వైల్డ్‌ ఫ్లవర్‌

నలుగురు యువకులు కాంక్రీట్‌ జంగల్ల నుంచి బయటపడి, కాసింత ఊపిరి పీల్చుకోవడానికి అడవిబాట పట్టారు. గ్లోబల్‌ అంగడిలో తప్పిపోయిన జీవితాల్ని వెతుక్కోవడానికి రాచకొండ లోయల్లోని సెలయేటి అంచుల్లోకి చేరుకున్నారు. పరుపుబండలమీద కూర్చుని, దారిలో లంబాడీ అక్క దగ్గర తెచ్చుకున్న జొన్నరొట్టెలు, గోంగూర పచ్చడి నంజుకుని తింటున్నారు. చుట్టూ చీకటి కమ్ముకున్న అడవి. కూలిపోయిన రాచకొండ రాజ్య ప్రాకారాల మీదుగా రొమ్ము విరుచుకుని కురుస్తున్న వెన్నెల. పురా జ్ఞాపకాలను తట్టి లేపడానికే అన్నట్లు చెట్ల కొమ్మలనుంచి జలపాతంలా దునుకుతున్న చల్లని గాలి. నల్లని ఆకాశంలో మిణుకు మిణుకుమంటున్న నక్షత్ర సౌందర్యం ఆ యువకుల్ని కవ్విస్తుంది. అందుకే అనేక జ్ఞాపకాలను తొవ్విపోసుకుంటున్నారు. కష్ట సుఖాలను పంచుకుంటున్నారు. యువకులు కనుక ముచ్చట సహజంగానే ప్రేమ కథల వైపు మళ్ళింది. ముందుగా ముగ్గురి లవ్‌ స్టోరీ చెప్పడం అయ్యాక, నాల్గోవాడి వైపు చూసి నవ్వుతున్నారు. ”హేరు నావైపు చూసి ఎందుకు నవ్వుతున్నారు?”
”మరి నవ్వరా! మేమంటే మా లవ్‌ స్టోరీలేవో చెప్పాము. నీవసలే ఉద్యమకారుడివి. నీకేం లవ్‌ స్టోరీ ఉంటుంది” అన్నారు నవ్వుతూ.. ”ఉద్యమకారులు మనుషులు కాదా! వాళ్లకు లవ్‌ స్టోరీలుండవా? వాళ్లకు రొమాంటిక్‌ థాట్స్‌ రావా? మీ అంత రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ కాకపోయినా, ఓ మాదిరి కథ చెప్పమంటే చెబుతాను”
”అవునా…! అయితే ఈ రోజు ఓ భిన్నమైన కథ వినబోతున్నామన్నమాట. చెప్పు చెప్పూ త్వరగా. ఏమిటా కథ? ఎలా ఉంటుంది తను?” కళ్లప్పగించి, చెవులు నిక్కబొడిచి అడిగారు.
”ఓ పొగమంచు కమ్మే కాలాన అందమైన రెల్లుగడ్డిలాంటి జుట్టును మునివేళ్లతో సరిజేసుకుంటూ నడిచొస్తుంది తనో జీవనదిలా. పాలనురగలాంటి మేఘాలను తుంచి తన ఎదమీద కప్పుకున్నట్టున్న తెల్లని చున్నీ కొసలు, గాలికి తూనీగలై నాట్యమాడుతున్నాయి. ద్రవిడవర్ణ ఛాయతో తన మేనిరంగు మేలిమి పుట్టమన్నులా నిగనిగలాడుతోంది. పాదరసంలాంటి ఆ కళ్ళు, పాలుగారినట్టుండే చెక్కిళ్ళు. మామిడి పూతలా, పజ్జోన్న కాతలా తన రూపురేఖలు. ఎంతో అందమైన హస్కీవాయిస్‌ ఆమెది. అది పంజాబీ నూరాన్‌ సిస్టర్స్‌ సూఫీ పాటను మించి ఒకడి గుండె పొరల్లో చెరగని సంతకం చేసింది. తొలకరి చినుకులతో అతని మదినల్లుకున్న ఆ మట్టిపరిమళం మరిచిపోలేనిది. ఇంతకీ అతనెవరు? పసిపిల్లల పిడికిటిలోనూ పోరాట పొద్దుని చూస్తూ విరిసిన మందార కేతనం అతడు. మోదుగుపూవు లాంటి ముఖారవిందంతో ఒకానొక ఉషోదయాన, తన ప్రతిబింబాన్ని ఆమెలో చూసుకుని మురిసినవాడు. యాదశ్చికంగా ఎదురై, అతనిలో రాగమైన జ్ఞాపకాల తీరంలో తిరగాడుతున్న ఉద్యమకారుడు. ఇతనూ తనూ కౌమారంలోనే పుట్టిన సుకుమారమైన ప్రేమికులు. ఒక పోరాటంలో కలుసుకుని విడిపోయిన ఉద్యమ సీతాకోక చిలుకలు. ఇప్పుడు మరో సమూహ బాటలో, సభాతోటలో మళ్ళీ అయిదేళ్ల తర్వాత కలుసుకోనున్నారు.
