అగ్నిపర్వతం వద్ద ఫొటో దిగుతూ జారిపడి మహిళ మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండోనేసియాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఇజెన్ అగ్నిపర్వత సమూహ పార్క్ వద్ద విషాదం చోటుచేసుకుంది. అగ్నిపర్వతాల సందర్శనకు వచ్చిన ఓ చైనా మహిళ ఫొటో తీసుకొనే క్రమంలో ప్రమాదవశాత్తూ కాలుజారి అగ్నిపర్వత బిలంలో పడి మృతిచెందింది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం హావాంగ్ లిహాంగ్ అనే మహిళ తన భర్తతో కలసి అగ్నిపర్వతం విరజిమ్మే నీలి మంటలను తిలకించేందుకు వచ్చింది. సూర్యోదయాన్ని తిలకించేందుకు అగ్నిపర్వత బిలం అంచుకు ఆ దంపతులు చేరుకున్నారని పోలీసులు తెలిపారు. ఫొటోలు తీసుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పలుమార్లు హెచ్చరించడంతో తొలుత వారిద్దరూ బిలానికి కాస్త దూరంగానే నిలబడ్డారని టూర్ గైడ్ అధికారులకు చెప్పాడు. అయితే ఆ తర్వాత ఆ మహిళ సెల్ఫీ కోసం వెనక్కి నడిచే క్రమంలో ఆమె డ్రెస్ కాళ్లకు తగిలి సుమారు 246 అడుగుల (75 మీటర్లు) ఎత్తు నుంచి బిలంలోకి పడి మృతిచెందిందని న్యూయార్క్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ఆమె మృతదేహాన్ని బిలంలోంచి బయటకు తీసుకొచ్చేందుకు రెండు గంటల సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు.

Spread the love