ఒక్క నెలలోనే రూ.4,770 కోట్ల బిల్లు
వాషింగ్టన్ : కంపెనీలలో ఉత్పాదకతను పెంచేందుకు కృత్రిమ మేధ (ఏఐ) టూల్స్ వినియోగం విపరీతంగా పెరుగుతున్నప్పటికీ.. వాటి నిర్వహణ ఖర్చులు ఊహించని విధంగా భారీ ఆర్థిక భారాన్ని మోపుతూ కంపెనీల ఉనికికే ముప్పుగా మారుతున్నాయి. ఇటీవల ఆక్సియోస్ నివేదిక ప్రకారం.. ఒక ప్రముఖ కంపెనీ తమ ఉద్యోగుల క్లాడ్ ఎఐ లైసెన్స్‌లపై ఎలాంటి వినియోగ పరిమితులు విధించకపోవడంతో కేవలం ఒక్క నెలలోనే ఏకంగా 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,770 కోట్లు) భారీ బిల్లును అందుకుని నివ్వెరపోయింది. ఏఐ టూల్స్ సాధారణంగా టోకెన్ల ఆధారంగా ఛార్జ్ చేస్తాయి కాబట్టి.. సదరు కంపెనీ ఉద్యోగులు నిర్దేశిత పరిమితులను దాటి అపరిమితంగా వాడటమే ఈ పెనుభారానికి కారణమైంది. ఈ పరిస్థితి ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చకు దారితీస్తూ ది బిగ్ షార్ట్ సినిమాలోని ఆర్థిక బుడగ క్షణాలను గుర్తుచేస్తోందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఒక తప్పుడు ఎల్‌ఎల్‌ఎమ్ టోకెన్ వినియోగం వల్ల రాబోయే రోజుల్లో కంపెనీలు దివాలా తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలా ఎఐ ఖర్చులు నియంత్రణ తప్పుతుండటంతో పలు దిగ్గజ కంపెనీలు తమ వ్యూహాలను పునరాలోచిస్తూ ఎఐ బడ్జెట్‌లను తగ్గించుకోవడం ప్రారంభించాయి. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ సంస్థ ఇప్పటికే తన క్లాడ్ కోడ్ లైసెన్స్‌లను మెజారిటీ భాగం రద్దు చేసుకుని జూన్ 30 నాటికి సొంత అంతర్గత ఎఐ టూల్‌కు మారాలని యోచిస్తోంది. ఉబెర్ వంటి సంస్థలు తమ వార్షిక ఎఐ బడ్జెట్‌ను కేవలం 5 నెలల్లోనే పూర్తిగా వాడేశాయి. ఖర్చుల తీవ్రత పెరగడంతో, ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ లాంటి ఎఐ నిపుణులు సైతం వైట్ కాలర్ ఉద్యోగాలకు ఏఐ వల్ల ముప్పు వాటిల్లుతుందంటూ గతంలో తాము చేసిన హెచ్చరికల నుండి కొద్దిగా వెనక్కి తగ్గుతున్నారు. కాగా.. ఎన్విడియా సిఇఒ జెన్సన్ హువాంగ్ ఇటీవల మాట్లాడుతూ.. 500,000 డాలర్లు (సుమారు రూ.4.1 కోట్లు) జీతం తీసుకునే ఇంజనీర్ కనీసం 250,000 డాలర్లు (సుమారు రూ.2 కోట్లు) విలువైన టోకెన్లనైనా వినియోగించకపోతే తాను ఆందోళన చెందుతానని, ఇంజనీర్ల సామర్థ్యాన్ని టోకెన్ల ఆధారంగానే అంచనా వేయాలని పేర్కొనడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐని భారీ స్థాయిలో నిర్వహించడం కంపెనీల ఆర్థిక వ్యవస్థలకు ఒక పెద్ద సవాలుగా మారుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
కంపెనీలను ముంచేస్తున్న ఏఐ క్లాడ్ ఖర్చులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



