ క్రమంలో పనిచేసిన అలనాటి సినీ జర్నలిస్టుల నుంచి నేటి సినీ జర్నలిస్టుల వరకు సమాచారాన్ని శోధించి, సేకరించి సీనియర్‌ సినీ జర్నలిస్ట్‌ వినాయకరావు రచించిన ‘తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర’ పుస్తకాన్ని చిరంజీవి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”నా కెరీర్‌ మొదట్నుంచి సినీ రచయితలు, జర్నలిస్టులతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. జర్నలిస్టుల పెన్నుకు ఉన్న పవర్‌ అంతా ఇంతా కాదు. దాని ద్వారా ఎంత మంచి అయినా చెప్పొచ్చు. అయితే ఒక్కోసారి వాస్తవానికి దూరంగా కొందరు జర్నలిస్టులు రాసిన వార్తలు దుమారం సష్టిస్తుంటాయి. నా మటుకు నేను కూడా కొన్ని వార్తల కారణంగా కలత చెందిన సందర్భాలు లేకపోలేదు. ఎప్పుడో వచ్చిన ఆ వార్తల తాలూకు ప్రభావం నేటికీ వెంటాడుతూనే ఉండటం బాధాకరం. మరోవైపు నా తప్పులను ఎత్తిచూపి, వాటిని నేను సరిదిద్దుకునేందుకు ప్రేరణ కలిగించిన గుడిపూడి శ్రీహరి వంటి జర్నలిస్టులు ఎంతోమంది ఉన్నారు. అందుకే పెన్ను పవర్‌ కలిగిన జర్నలిస్టులు వాస్తవాలను ప్రతిబింబిస్తూ బాధ్యతగా ముందుకు సాగినపుడు ఎందరికో స్ఫూర్తిదాయకమవుతుంది. జర్నలిస్ట్‌ వినాయకరావు ఏ పుస్తకం రాసినా కూలంకషంగా చర్చిస్తూ, లోతుల్లోకి వెళ్లి రాయడం ఆయనకు అలవాటు..అలాగే అరుదైన ఫోటోలు సేకరిస్తుంటాడు. ముందు తరాలను దష్టిలో పెట్టుకుని ఆయన చేసే ప్రయత్నం అభినందనీయం.ఎన్టీఆర్‌, దాసరి, కష్ణ, నా గురించి ఎన్నో అరుదైన పుస్తకాలు రాశాడు. ఇలాంటి వాళ్ళు పుస్తకాలను రాసే ప్రయత్నాన్ని మానుకోకూడడు. నేను కూడా ఈ పుస్తకాన్ని కొంటున్నాను’ అని అన్నారు.
పుస్తక రచయిత, సీనియర్‌ జర్నలిస్ట్‌ వినాయకరావు మాట్లాడుతూ, ”నేను రాసిన పన్నెండవ పుస్తకం ఇది. జర్నలిస్టులగా మన చరిత్రను మనం ఎందుకు చెప్పుకోకూడదు అన్న ఆలోచన నుంచి పుట్టిన పుస్తకం ఇది. టాకీ కాలం మొదలైనప్పట్నుంచి నాటి సినీ జర్నలిస్టుల మొదలుకుని నేటి సినీ జర్నలిస్టుల వరకు సమాచారాన్ని ఇందులో అందించాను’ అని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రభు స్వాగతం పలుకగా, వినాయకరావు రాసిన వివిధ పుస్తకాలను వివరిస్తూ, ఈ పుస్తక విషయాలను మరో సీనియర్‌ జర్నలిస్ట్‌ రెంటాల జయదేవ్‌ సభలో ప్రస్థావించారు. చిరంజీవి ఇంటి ప్రాంగణంలో ఆహ్లాదభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Spread the love