అమిత్‌ నోట అసత్యాల చిట్టా

అమిత్‌ నోట అసత్యాల చిట్టా– విరాళాలపై తప్పుడు లెక్కలు
– బాండ్ల ద్వారా బీజేపీకి అందింది రూ.8,252 కోట్లు : ఆరు వేల కోట్లేనన్న హోం మంత్రి
న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి అందిన విరాళాలు అక్షరాలా రూ.8,252 కోట్లు. అయితే మొత్తం రూ.20,000 కోట్ల విలువ కలిగిన బాండ్లలో తమకు వచ్చింది రూ.6,000 కోట్లేనని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శుక్రవారం ‘ఇండియా టుడే’ సదస్సులో తెలియజేశారు. అయితే మంత్రి చెప్పిన ఈ రెండు సంఖ్యలూ తప్పే. ఎస్‌బీఐ అందజేసిన సమాచారం ప్రకారం 2018 మార్చి నుండి ఈ సంవత్సరం జనవరి వరకూ రూ.16,492 కోట్ల రూపాయల విలువైన బాండ్లను రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్నాయి. వీటిలో అత్యధికంగా రూ.8,252 కోట్ల విరాళాన్ని బీజేపీ తన ఖాతాలో జమ చేసుకుంది. అంటే ఎస్‌బీఐ విక్రయించిన బాండ్ల విలువలో సగం బీజేపీయే సొంతం చేసుకుంది.
ఐటీ, ఈడీ దాడుల తర్వాతే అనేక కంపెనీలు ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశాయంటూ వచ్చిన ఆరోపణలను సదస్సులో ఇండియా టుడే పాత్రికేయుడు రాహుల్‌ కన్వల్‌ హోం మంత్రి దృష్టికి తెచ్చారు. అయితే దీనికి షా నేరుగా సమాధానం చెప్పలేదు. దానికి బదులుగా బీజేపీని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. ‘బీజేపీకి సుమారు రూ.6,000 కోట్ల విలువైన బాండ్లు అందాయి. మొత్తం బాండ్ల విలువ రూ.20,000 కోట్లు. మరి మిగిలిన రూ.14,000 కోట్లు ఎక్కడికి పోయాయి?’ అని ఆయన ప్రశ్నించారు. బాండ్ల ద్వారా ఇతర పార్టీలు పొందిన విరాళాల సమాచారాన్ని కూడా హోం మంత్రి ఏకరువు పెట్టారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు రూ.1,600 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.1,400 కోట్లు, బీఆర్‌ఎస్‌కు రూ.1,200 కోట్లు, బీజేడీకి రూ.775 కోట్లు, డీఎంకేకు రూ.639 కోట్లు వచ్చాయని వివరించారు. అయితే ఈ గణాంకాలు కూడా తప్పుల తడకలే.
2018 నుండి 30 దశలలో ఎన్నికల బాండ్లు విక్రయించారు. వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌ బహిర్గతం చేసింది. 2018 మార్చి 1వ తేదీ నుండి ఈ ఏడాది జనవరి వరకూ 25 పార్టీలు రూ.16,492 కోట్ల విలువ కలిగిన బాండ్లను నగదుగా మార్చుకున్నాయి. వీటిలో బీజేపీకి రూ.8,252 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.1,952 కోట్లు, తృణమూల్‌ కాంగ్రెస్‌కు రూ.1,705 కోట్లు, బీఆర్‌ఎస్‌కు రూ.1,408 కోట్లు, బీజేడీకి రూ.1,020 కోట్లు, డీఎంకేకు రూ.677 కోట్లు వచ్చాయి. కాగా రూ.4,002 కోట్ల విలువైన బాండ్లకు సంబంధించిన సమాచారం తెలియడం లేదు. పార్లమెంటులో తమ పార్టీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి విరాళాలు వచ్చాయని షా చెప్పుకొచ్చారు. ‘మాకు 303 మంది ఎంపీలు ఉన్నారు. రూ.6,000 కోట్ల బాండ్లు వచ్చాయి. 242 మంది సభ్యులున్న ఇతర పార్టీలకు రూ.14,000 కోట్లు వచ్చాయి. అలాంటప్పుడు ఈ రాద్ధాంతం ఎందుకు?’ అని ప్రశ్నించారు. అయితే ఈ వాదనలోనూ వాస్తవం లేదు. పార్లమెంటులో బీజేపీకి మంచి మెజారిటీ ఉన్నప్పటికీ అనేక రాష్ట్రాలలో దాని బలం అంతంత మాత్రమే. అనేక సంపన్న రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలే అధికారంలో ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయమేమంటే రాజకీయ పార్టీలకు బాండ్ల ద్వారా మాత్రమే విరాళాలు లభించవు. అనేక ఇతర మార్గాల ద్వారా కూడా వాటికి నిధులు అందుతుంటాయి. ఉదాహరణకు 2018-2023 మధ్యకాలంలో ఎన్నికల ట్రస్టుల ద్వారా బీజేపీకి రూ.1,245 కోట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ పొందిన నిధుల కంటే ఇది తొమ్మిది రెట్లు అధికం. ఈ కాలంలోనే బీజేపీకి రూ.3,337 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.535 కోట్ల విరాళాలు అందాయి. మొత్తంమీద బీజేపీకి వాస్తవంగా అందింది రూ.12,834 కోట్లు. షా చెప్పిన దానితో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువే.

Spread the love