***
చీకటి మొకాన్నే రమ్మని చెప్పిన ఎమ్మెల్యే గారి మాట యాదికొచ్చి, లేచి దబదబా రెడీ అయ్యి ఎమ్మెల్యే గారింటికి పోయిండు తత్వ. ”ఆ.. తత్వ రారా. నీకోసమే చూస్తున్న త్వరగా టీ తాగు వెళదాం”
”ఎక్కడికండీ?”
”ఎక్కడికో చెప్తే తప్ప కారెక్కవా రా? నదిలో నుంచి తోటకు పైపు లైన్‌ వేసుకెళ్తున్నాం కదా అది చూసి, కూలోళ్ళు నాటుకు వచ్చే లోపు పొలంలో నారు పంచేసోద్దాం దబ్బున కారెక్కురా”
నేవీ బ్లూ కలర్‌, మహీంద్రా మార్షల్‌ 7171 కారు. సందులు గొందులు దాటి, పెట్రోల్‌ బంక్‌ పక్క సందులో నుంచి రోడ్డెక్కింది. చిక్కగా కురుస్తున్న మంచు ఎన్‌.హెచ్‌. నైన్‌ అని పిలవబడుతున్న రోడ్డును కమ్మేసింది. సరిగా కనపడడం లేదు. అయినా కారు ఆ మంచును చీల్చుకుంటూ పడమటి మొఖాన సాగిపోతుంది. ఆ లైటు వెలుగుల్లో ఎదురుగా అమ్మాయిల గుంపు వెళ్తుంది. పొద్దున్నే వాకింగ్‌ కోసం గ్రౌండ్‌కి వెళ్తున్నారనుకున్నారు. కానీ చీమల బారులా ఇద్దరిద్దరు అమ్మాయిలు, ఒకరి వెనుకాల ఒకరు లైనుగా, ఏదో పొద్దుని కోసుకొచ్చే పనేదో ఉన్నట్టు చాలా సీరియస్‌ వెళ్తూనే ఉన్నారు. ”శీనన్న కారు ఆపు” డ్రైవర్‌ కి చెప్పాడు తత్వ.
”ఒర్రెక్కో సడెన్‌గా ఏమయిందిరో? కారెందుకు ఆపాలె?” అడిగాడు ఎమ్మెల్యే.
”వాళ్ళంతా స్టూడెంట్స్‌. ఇంత ఎర్లీ మార్నింగ్‌ ఇలా ఆరుద్ర పురుగుల దండులా వెళ్తున్నారంటే ఏదో జరిగిందనిపిస్తుంది. నేను వాళ్లతో వెళ్ళాలి” కారు దిగి వెళ్ళిపోయాడు తత్వ.
”ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం జరిగింది?” వాళ్లతో నడుస్తూ, ఇలా ఎన్ని ప్రశ్నలేసినా ఎవరూ ఏమి సమాధానం ఇవ్వడం లేదు. అయినా వారితోనే నడుస్తున్నాడు. ఇంతలో హేలీ తోక చుక్కలా మెరుస్తూ తన దగ్గరకు దూసుకొచ్చిందొక అమ్మాయి.
”హలో… ఏం కావాలి నీకు? ఎందుకు మాతో వస్తున్నావు? అసలు ఎవరు నీవు? ఈయనతో ఎవరూ మాట్లాడకండి, నడవండి.” తన ఫ్రెండ్స్‌ కి చెప్పి ముందుకు వెళ్ళిపోయింది. తన మాటల్ని ఆ అమ్మాయిలందరూ తూచా తప్పకుండా పాటిస్తూ నడుస్తున్నారు. ఈ లోపు ర్యాలీ ఎం.ఆర్‌.ఓ ఆఫీసు దగ్గరకు చేరుకుంది. తానే ఆ ర్యాలీని ఆర్గనైజ్‌ చేస్తుంది. ఆ హైవే మీద వాహనాల వలన ఏ ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, ర్యాలీని గండు చీమల బారులా, క్రమశిక్షణగా, చాలా చక్కగా నడిపింది. అప్పటివరకూ నోరు విప్పని అమ్మాయిలు ఇప్పుడు నినాదాలు చేస్తున్నారు. ”విరు వాంట్‌ జస్టిస్‌, కలెక్టర్‌ రావాలి – సమస్యలన్నీ తీర్చాలి” కేవలం ఈ రెండంటే రెండే నినాదాలు. వర్కింగ్‌ డే రోజు పదిన్నర దాటితేనే అధికారులు ఆఫీసులకు వచ్చేది కష్టం. అలాంటిది ఆదివారం ఆఫీస్‌ దగ్గర ఎవరుంటారు? కలెక్టర్‌ కి ఎవరు చెప్తారు. అయినా ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్న జిల్లా కేంద్రం నుంచి ఆయన రావడం ఇప్పటికిప్పుడు జరిగేపనేనా? వాళ్ళకేం న్యాయం కావాలో, ఏ సమస్యల్ని పరిష్కరించాలో చెప్పడం లేదు. కనీసం వాళ్ళ సమస్యల్ని కూడా వాళ్ళు స్లోగన్‌ చేయడం లేదు. మళ్ళీ ఒకసారి ఆ ఆర్గనైజ్‌ చేసే అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేసాడు తత్వ. కానీ ఆ అమ్మాయి పలుగురాళ్లను సర్రుమని విసిరినట్టు ఒక్క చూపు చూసి ”విరు వాంట్‌ జస్టిస్‌” అంటూ పక్కకు వెళ్ళిపోయింది. ఇంతలో జర్నలిస్టులు వచ్చారు.
