జీవితం మీద ఆశ పుట్టించే ‘పాఠం’

A 'lesson' that inspires hope in lifeప్రముఖ కవి శిలాలోలిత అందరికీ సుపరిచితమే. వారు ఈ మధ్యకాలంలో ‘నేను ఇక్కడి భూమిని’ అంటూ కవితాసంపుటిని వెలువరించారు. ‘పంజరాన్ని నేనే, పక్షిని నేనే'(1999), ఎంతెంత దూరం (2005), గాజునది(2013)’ పేర్లతో కవితా సంపుటులు ముద్రించారు. వారి రచనలకు గాను ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. వారి కవితాసంపుటి ‘నేను ఇక్కడి భూమిని’ లోని ‘పాఠం’ అనే కవితను పరిచయం చేసుకుందాం.
నేటి సమాజమంతా కరోనాతో అస్తవ్యస్తంగా మారింది. కరోనా ప్రభావంతో మనుషుల్లో మార్పులెన్నో కలిగాయి. ఆత్మవిశ్వాసం కొరవడింది. మనిషిహొ అయోమయానికి గురవుతున్నాడు. జీవితాన్ని చూసి భయపడే స్థితికి వచ్చాడు. కొండలను పిండిచేసిన రోజులనుంచి చిన్న కారణాన్ని చూసి భయపడే సందిగ్ధ స్థితిలోకి నెట్టివేయబడ్డాడు. ఇంకోపక్క సమాజ స్థితిగతులు, స్త్రీల పట్ల జరుగుతున్న ఆకత్యాలు మనిషిని స్తబ్దతకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో మనుషుల్లో శక్తిని నింపటం కోసమే కవి ఈ ‘పాఠం’ కవిత రాసినట్టున్నారు. చదివిన ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపే కవిత. జీవితం మీద ఆశపుట్టించే వాక్యాలివి.
శీర్షికే జ్ఞానాన్ని కలిగించే విధంగా ఉంది. చాలాకాలం పాఠాలు బోధించిన కవి, చాలా కాలంగా కవిత్వం రాస్తున్న కవి, కవితాపాఠంలోని అనుభవాలు కాబట్టి అడుగడుగునా వ్యక్తిని ప్రేరేపిస్తున్నాయి. చెప్పాల్సిన సమయంలో ప్రేరణాపాఠంగా కవి ఈ కవితను మలిచారు. కొన్ని సందర్భాల్లోనయినా, కొంత మందిలోనయినా ఆలోచన కలిగిస్తే ఆ కవిత నిలిచినట్టే. ఇది అన్ని సందర్భాల్లోనూ, అందరిలోనూ చిరస్థాయిగా నిలిచే కవిత.
కవిత ఆరంభం ప్రేరణా ఒడిలో కూర్చోబెట్టి ఓనమాలు దిద్దించినట్టుగా ఉంది. క్రమక్రమంగా పాకడం దగ్గరనుండి నడవటం వరకు ఎన్నోసార్లు పడిపోతూ లేసే పాపను ప్రేరణగా తీసుకోవచ్చన్న కవిహొ ఉదాహరణ మన నిత్యజీవితంలోదే. కానీ మనమెప్పుడూ ఆ వైపుగా దష్టి సారించం. ఈ కవి చూపు ఎంత గొప్పదో చూడండి. ఏవేవో ఉదాహరణలు తీసుకోలేదు. జీవితంతో మమేకమైన సంఘటననే ఉదాహరణగా చెప్పి కదిలింపచేశారు.
జీవించటమంటే చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలించటమే. తిన్నామా, పడుకున్నామా, లేచామా అనే ఒక విధానానికి అలవాటు పడకుండా ప్రతీ అంశంలోంచి నిత్యనూతన ఉత్తేజాన్ని రాబట్టుకోవాలి. కవి వాక్యాలు ఆ దక్పథాన్నే పట్టి చూపుతున్నాయి.
సరదాగా బీచ్‌ లోకెళ్ళి ఆటాడుకునే సందర్భంలో కూడా అలల మనస్తత్వాన్ని చదవమంటున్నారు. ఈ సందర్భానికి అనువుగా
”కెరటం నాకు ఆదర్శం/ లేచి పడుతున్నందుకు కాదు/ పడినా లేస్తున్నందుకు” అనే ప్రేరణా వాక్యాలు గుర్తొస్తున్నాయి. ఈ కవి రాసిన వాక్యాలు కూడా కెరటం యొక్క స్వభావం మీదనే. కెరటం తీరాన్ని ముద్దాడుతున్నప్పుడు దరిని గట్టిగా తాకి పైకి లేస్తుంది. దరిని తాకినప్పటి గాయాన్ని గుర్తుచేసుకుంటే కెరటం ఎగరలేదు కదా అని ఎంతో ప్రేరణాదాయక వాక్యాలు రాశారు.
మొదటి స్టాంజా నుండి పోతూ పోతూ ఉంటే తత్త్వం తాలుకా తీవ్రత పెరుగుతూ వచ్చింది. చెట్టు సంబంధిత పూలు, పండ్లు, కొమ్మలను, ఆకులను కవిత్వ పాఠంలోకి తీసుకొచ్చి ప్రతి పాఠక విద్యార్థికి విషయం అందేలా వాక్యాల గోరుముద్దలు తినిపించారు. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కడెక్కడికో వెళ్తాం, ఎన్నో ప్రేరణా తరగతులకు, శిక్షణా తరగతులకు వెళ్తుంటాం. కవి చెప్పినట్టు రాలిన ఆకు ఏం చేస్తుందో, పండు విత్తనంలా మారి కొత్త రూపు ఎలా ఎత్తుతుందో, చెట్టు దగ్గరకెళ్ళి గమనిస్తే జీవితంలోని కష్టసుఖాలను సమానంగా ఎలా తీసుకోవాలో పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా స్టాంజాలుగా ముందుకెళ్తూ కొంత చోటుంటే బండరాయిలోంచి తొలుచుకొని వచ్చే మొక్కను మనకు ఆదర్శంగా చూపించారు. నరికిన కొమ్మల్లోంచి మళ్ళీ పుట్టుకొచ్చే చిగుర్లలోని శ్వాసను ముందుంచారు. కవిత్వం మనిషిని సక్రమమైన దారిలో నడిపించడానికో సాధనమని ఈ వాక్యాల ద్వారా మనకు అర్థమవుతుంది.
కవిత చివరికొచ్చేసరికి నిత్యం మనల్ని నవోదయంలోకి తీసుకెళ్ళే సూర్యున్ని గుర్తు చేస్తారు. సూర్యబింబం లాంటి కాంతి ఇవాళ జీవితంలో కనుమరుగయి పోవచ్చని, మళ్ళీ సూర్యుడు ఎలా రేపు ఉదయిస్తాడో అలాంటి కాంతి జీవితంలోకి తొంగిచూడొచ్చని తెలియజేస్తూ కవి జీవితంలోని పలు పార్శ్వాలను పాఠంగా బోధిస్తున్నారు. ముగింపులో కాలం చేసే మాయాజాలాన్ని వివరిస్తూ గెలుపు వెన్నెలలా చల్లని స్పర్శనందిస్తుందని అపజయమే విజయమార్గంలో మెట్టుగా మారుతుందన్న భరోసానిచ్చారు. ప్రేరణను ఎక్కువగా ఉపన్యాసరూపాలలో చూస్తూ ఉంటాం. కవిత్వంలో కూడా చాలా చోట్ల ప్రేరణా వాక్యాలు కన్పిస్తుంటాయి. కవిత్వం చేయలేనిదేముంది. కవి చెప్పినట్టు ఎండుటాకు కూడా గాలితో జతకూడి గజ్జెల సవ్వడి చేస్తుంది. ఇలాంటి అనుభవ పాఠాలను తనలో నింపుకుంటూ కళ్ళు తెరిపిస్తుంది. కవి నేర్పిన ఈ పాఠానికి జయహోలు.

