హక్కులకోసం పోరాడే గొంతుకలను అణచే యత్నం

హక్కులకోసం పోరాడే గొంతుకలను అణచే యత్నం– అరుంధతి రారు ప్రాసిక్యూషన్‌కు అనుమతిపై సీపీఐ(ఎం) ఖండన
న్యూఢిల్లీ : యూఏపీఏ(ఉపా) వంటి తీవ్రమైన సెక్షన్ల కింద రచయిత అరుంధతి రారును ప్రాసిక్యూట్‌ చేయడానికి అనుమతించడాన్ని సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. 14ఏండ్ల నాటి కేసులో ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వికె సక్సేనా ఇలా అనుమతి మంజూరు చేయడం దురుద్దేశంతో తీసుకున్న చర్య అని విమర్శించింది. ఐపీసీలోని 124ఎ, 153ఎ, 153బి, 504, 505, 13 ఉపా వంటి తీవ్రమైన సెక్షన్ల కింద ప్రాసిక్యూట్‌ చేయడానికి అనుమతినివ్వడం చూస్తుంటే ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం నినదించే గొంతుకలను అణచివేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందని స్పష్టమవుతోందని పేర్కొంది. అరుంధతిరారు ప్రాసిక్యూషన్‌కు అనుమతిని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) ఢిల్లీ శాఖ డిమాండ్‌ చేసింది.
సహమత్‌ ఖండన
రచయిత అరుంధతి రారును, విద్యావేత్త షేక్‌ షౌకత్‌ హుస్సేన్‌ను 14ఏండ్ల నాటి కేసులో ఉపా కింద ప్రాసిక్యూషన్‌ చేసేందుకు అనుమతినివ్వడాన్ని సఫ్దర్‌ హష్మి మెమోరియల్‌ ట్రస్ట్‌ సహమత్‌ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల ఫలితాల అనంతరమే ఇలా చేయడం చూస్తుంటే ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకంగా తీసుకున్న ప్రతీకార చర్యే అని విమర్శించింది. వారిద్దరికీ మద్దతుగా నిలుస్తామని ప్రకటించింది. ఈ చర్యకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక వాదులందరూ తమ గళాన్ని వినిపించాలని కోరింది.

Spread the love