”ఏంటమ్మా మీ డిమాండ్స్‌ ఏంటీ? ఎందుకు ధర్నా చేస్తున్నారు? చెప్పండి”
”మేము చెప్పం. మీకెందుకు చెప్పాలి. మేము ఒక్క కలెక్టర్‌ తో తప్ప ఎవరితో మాట్లాడేది లేదు” అక్కడ ఎప్పటి నుంచో స్లొగన్స్‌ ఇస్తున్న విద్యార్థుల నోళ్ళు ఎండిపోతున్నాయి. అది గమనించిన తత్వ వాటర్‌ ఆటోను తెప్పించి, వాళ్ళందరిని వాటర్‌ తాగమని చెప్పాడు.
”మా సమస్య పరిష్కారం అయ్యేవరకు మాకేం వద్దు” అన్నారు.
”మీరు గురుకుల పాఠశాల విద్యార్థులని మాకు తెలుసు. మాతో చెప్పకపోయినా ఫరవాలేదు. కానీ ఈ తత్వ మీ విద్యార్థి సంఘ లీడర్‌. ఆయన మీ కోసమే ఉన్నాడు. మీ వైపే మాట్లాడుతాడు. ముందు వాటర్‌ తాగి, ఆయనకైనా మీ సమస్యలు చెప్పండి. లేకపోతె మీకే నష్టం” అని చెప్పి విలేకర్లు దూరంగా వెళ్ళి కూర్చున్నారు. అప్పుడు ఆ అమ్మాయి అందరినీ నీళ్లు తాగమని సైగ చేసింది.
”నీ పేరు ఏంటి?”
”వివిధ. అయినా నా పేరు ఏమైతే మీకెందుకు? మేం ఎవరితో మాట్లాడం”
”నా పేరు తత్వ. నేనూ మీలాంటి స్టూడెంట్‌ నే. ఇంటర్మీడియట్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న. నేను స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆర్గనైజర్‌ ను. మీ ప్రాబ్లమ్స్‌ చెప్తే నేనూ మీతో కలిసి ఫైట్‌ చేస్తా వివిధ”
”హలో తత్వా.. నీతో చెప్తే ఏం చేస్తావ్‌? నీవేమైనా కలెక్టర్‌వా? ఎమ్మెల్యేవా? మేము ఎవ్వరిని నమ్మేది లేదు”
”నేను ఆ రెండు కాకపోవచ్చు వివిధ. నాకు చెప్తే వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరినైనా ఇక్కడికి రప్పించగలను”
”నువ్వూ నాలాంటి స్టూడెంట్‌ వే తత్వా. ముందు రప్పించు. అప్పుడు నమ్ముతా నిన్ను. విరు వాంట్‌ జస్టిస్‌” కోడెలేగ మూపురం అంత అందంగా, కొమ్ములంత బలంగా పిడికిలి ఎత్తి మళ్ళీ స్లొగన్స్‌ మొదలుబెట్టింది. చెట్టు కింద రెడ్‌ కలర్‌ హీరోహోండా సిడి హండ్రెడ్‌ ఎస్‌.ఎస్‌. బైక్‌ మీద, నున్నగా దువ్వుకుని కూర్చున్నాడు జర్నలిస్ట్‌ రమణబాబు. తత్వ ఆయన దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారికి ఫోన్‌ కలుపమన్నాడు. సెల్యులార్‌ ఫోన్‌ లాంటి సెల్‌ ఫోన్‌ తీసి ఎమ్మెల్యే గారికి ఫోన్‌ కలిపాడు.
