ఆదివాసులకు వసతులు కల్పించాలి

ఆదివాసులకు వసతులు కల్పించాలి– కలెక్టరేట్‌ ఎదుట బైటాయింపు
నవతెలంగాణ- ఆదిలాబాద్‌టౌన్‌
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని కుమురం భీం కాలనీలో నివాసముంటున్న ఆదివాసులకు పట్టాలతో పాటు మౌలిక వసతులు కల్పించాలని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోడం గణేష్‌ అన్నారు. బుధవారం ఆదివాసులు నోటికి నల్లగుడ్డలు కట్టుకొని ర్యాలీగా కలెక్టరేట్‌ వరకు వచ్చారు. ప్రధాన గేటు ఎదుట బైటాయించి నినాదాలు చేశారు. వీరి ఆందోళనకు బీజేపీ రాష్ట్ర నాయకులు చిట్యాల సుహాసినిరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గోడం గణేష్‌ మాట్లాడుతూ.. ఏండ్లుగా కుమురం భీం కాలనీ ఆదివాసులు పట్టాలు, మౌలిక వసతుల కోసం ఉద్యమాలు చేస్తున్నా అధికారుల నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదన్నారు. ఇలానే నిర్లక్ష్యం చేస్తే ఆదివాసులు మరో మిలిటెంట్‌ ఉద్యమం చేయాల్సి వస్తుందన్నారు. కాలనీలో నివాసం ఉంటున్న వారికి జీవో 58 ప్రకారం పట్టాలు జారీ చేయడంతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ నాయకులు చిట్యాల సుహాసినిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆదివాసుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క స్పందించి ఆదివాసులకు మౌలిక సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Spread the love