సంక్షోభంలో అమెరికన్‌ బ్యాంకులు

– వారంలో మూడు మూత
– తాజాగా సిగేచర్‌ బ్యాంక్‌ దివాళా
– కొంపముంచుతున్న క్రిప్టోలు
– హెచ్‌ఎస్‌బిసి చేతికి ఎస్‌విబి యుకె విభాగం
– ఒత్తిడిలో స్టాక్‌ ఎక్సేంజీలు
వాషింగ్టన్‌ : పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అమెరికాలో దిగ్గజ ప్రయివేటు బ్యాంక్‌లు కుప్పకూలుతున్నాయి. తాజాగా సిగేచర్‌ బ్యాంక్‌ మూత పడింది. దీంతో గడిచిన వారం రోజుల్లోనే సిల్వర్‌ గేట్‌ బ్యాంక్‌, సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌విబి), సిగేచర్‌ బ్యాంక్‌లు దివాళా తీసినట్లయ్యింది. ఈ పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్‌ రంగంపై తీవ్ర ఆందోళనలు, భయాలు వ్యక్తం అవుతోన్నాయి. న్యూయార్క్‌ కేంద్రంగా పని చేస్తోన్న సిగేచర్‌ బ్యాంక్‌ను మూత వేస్తూ.. తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నామని ఆదివారం యుఎస్‌ ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌ఐడిసి) ప్రకటించింది. సిగేచర్‌ బ్యాంకులో డిపాజిటర్లు తమ సొమ్ము ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇచ్చామని ఎఫ్‌ఐడిసి తెలిపింది. ఇందుకోసం తాత్కాలికంగా బ్రిడ్జి బ్యాంక్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. కొత్తగా ఏర్పాటు చేసిన బ్రిడ్జి బ్యాంకుకు గ్రేగ్‌ కార్మికేల్‌ను సిఇఒగా నియమించింది. అమెరికాలో ఆర్థిక సంక్షోభానికి తోడు క్రిప్టో కరెన్సీ డిపాజిట్లతో సంబంధాలు కలిగిన బ్యాంక్‌ల పరపతి దెబ్బతింటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పరిణామాలతో సోమవారం అమెరికన్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఎస్‌అండ్‌పి సూచీ 1 శాతం పతనమయ్యింది. బ్యాంక్‌ షేర్లు 2-6 శాతం మేర క్షీణతను ఎదుర్కొన్నాయి.
ఏమి జరుగుతోంది..!
సిగేచర్‌ బ్యాంక్‌ ఎక్కువగా క్రిప్టో డిపాజిట్లను స్వీకరించింది. 2022 డిసెంబర్‌ ముగింపు నాటికి 110.36 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.9 లక్షల కోట్ల పైగా) ఆస్తులతో పాటు 88.59 బిలియన్‌ డాలర్ల (రూ.7.30 లక్షల కోట్లు) డిపాజిట్లను కలిగి ఉంది. బ్యాంక్‌ మొత్తం డిపాజిట్లలో మూడో వంతు క్రిప్టో కరెన్సీ నుంచి వచ్చినవి కావడం గమనార్హం. ఈ బ్యాంక్‌ వద్ద 16.5 బిలియన్‌ డాలర్ల విలువ చేసే క్రిప్టో డిపాజిట్లు ఉన్నాయి. ఈ డిపా జిట్లను త్వరలో ఎనిమిది బిలియన్‌ డాలర్లకు కుదిస్తామని 2022 డిసెంబర్‌లో వెల్లడించింది. కృత్రిమ విలువ కలిగిన క్రిప్టో కరెన్సీల విలువ ఇటీవల భారీగా పతనమయ్యింది. 