”హలో.. నమస్తే విలేకరి గారు చెప్పండి”
”నమస్తే ఎమ్మెల్యేగారు. తత్వ మాట్లాడుతా అంటే చేసిన. ఇస్తున్న ఇదిగో మాట్లాడండి”
”ఇక్కడ గురుకుల పాఠశాల విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. సమస్య ఏమిటని అడిగితే మాకేమి చెప్పడంలేదు. మీరు వస్తే తప్ప మాట్లాడరట. త్వరగా రండీ”
”ఒర్రెక్కో త్వరగా అంటే ఏందిరో! రమ్మనగానే ఇక్కడ లేచి అక్కడ వాలడానికి మాదేమన్న విమానమారా?”
”సరే. ఎప్పటి వరకు రాగలరు? అసలు వస్తరా? రారా?”
”అరేరు రాకుండా ఎట్లుంటరా? నువ్వు ఆర్డరేసినంక రాకుంటే తప్పుద్దారా? ఇగో స్టార్ట్‌ అయితనే ఉన్నం”
”సరిగ్గా పదహారు నిమిషాల్లో ఎమ్మెల్యే సిమ్మయ్య ఎమ్మార్వో ఆఫీసుకి చేరుకున్నాడు. తత్వ ఎదురెళ్ళి విద్యార్థుల దగ్గరికి తీసుకొచ్చాడు. అమ్మాయిలందరూ సిమ్మయ్యను గుర్తుబట్టి సంతోషంతో కేకలేశారు. అసలే తేజ టివిలో వచ్చే అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్న కాలం అది. అసెంబ్లీలో ఎర్రజెండా తరపున వాడి వేడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే సిమ్మయ్య ఉపన్యాసాలు టీవీల్లో చూసినవారు. కనుకనే ఆయన రావడంతో ఆ కేకలు. కామంచి పొదల్లో ఓ వైల్డ్‌ ఫ్లవర్‌ విరభూసినట్టు విద్యార్థుల మధ్యలోంచి లేచి నిలబడింది వివిధ. అడవి చామంతిలాంటి కళ్ళతో తత్వ వైపే ఆశ్చర్యంగా చూస్తుంది వివిధ.
”ఎక్కడమ్మా మీది?” వివిధను అడిగాడు సిమ్మయ్య
”చలకుర్తి సార్‌”
”మరి మీ సమస్య ఏంటమ్మా? నన్ను పిలువనంపితే నేను మీ గురుకుల పాఠశాలకి వచ్చేటోన్ని కదా! ఇంత రిస్క్‌ ఎందుకు తీసుకుర్రు?”
”సార్‌ అదీ…”
”అది ఇది కాదుగాని, మీకు ఆకలైతున్నదని నాకర్ధం అయింది. మీ సమస్యలన్నీ పరిష్కరిద్దాం, ముందు గురుకుల పాఠశాల పోదాం పదండి. తిన్న తర్వాత మాట్లాడుకుందాం”
”అలా కాదు సార్‌. పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే వెళ్తాం సార్‌”
”అదే చెప్తున్నానమ్మా. తప్పకుండా పరిష్కరిస్తాను. పదండి మీతో తత్వ వస్తాడు. ఇప్పుడు…”
”తత్వ కాదు సార్‌ మీరొస్తేనే వెళతాం”
”నేను కూడా వస్తనమ్మా. రాలేదనుకో, మీకంటే ముందు మీ లీడర్‌ వదలడు. నన్ను ఇక్కడికి ఉన్నఫలంగా రప్పించింది ఎవరు? తత్వనే కదా! అది మరిచిపోతే ఎలా? త్వరగా రమ్మన్నరని నేను పొలంలో నుంచి బురద కాళ్లను కడుక్కోకుండా డైరెక్టుగా ఇక్కడికే వచ్చిన. మీరు మీ గురుకుల పాఠశాలకు నడిచేలోపు నేను ఫ్రెష్‌ అయ్యి వస్తా. అరే తత్వ నువ్వెళ్లి ముందు వాళ్లకు తిండి పెట్టించు. వాళ్ళ ప్రిన్సిపాల్‌ కి నేనొస్తున్నా అని చెప్పు” సిమ్మయ్య పై నమ్మకంతో అందరూ ర్యాలీగా పాఠశాలకు తిరుగు ప్రయాణమయ్యారు. కొంతమంది అమ్మాయిలు తత్వతో మాట్లాడుతూ నడుస్తున్నారు.