– డా||తండ హరీష్‌ గౌడ్‌
8978439551

 

పాఠం
పారాడే పాపాయే చెబుతుంది
పడినా, దొర్లినా మనమే లేవగలమని
విరిగిన కెరటమే చెబుతుంది
తల తీరానికి బాదుకున్నా పైకెగరగలమని
బండరాయే చెబుతుంది
కొంచెం చోటు చాలు మొక్కలా మొలకెత్తగలనని
రాలిన పువ్వే చెబుతుంది
రేపటి మొగ్గనై మళ్ళీ వికసించగలనని
నేలను ముద్దాడిన పండు చెబుతుంది
రాబోయే రోజుల విత్తనం నేనేనని
ఎండుటాకు చెబుతుంది
రంగు మారినా, నేలరాలినా
తన గజ్జెల సవ్వడిని ఆపనని
గొడ్డలి కాటుకు బలైన కొమ్మే చెబుతుంది
నా శ్వాసలోనే చిగురించే గుణముందని
కనుమరుగవుతున్న సూర్యబింబం చెబుతుంది
రేపన్నది నీదేనని నీ తోడే నేనని
చల్లటి వెన్నెల దేహమంతా స్పర్శిస్తూ చెబుతుంది
కాలమెన్ని గారడీలు చేసినా
చివరి గెలుపు మనదేనని
– శిలాలోలిత

Spread the love