ప్రొఫెసర్‌ హాజింగ్‌కు విద్యావేత్తల సంఘీభావం

– 32 మంది స్వదేశీ, విదేశీ విద్యావేత్తల సంయుక్త ప్రకటన
న్యూఢిల్లీ: మణిపూర్‌ ఘటనపై మాట్లాడి క్రిమినల్‌ కేసును ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌ ఖమ్‌ ఖాన్‌ సువాన్‌ హాజింగ్‌కు విద్యావేత్తల నుంచి మద్దతు లభించింది. ఆయనకు సంఘీభావంగా భారత్‌తో పాటు విదేశాలలోని విశ్వవిద్యాలయాలకు చెందిన 32 మంది విద్యావేత్తల బందం ఒక ప్రకటన విడుదల చేసింది. హాజింగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో పొలిటికల్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
హాజింగ్‌కు వ్యతిరేకంగా మెయిటీ ట్రైబ్స్‌ యూనియన్‌ (ఎంటీయూ) సభ్యుడు మణిహార్‌ మొయిరంగ్థేమ్‌ సింగ్‌ అతనిపై చేసిన ఫిర్యాదు చేశారు. దీనిపై చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ అషేమ్‌ తరుణకుమారి దేవి విచారణ జరిపారు. అనంతరం ఈనెల 6న ఇంఫాల్‌ ఈస్ట్‌ జిల్లా కోర్టు హాజింగ్‌కు సమన్లు జారీ చేసింది. మణిపూర్‌లో కొనసాగుతున్న జాతి సంఘర్షణ గురించి హాజింగ్‌ ఒక ఇంటర్వ్యూలో మణిపూర్‌ అంశంపై వ్యాఖ్యలు చేశారు.
అయితే, హాజింగ్‌పై చర్యను విద్యావేత్తలు తప్పుబడుతూ ఒక సంయుక్త ప్రకటనను వారు విడుదల చేశారు. అందులో వారు తమ ఆందోళనల ను వెలిబుచ్చారు. ”ప్రొఫెసర్‌ హాజింగ్‌కు రెండు దశాబ్దాలకు పైగా ఈశాన్య భారతదేశంలోని సమాఖ్య వాదం, జాతి సంఘర్షణలు, జాతీయవాదం, పౌర జీవితం, అంతర్‌-జాతి సంబంధాలు, భారతదేశం లోని రాజకీయ ప్రక్రియలపై నిష్కళంకమైన పరిశోధనలు చేశారు. అతను దేశంలో, విదేశాలలో అత్యంత ప్రసిద్ధ పత్రికలలో ప్రచురించిన విస్తృతంగా ఉదహరించబడిన రచయిత. అంతేకాకుండా, అతను ఈ ప్రాంతంలోని అనేక తరాల యువతకు మార్గ దర్శకత్వం వహించాడు. భారతదేశం అంతటా యువ పరిశోధకులను ప్రేరేపించాడు. పరిశోధన పట్ల అతని నిబద్ధత ప్రశంసనీయం. అతను విద్యా సంఘంలో చాలా గౌరవనీయమైన సభ్యుడు. అతని అభిప్రాయాలు విద్యాసంస్థలకు వెలుపల ఉన్న వ్యక్తులచే నేరపూరితంగా పరిగణించబడటం చాలా దురదృష్టకరం. ప్రజా క్షేత్రంలో తమ అభిప్రాయా లను పంచుకునే విద్యావేత్తలపై క్రిమినల్‌ ఫిర్యాదుల దాఖలు ప్రమాదకరమైన దృష్టాంతాన్ని ఏర్పరు స్తాయి. ఇది ప్రసంగం, ఆలోచన, ప్రజాస్వామ్య అభి ప్రాయాల మార్పిడికి అనవసరమైన సెన్సార్‌షిప్‌కు మార్గం కల్పిస్తుంది. ఈశాన్య భారతదేశంలోని సమస్యల గురించి పని చేసే, రాసే నిపుణులుగా, ఇటువంటి చర్యలు విద్యాసంబంధ పరిశోధనలకు సురక్షితమైన స్థలాలను నాశనం చేయడంతో సమానమని మేము భావిస్తున్నాము. ఇది మన తోటివారిలోనే కాదు.. తర్వాతి తరం వారిలో కూడా మేధోపరమైన ఎదుగుదలకు, ఆలోచనల మార్పిడికి ఆటంకం కలిగిస్తుంది” అని ఆ ప్రకటనలో 32 మంది విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

Spread the love