అదానీపై విచారణ జరపాల్సిందే…

– కాంగ్రెస్‌ చలో రాజ్‌భవన్‌
– గాంధీభవన్‌ నుంచి ప్రదర్శన
– అడ్డుకున్న పోలీసులు…వాగ్వాదం…
– ఖైరతాబాద్‌ చౌరస్తాలో నేతల అరెస్టు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అదానీ షేర్ల పతనంపై పార్లమెంటరీ కమిటీ వేయాలని, క్రోని క్యాపిటలిజానికి వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం చలో రాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. గాంధీభవన్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఖైరతాబాద్‌ చౌరస్తాలో ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు రోడ్డుకు అడ్డంగా పెట్టారు. ఈ సందర్భంగా నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మోడీకి, అదానీకి వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలంటూ నినదించారు.ఎల్‌ఐసీని రక్షించుకుందామంటూ నాయకులు నినదించారు. ఈక్రమంలో నాయకులను అరెస్టు చేసి పంజాగుట్ట, గోషామహల్‌ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవస్థలను ఏర్పాటు చేసి నవభారత నిర్మాణం చేసిందన్నారు.
మాయమాటలు
చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం… కాంగ్రెస్‌ సృష్టించిన ప్రభుత్వ సంపదను క్రోని క్యాపిటలిస్టులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోడీ నిర్వీర్యం చేస్తూ వ్యవస్థలను దిగజార్చుతున్నారని విమర్శించారు. 130 కోట్ల ప్రజలకు చెందిన సంపదను కార్పొరేట్లకు పంచి పెడుతూ ప్రజలను పేదలుగా మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ఆస్తులు ఒక్కరిద్దరికి కట్టబెడుతున్నారని విమర్శించారు. దేశ సంపద ప్రజలకు చెందాలన్నారు. కాంగ్రెస్‌ ప్రజల కోసం పని చేసిందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మన దేశం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం కోసం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పాదయాత్ర చేశారని చెప్పారు. హిండెన్‌బర్గ్‌లో వచ్చిన కథనం ప్రపంచాన్ని షేక్‌ చేసిందని గుర్తు చేశారు. ఈ దేశం నుంచి మోడీని వదిలించుకోవాలని పిలుపునిచ్చారు. అదానీపై మోడీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తమ పోరాటం ప్రజల కోసం, ఈ దేశం సంపద రక్షణ కోసమని చెప్పారు. అరెస్టు అయిన వారిలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్‌కుమార్‌ యాదవ్‌, మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్‌ జావిద్‌, రోహిత్‌ చౌదరి, జి చిన్నారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు రవి, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షులు రోహిన్‌ రెడ్డి, నాయకులు చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, దీపక్‌జాన్‌, సామ రామ్మోహన్‌రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, వెంకట్‌, శివసేనారెడ్డి, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మెన్లతోపాటు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Spread the love