న్యూఢిల్లీ : ఫిన్‌టెక్ సంస్థ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కొత్తగా ఎకో ఫ్రెండ్లీ డెబిట్ కార్డ్‌ను ఆవిష్కరించి నట్లు ప్రకటించింది. దేశంలోనే తొలిసారి పర్యావరణ అనుకూల పదార్థం ఆర్ పీవీసీ మెటీరియల్‌తో తయారు చేసినట్టు పేర్కొంది. తమ సంస్థలో సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో కొత్త, ఇప్పటికే ఖాతాదారులుగా ఉన్న వారు దీన్ని పొందవచ్చని వెల్లడించింది. ఆర్‌పిసి కార్డులతో హైడ్రోకర్బన్ వినియోగంలో 43 శాతం తగ్గించొచ్చని పేర్కొంది. ఈ కార్డ్ ద్వారా రూ.10,000 వరకు ఈ-కామర్స్ ప్రయోజనాలు పొందవచ్చని ఆ సంస్థ సీఈఓ గణేష్ అనంతనారాయణన్ పేర్కొన్నారు.
ఏడాదిలో ఆకాశ ఎయిర్‌కు 4.9శాతం వాటా
న్యూఢిల్లీ : భారత విమానయాన రంగంలోకి ప్రవేశించిన అనాతికాలంలోనే మెరుగైన ప్రగతిని కనబర్చుతున్నట్లు ఆకాశ ఎయిర్ తెలిపింది. ఏడాది కాలంలోనే 0 శాతం నుంచి 4.9 శాతానికి మార్కెట్ వాటాను పెంచుకున్నట్లు తెలిపింది. కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి 84 శాతం కంటే ఎక్కువ ప్రయాణీకుల లోడ్ ఫ్యాక్టర్‌ను నమోదు చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అక్యూపెన్సీ 90 శాతానికి చేరినట్టు పేర్కొంది. భారత్‌లో ఈ సంస్థ 2022 ఆగస్ట్‌లో తొలిసారి విమాన కార్యకలాపాలను ప్రారంభించింది.