”అన్నయ్య మీరు మాకు తెల్సు. బాగున్నారా అన్నయ్య. గర్ల్స్‌ హాస్టల్‌ లో ఉన్నప్పుడు మీరు రెగ్యులర్‌ గా వచ్చేది. మీ వల్లనే మాకు అక్కడ మంచి ఫుడ్‌ పెట్టి, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేవారు. నేను చెప్పలేదూ.. స్టూడెంట్‌ ఫెడరేషన్‌ అన్నయ్యలు మా హాస్టల్‌ కి వచ్చేదని.. ఈ అన్నయ్యే.” అని తమ ఫ్రెండ్స్‌కు తత్వను పరిచయం చేస్తున్నారు.
”మీతో మాట్లాడితే వివిధ తిడుతుందని, అప్పటి నుంచి మాట్లాడలేదన్నా. ఆమెది మన దగ్గర కాదు. కాల్వకింద. అందుకే తనకు మీ గురించి తెలియదు”
”ఇంత పొద్దున్నే బయటకు ఎలా రాగలిగారు! మీ వార్డెన్‌ ఆపలేదా?”
”లేదన్నయ్యా. వివిధ వెళ్ళి ట్యాంక్‌ లో వాటర్‌ అయిపోయాయి, మోటర్‌ ఆన్‌ చేయమని వాచ్‌ మెన్‌ రాములును డైవర్ట్‌ చేసి పంపించింది. ఆయన అటు వెళ్ళగానే మేము మెయిన్‌ గేటు నుంచే వచ్చేశాం. ఆయన మోటార్‌ వేసి గేటు దగ్గరికి వచ్చేలోపు బయటకు రాలేకపోయిన కొంతమంది అమ్మాయిలు మాత్రం గోడ దునికొచ్చారు అన్నయ్య. నేను ఈ గురుకుల పాఠశాలలోకి అడ్మిషన్‌ తీసుకునేముందు, విద్యార్థి సంఘాలకు లోపలికి ప్రవేశం లేదు అనే బోర్డు గేటుకు చూసినప్పుడే ఇక మా పని అవుట్‌ అని అనుకున్నా. అడిగేవారెవరూ లేరు అన్నయ్య. చివరికి తట్టుకోలేక వివిధ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌ తో ఎట్లైతే గట్లైద్దని రోడ్డెక్కాం. మీరు కన్పించనంతవరకు భయంగా ఉండే. ఎప్పుడైతే మీరు వచ్చారో నాకైతే ఫుల్‌ ధైర్యమొచ్చింది అన్నయ్య”
ఇంతలో గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. గేటు బయటనే ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, పీడీ, వార్డెన్‌ అందరూ తలా ఒక బెత్తం పట్టుకుని నిలబడ్డారు.
”స్టూడెంట్‌ ఫెడరేషన్‌ వాళ్ళు వచ్చారు. ఎమ్మెల్యేగారు వస్తున్నారు” అని వారికి వివిధ చెప్పడంతో, అందరూ లోపలికి వెళ్లిపోయారు. తత్వ దగ్గరుండి అందరికి భోజనాలు వడ్డించి, గ్రౌండ్‌ లోని యాప చెట్లకింద కూర్చోబెడుతుండగానే ఎమ్మెల్యే సిమ్మయ్య వచ్చాడు. వచ్చే రాకడతోనే ”విద్యార్థి సంఘాలు పాఠశాల లోపలికి రాకూడదు” అని గేటుకు తగిలించిన బోర్డు ఊడబీక్క రమ్మని చెప్పడంతో అటెండర్‌ వెళ్ళి తీసుకొచ్చాడు.
”అది తీసుకెళ్లి డస్ట్‌ బిన్‌లో వేసిరా” అని సిమ్మయ్య తత్వకు చెప్పాడు. వెంటనే తత్వ కిచెన్లోకి వెళ్ళి భగభగ మండుతున్న పొయ్యిలో వేసొచ్చాడు. చూసి రా అంటే కాల్చి వచ్చాడు అంటారుగా అలా. దాంతో ప్రిన్సిపాల్‌ వివిధ వైపు చాలా కోపంగా చూస్తున్నాడు. ఈ అన్నిటికీ తనే కారణమన్నట్టు.
”ఒకనాడు బడిలోకి ప్రవేశం లేదని శూద్రులకు చదువు నిరాకరించారు. ఆ నిషేధాన్ని ఎదుర్కొని పూలే, అంబేడ్కర్‌ అందరికీ చదువుకునే హక్కు సాధించారు. ఇప్పుడు గురుకుల పాఠశాలలోని విద్యార్థుల దగ్గరికి విద్యార్థి సంఘాలను రాకుండా ఆపడానికే ఈ బోర్డులు పెట్టి జ్ఞానాన్ని, ప్రజాస్వామిక హక్కులను నిషేధిస్తున్నారు. ఎక్కడైనా నిషేధాజ్ఞలు ఉన్నాయంటే అక్కడ తప్పకుండా ఏదో గూడుపుఠాణి జరుగుతున్నట్టే లెక్క. తల్లిదండ్రుల్ని కూడా లోపలికి రానివ్వకుండా, జైలులోలాగ ఆంక్షలు పెట్టే ప్రదేశం విద్యాలయం అవుతుందా ఆలోచించండి. మీ పనికిరాని పద్ధతులే వాళ్లను ఉద్యమింపజేశాయి” అని ప్రిన్సిపాల్‌, పీడీ, వార్డెన్‌ ల దుమ్ము దులిపాడు తత్వ.