2018లో ఈ బ్యాంక్‌ క్రిప్టో ఆస్తుల డిపాజిట్ల విభాగంలోకి ప్రవేశించింది. ఇటీవల ఎఫ్‌టిఎక్స్‌ క్రిప్టో ఎక్సేంజీ 2022 చివరలో దివాలా తీసింది. ఈ కారణంతోనే క్రిప్టోపై అధిక దృష్టి సారించిన సిల్వర్‌ గేట్‌ బ్యాంక్‌ కూడా తన కార్యకలా పాలను రద్దు చేసుకుంటున్నట్లు మార్చి 8న ప్రకటించింది. ఎఫ్‌టిఎక్స్‌ దివాళాతో సిల్వర్‌ గేట్‌ 2022 చివరి త్రైమాసికం లో 1 బిలియన్‌ డాలర్లు(రూ.8వేల కోట్లు) నష్టాలు చవి చూసింది. సిల్వర్‌గేట్‌కు ఎఫ్‌టిఎక్స్‌ అతి పెద్ద క్లయింట్‌గా ఉంది. ఎఫ్‌టిఎక్స్‌ క్రిప్టో ఎక్సేంజీ, డిజిటల్‌ కరెన్సీ ఇన్వెస్టర్లతో ఆయా బ్యాంక్‌లు ఎక్కువగా సంబంధాలు, లావాదేవీలు కలి గి ఉన్నాయి. ఒకప్పుడు బిట్‌ కాయిన్‌ విలువ 65వేల డాలర్లు గా ఉండగా.. ఇప్పుడు ఆ విలువ 18 వేల డాలర్లకు పడిపో యింది. తాజా పరిణా మంతో బిట్‌ కాయిన్‌ సహా క్రిప్టో కరెన్సీలన్నీ తీవ్ర పతనాన్ని చూడనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పటిష్టంగానే ఆర్థిక వ్యవస్థ : బైడెన్‌
అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. వరుసగా రెండు పెద్ద బ్యాంక్‌లు దివాళా తీయడంతో ఆయన ఈ ప్రకటన చేశారు. ఖాతాదారుల డిపాజిట్లకు డోకా లేదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటానికే సిగేచర్‌ బ్యాంకుపై చర్యలు తీసుకుంటు న్నామన్నారు. ఎస్‌విబి, సిగేచర్‌ బ్యాంక్‌ల పతనానికి కారణమైన వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటా మన్నారు. ఉద్యోగులు, చిన్న వ్యాపారాలు, పన్ను చెల్లింపు దారులు సహా మొత్తం ఆర్థిక వ్యవస్థను రక్షించేలా నియంత్రణ సంస్థ లు ఒక పరిష్కారాన్ని కనుగొన్నాయని ఆయన తెలిపారు.
రూ.99కే ఎస్‌విబి విక్రయం
కేవలం ఒక్క పౌండ్‌ (రూ.99కి సమానం)కే ఎస్‌విబి బ్రిటన్‌ విభాగాన్ని హెచ్‌ఎస్‌బిసికి అప్పగిస్తూ ఆ దేశ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ నిర్ణయం తీసుకుంది. దివాళా ప్రక్రియలో భాగంగా సులువుగా దీన్ని అప్పగించింది. డిపాజిటర్లకు రక్షణ కల్పించే ఉద్దేశంతో హెచ్‌ఎస్‌బిసికి విక్రయించినట్లు బ్రిటన్‌ ట్రెజరీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ఓ ప్రకటనలో తెలి పాయి. ఈ లావాదేవీలో పన్ను చెల్లింపుదారుల సొమ్ము ను ఏమాత్రం వినియోగించలేదని ట్రెజరీ చీఫ్‌ జెరెమీ హంట్‌ తెలిపారు. తక్షణమే కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యిందని హెచ్‌ఎస్‌బిసి తెలిపింది. దీంతో అక్కడి ఎస్‌విబి ఉద్యోగుల ను ఖాతాదారులను హెచ్‌ఎస్‌బిసిలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఎస్‌విబి యుకె విభాగం వద్ద 5.5 బిలియన్‌ డాలర్ల రుణాలు, 6.7 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. మాంద్యం చాయలకు తోడు బ్యాంక్‌ల దివాళా పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్‌ షేర్లను, స్టాక్‌ మార్కెట్లను కుప్పకూలేలా చేస్తున్నాయి. 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం పునరావృతం అయ్యే ప్రమాదం లేకపోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Spread the love