కొత్త మెనూకు బడ్జెట్‌ను కేటాయించండి

Allocate a budget to the new menu– అప్పటివరకూ పాతమెనూనే కొనసాగిస్తాం
– పెరిగిన వేతనాలు తక్షణమే ఇవ్వాలి
– మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి కొత్త మెనూకు సంబంధించిన బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేటాయించాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. అప్పటి వరకూ పాతమెనూనే కొనసాగించాలనీ, కార్మికులకు పెరిగిన వేతనాలను వెంటనే ఇవ్వాలని కోరింది.
ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో విద్యా శాఖామంత్రి సబిత ఇంద్రారెడ్డికి తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ.రమ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,201 మంది మధ్యాహ్న భోజన కార్మికులు వంట నిర్వహణలో పని చేస్తున్నారని తెలిపారు. మధ్యాహ్న భోజన నిర్వహణను అక్షయ పాత్ర లాంటి స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వొద్దని కోరారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో పోల్చితే కేటాయించిన బడ్జెట్‌ సరిపోవడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
పెండింగ్‌లో ఉన్న కోడిగుడ్ల బిల్లులు విడుదల చేయాలనీ, ఇతర పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కొత్త మెనూను (రాగి జావ, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ బిర్యానీ, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీ) పెట్టాలని పాఠశాలల్లో ఒత్తిడి చేయడం తగదని పేర్కొన్నారు. ఇప్పటివరకు వండిపెట్టిన వాటికే బిల్లులు రాలేదని వాపోయారు. కొత్త మెనూకు బడ్జెట్‌ కేటాయించకుండా వండిపెట్టడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. గుడ్లకు అదనంగా బడ్జెట్‌ కేటాయించాలనీ, అవసరమైన గ్యాస్‌ను సబ్సిడీకి ఇవ్వాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గుర్తింపు కార్డులను ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Spread the love