ఇంకా విద్యార్థుల్లో ధైర్యం వచ్చింది. దాంతో విద్యార్థులంతా ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యే సిమ్మయ్యకు తమ సమస్యలు చాలా ధైర్యంగా చెప్పడం మొదలెట్టారు. ”బాన్సువాడ నుంచి కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్‌ కి, ఇన్నిరోజులు ఇక్కడున్న అగ్ర కుల ఇంచార్జ్‌ ప్రిన్సిపాల్‌ కి పాఠశాల నిర్వహణలో గొడవలు వచ్చాయి. గురుకుల సొసైటీ సెక్రెటరీతో పైరవీ చేసుకుని పాత ఇంచార్జ్‌ ప్రిన్సిపాల్‌ రెగ్యులర్‌ ప్రిన్సిపాల్‌ ని బాన్సువాడకు పంపేలాగ చక్రం తిప్పి సర్క్యూలర్‌ తెచ్చారు. వచ్చిన పది రోజుల్లోనే అకారణంగా రిటర్న్‌ ట్రాన్స్‌ఫర్‌ అన్యాయం. కాబట్టి నేను వెళ్ళేది లేదని ఆయన పట్టుబట్టి కూర్చున్నాడు. సిబ్బంది అంతా రెండు గ్రూపులుగా చీలిపోయింది. తత్కారణంగా పాఠశాలలో విద్యా బోధన అంతా అస్తవ్యస్తమైంది. దానికి మించి వంట చేసే కాంట్రాక్టు, రకరకాల సరుకులు, నిత్యావసరాల సప్లరు ప్రయివేట్‌ కాంట్రాక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం. వారు సరిపడా వస్తువుల్ని అందజేయరు. అందువల్ల భోజనం అస్సలు బాగుండదు, నాసిరకంగా ఉంటుంది. పైగా ఆ కాంట్రాక్టర్ల చేత వంటపనికి, సప్లరు పనికి నియమించబడ్డ యువకులు అమ్మాయిలపై అరాచకాలు చేస్తున్నారు. వీళ్ళు చాలరన్నట్లు పురుషులైన టీచర్స్‌ కూడా కొంతమంది అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నారు.” అని కొంతమంది అమ్మాయిలు ఎడతెగకుండా తమ సమస్యలను చెప్తూనే ఉన్నారు.
”టిఫిన్‌ సరిగా ఉండదు, అన్నం సరిపడా పెట్టరు. రుచి, శుభ్రత ఉండదు. సబ్బులు, నూనె ఇవేవి సరిగా ఇవ్వరు. ఇదేంటని అడిగితే చాలు. మీ ఇంటి దగ్గర ఇంతకంటే బాగుంటుందా? నోరుమూసుకుని తినండి, లేదంటే మానేయండి. అయినా మీరు తినడానికి వచ్చారా, చదుకోవడానికి వచ్చారా? ఈ మాల, మాదిగ ముండలు మా పాలిట దాపురించారు. అని మేడమ్స్‌ తిట్ల పురాణం మొదలవుతుంది” అని మరికొంతమంది అమ్మాయిలు చెప్తూ ఏడుస్తున్నారు.
”అయినా మా వాళ్ళే ప్రిన్సిపాల్స్‌, టీచర్లు, వార్డెన్లు అయితే మాకీ అవమానాలు పోతాయికదా అని ఇవన్నీ భరిస్తూ చదువుకుంటున్నాం. ఆ చదువయినా సరిగా చెబుతారా అంటే ఇప్పుడు అది కూడా పాడైపోయింది. ఇక మేమెలా ఓపిక పట్టగలం? అందుకే అందరం నాలుగు గంటలకు లేచి స్నానాలు చేసి ఎమ్మార్వో ఆఫీసుకి వచ్చాం. పాలు, కట్టెలు, గ్యాసు, కూరగాయలు, నిత్యావసరాలు, చికెన్‌, మటన్‌ ఇలా మాకు ఇవ్వాల్సిన అన్నింటిలో అవినీతే జరుగుతుంది. అలాగే పాఠశాల క్వార్టర్స్‌ లో ఉండే టీచర్స్‌ వాళ్ళ ఇళ్లలో పనులు కూడా మాతోనే చేయిస్తారు. వాళ్ల అగ్రకులాల పిల్లలతో అయితే ఇలానే చేయిస్తారా?” అంటూ ఆవేదనతో, ఆగ్రహంతో వివిధ ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నలతో ఆ అధ్యాప’కుల’ ముఖాలు కాలిన మసి బొగ్గువలె మారిపోయాయి. తలకాయ కిందికి వేసి నేల చూపులు చూస్తున్నారు. అంతసేపు ఓపికతో విద్యార్థుల సమస్యలు విన్న ఎమ్మెల్యే సిమ్మయ్య జేబులో నుంచి ఫోన్‌ తీసి కలెక్టర్‌ కి, గురుకుల సొసైటీ కార్యదర్శికి, ఫుడ్‌ కాంట్రాక్టర్‌ కి ముగ్గురికి ఫోన్‌ చేసి మాట్లాడాడు.
