సీపీఎస్‌ను రద్దు చేసి దేశానికే తెలంగాణ దిక్సూచి కావాలి

– రాష్ట్రంలో పాత పెన్షన్‌ను పునరుద్ధరించాల్సిందే
– ఓపీఎస్‌ను అమలు చేస్తే కేసీఆర్‌తోనే మేము : సీపీఎస్‌ యూనియన్‌ అధ్యక్షులు స్థితప్రజ్ఞ విజ్ఞప్తి
– హైదరాబాద్‌లో పాత పెన్షన్‌ సాధన సాకార సభ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోనూ పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌) పునరుద్దలించాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయిస్‌ యూనియన్‌ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ డిమాండ్‌ చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను రద్దు చేసి దేశానికే తెలంగాణ మరోసారి దిక్సూచి కావాలని కోరారు. ఓపీఎస్‌ను అమలు చేస్తే సీఎం కేసీఆర్‌తోనే ఉంటామని స్పష్టం చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలంటూ టీఎస్‌సీపీఎస్‌ఈయూ ఆధ్వర్యంలో శనివారం చలో హైదరాబాద్‌ కార్యక్రమంలో భాగంగా పాత పెన్షన్‌ సాధన సాకార సభను నిర్వహించారు. ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌కు వేలాదిగా ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ‘సీపీఎస్‌ అంతం… ఓపీఎస్‌ పంతం’అంటూ పెద్దఎత్తున నినదించారు. గతనెల 16న జోగులాంబ గద్వాల జిల్లాలో పాత పెన్షన్‌ సాధన సంకల్ప రథయాత్ర ప్రారంభమై అదేనెల 31న యాదాద్రిలో ముగిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ ఆఫీస్‌ సబార్డినేట్‌ నుంచి అధికారిదాకా, డ్రైవర్‌ నుంచి డాక్టర్‌ దాకా, ఎస్జీటీ నుంచి గెజిటెడ్‌ హెడ్మాస్టర్‌ దాకా, పోలీసు నుంచి క్లర్క్‌ దాకా పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఓపీఎస్‌ను పునరుద్ధరిం చాలని కోరారు. సీపీఎస్‌ అంతం కోసమే ఈ సంఘం ఆవిర్భవించిందని గుర్తు చేశారు. సీపీఎస్‌ను రద్దు చేస్తే ఈ సంఘంతో పనిలేదన్నారు. టీఎస్‌సీపీఎస్‌ఈయూ, ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సహకారంతో సీఎం కేసీఆర్‌ సీపీఎస్‌ ఉద్యోగులకు గ్రాట్యూటీ, కుటుంబ పెన్షన్‌ను వర్తింపజేశారని అన్నారు. సీఎంపై పూర్తి నమ్మకంతో ఉన్నామని చెప్పారు. ఈ సమస్య తీవ్రతను కేసీఆర్‌కు చేరవేయడంలో అధికారులు, సంఘాల నాయకులు విఫలమయ్యారని విమర్శించారు. అవకాశమిస్తే ప్రభుత్వానికి తమ సమస్యను వివరిస్తామని అన్నారు. అయితే సీపీఎస్‌ను రద్దు చేసే దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిది కావాలని కోరారు.
ఇప్పుడే సీపీఎస్‌ను రద్దు చేస్తే ప్రభుత్వానికి నయాపైసా భారం ఉండబోదన్నారు. రూ.16,500 కోట్ల పెన్షన్‌ నిధి సమకూరుతుందని వివరించారు. పెన్షన్‌ నిధిని తిరిగి రాష్ట్రాలకు చెల్లించాలంటూ అక్టోబర్‌ ఒకటిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రాంలీల మైదానంలో చేపడతామని చెప్పారు. 14 ఏండ్ల సర్వీసు పూర్తిచేసి ఇటీవల రిటైరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ఖదీర్‌కు రూ.1,954 పెన్షన్‌ తీసుకుంటున్నారని వివరించారు. అతను రూ.7,500కు కూరగాయల దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారంటూ వీడియోను ప్రదర్శించారు. ఎన్‌ఎంఓపీఎస్‌ జాతీయ అధ్యక్షులు విజరుకుమార్‌ బందు, జార్ఖండ్‌ అధ్యక్షులు విక్రమ్‌ సింగ్‌, మహారాష్ట్ర అధ్యక్షులు విటేష్‌ ఖండేల్కర్‌, ఏపీ అధ్యక్షులు పల్లెల రామాంజనేయులు, ఛత్తీస్‌ఘడ్‌ అధ్యక్షులు రాకేశ్‌ సింగ్‌, తమిళనాడు అధ్యక్షులు ఆరోగ్యదాస్‌, కర్నాటక అధ్యక్షులు శాంతారామ్‌, పంజాబ్‌ అధ్యక్షులు సుఖ్‌దీప్‌సింగ్‌, జ్యుడీషియరీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు సుబ్బయ్య, ఎస్టీయూటీఎస్‌ అధ్యక్షులు సదానందంగౌడ్‌, టీఆర్టీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కటకం రమేష్‌, ఎస్జీటీయూ అధ్యక్షులు మహిపాల్‌రెడ్డి, తపస్‌ ప్రధాన కార్యదర్శి నవాత్‌ సురేష్‌ మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని కోరారు. దాన్ని రద్దు చేసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. ఏపీలో తెచ్చే జీపీఎస్‌తో ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. సీపీఎస్‌ కంటే మరింత ఘోరమైంది జీపీఎస్‌ అని విమర్శించారు. ఉద్యోగులకు సామాజిక భద్రత కావాలంటే ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌సీపీఎస్‌ఈయూ ప్రధాన కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్‌, కోశాధికారి నరేష్‌గౌడ్‌, సాంస్కృతిక కార్యదర్శి చింతల రాకేశ్‌ భవాని, పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి, వెటర్నరీ ఫోరం అధ్యక్షులు అభిషేక్‌రెడ్డి, బ్లైండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి అనిల్‌, టీటీఎఫ్‌ అధ్యక్షులు లక్ష్మణ్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love