”ఇక నుంచి ప్రతి నెల స్టూడెంట్‌ ఫెడరేషన్‌ లీడర్స్‌ వచ్చి విద్యార్థులతో మాట్లాడి, ఫుడ్‌ తిని చెక్‌ చేస్తారు. ప్రతి మూడు నెలలకొకసారి నేనొచ్చి ఇక్కడే ఫుడ్‌ తింటాను. ఇక 50 ఏళ్లలోపు ఉన్న ఏ పురుషున్ని కూడా కిచెన్‌లో పెట్టవద్దని, అమ్మాయిల్ని వేధించే నీ వర్కర్‌ ని నాల్గు తన్ని సాయంత్రం ఆఫీసు కు తీసుకురమ్మని, మంచి భోజనం పెట్టాలని, లేదంటే నీ కాంట్రాక్ట్‌ రద్దవుద్దని కాంట్రాక్టర్‌ కి చెప్పాను. వాళ్ళవైపు నుంచి అవి రిపీట్‌ కావు. ఇక అమ్మాయిల్ని లైంగికంగా వేధించే టీచర్స్‌ ని బట్టలూడదీసి టౌన్‌ సెంటర్లో నిలబెట్టిస్తాను. అలాంటి వారెవ్వరూ ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు. విద్యార్థుల్ని తమ ఇళ్లలో పని చేయించుకుంటూ కులం పేరుతో తిట్లపురాణం మొదలుపెట్టే నాగజెముడు ముల్లులాంటి ఆలోచనలున్న పటేలమ్మలు తట్టాబుట్ట సదురుకుని వెళ్ళండి. కాదంటే మీ కులం ముల్లులు అరిగేలా బండకు రాసే మహిళల్ని పంపిస్తా జాగ్రతా” అని సిమ్మయ్య ఘాటుగా హెచ్చరించాడు. స్కూల్‌ పీపుల్‌ లీడర్‌ గా పోరాటాన్ని నడిపిన వివిధలాంటి వారే ఈ సమాజానికి అవసరమని అభినందించాడు.
”మిగతా పాలసీ మ్యాటర్లు నేను అసెంబ్లీలోనే మాట్లాడుతాను. మీరు భయపడకండి” అని చెప్పి అక్కడే పిల్లలతో కూర్చొని భోజనం చేసి వెళ్లారు. రెండు రోజుల్లో గురుకుల సొసైటీ వారొచ్చి సంస్థాగతంగా చేయాల్సిన ఎంక్వైరీ చేసి కొంతమంది టీచర్స్‌ ని ట్రాన్సఫర్‌, మరో ఇద్దరిని సస్పెండ్‌ చేసేవరకు సిమ్మయ్య వదల్లేదు.
***
అయిదేళ్ల తర్వాత ఒకసారి జిల్లాస్థాయి మీటింగ్‌ జరుగుతుంది. ఆ మీటింగ్‌ లో తత్వను కలుసుకోవాలని పున్నమి కోసం వేచియున్న సముద్రంలా ఎదురు చూస్తుంది వివిధ. తత్వ కనిపించగానే నాగార్జునసాగరం గేట్లెత్తితే దునికే కష్ణమ్మవలె పరుగెత్తి అమాంతం తత్వ చేయి అందుకుంది. వివిధను చూసిన తత్వ పుట్టంగండి ఎత్తిపోతలతో ఎగువకు పారిన నీటి స్పర్శతో పులకించిన చెలకలా మురిసిపోయాడు. ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. తనతో వచ్చిన మిత్రులంతా తత్వ ఎలా తెలుసని ఆమెనడిగారు.
”తత్వ ఈజ్‌ మై లీడర్‌. ఐ జాయిన్డ్‌ ఇన్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, విత్‌ హిజ్‌ ఇనిస్ప్రెషన్‌ ఓన్లీ” అని చెప్పింది.
”వివిధ ఈజ్‌ ఏ ఫైర్‌ బ్రాండ్‌ అండ్‌ గ్రేట్‌ గర్ల్‌. షీ ఈజ్‌ ఎ నాచురల్‌ ఫైటర్‌” అన్నాడు తత్వ. మీటింగ్‌ మొదలవడానికి కొంచెం సమయం ఉండడంతో అందరూ ముచ్చట్లలో మునిగిపోయారు.
”నా ఎగ్జామ్స్‌ అయిపోయి రిజల్ట్స్‌ వచ్చాక మా అమ్మతో వచ్చి, నిన్ను కలిసి మాట్లాడాను. మా హోమ్‌ టౌన్‌ లో కాకుండా, అడ్మిషన్‌ ఇప్పిస్తే ఇక్కడే చదువుతానని అడిగాను గుర్తుందా తత్వా? నీవు సీటు ఇప్పించలేదు”
”నేను ప్రయత్నం చేశానో చేయలేదో, లేదా పొట్టకూటి ఇవ్వలేని పట్టాల చదువెందుకనే మూర్ఖత్వంలో అప్పుడు కూరుకుపోయానో గుర్తులేదు వివిధ. ఐయామ్‌ ఎక్స్ట్రీమిలీ సారీ”
”నాకు మీతో కలిసి చదవాలని అనిపించింది నీవల్లే. కానీ చదవలేక నా హోం టౌన్‌కి వెళ్ళింది కూడా నీ వల్లనే” ”మరి ఇప్పుడేం చేస్తున్నావు?”
”మా ఊరు వెళ్ళి డిగ్రీలో జాయిన్‌ అయినప్పటి నుంచి స్టూడెంట్‌ ఫెడరేషన్‌ లో పనిచేస్తున్నాను. డిగ్రీ పూర్తి చేసి, ఇప్పుడు పీజీ చదువుతున్నాను. అయినా మిమ్మల్నేమీ మర్చిపోలేదు. యువర్‌ ఇన్‌స్పిరేషన్‌్‌ ఆల్వేస్‌ విత్‌ మి తత్వ”
”నేనూ నిన్నేమీ మర్చిపోలేదు. నీలాంటి తెలివి, తెగువ కలిగిన అమ్మాయిలు ఉద్యమానికి అవసరమని ఎంతో గుర్తు చేసుకునేవాణ్ణి. నీ గురుకుల పోరాటాన్ని చాలాసార్లు మన వాళ్ళకి చెప్తుంటాను వివిద.” అంటూ మాట్లాడుకుంటున్నారు. ఒకే కేసులో రెండు వేర్వేరు జైళ్లలో బంధించబడ్డ ఖైదీలు పెరోల్‌ మీద వచ్చి మాట్లాడుకున్నట్టుంది వారి మాటల తీరు. రెండు గుండెల చప్పుడును ఒకటి చేసి వినడం గురించి, రెండు ప్రపంచాల సరిహద్దులను చెరిపి ఒకే సరళరేఖ మీద నడపడం గురించి మాట్లాడుకుంటునే ఉన్నారు మౌనంగా. పూవుల సున్నితత్వపు పుప్పొడి తీరంలో కూర్చొని చర్చించుకుంటున్నారు ధ్యానంగా. గువ్వల్లా రివ్వున ఎగిరే స్వేచ్ఛ కలిగిన కమ్మని జీవితాన్ని కలగంటున్నారు నిశ్శబ్దంగా. కానీ వారి మానవీయ పెదవుల మత్తడి నుంచి ఒక్క తుంపర కూడా బయటికి చిలకడం లేదు. వాళ్లిద్దరూ ఒకే కళ్ళతో చూస్తున్నారు. ఒకే చెవులతో వింటున్నారు. అదేంటో తింటున్నప్పుడు వారి వేర్వేరు ప్లేట్స్‌ ఒకే ప్లేట్‌ లా మారిపోతున్నాయి. అలా మూడు రోజుల మీటింగ్స్‌ మూడు గంటల్లా కనురెప్పల అంచులమీదనే ఖర్చయిపోయాయి. ఇక ఎక్కడి వారు అక్కడికి వెళ్లిపోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఆ జంట, వీడ్కోలు మాటలేవో మాట్లాడుకోవడానికి అన్నట్టు కాలు, కాలు కదిపి అడుగులో అడుగేస్తూ అలా రోడ్డు వైపు యుద్ధ విరామంలో సైనికుల్లా ఏకాంతంగా నడుస్తున్నారు.
”నీకో విషయం చెప్పాలి వివిధ”
”లేదు నేనే నీకో విషయం చెప్పాలి తత్వ”
”నన్ను చెప్పనివ్వు వివిధ”
”లేదు లేదు అబ్బాయిలే ముందు చెప్పాలా! మేమెందుకు చెప్పకూడదు. నన్ను చెప్పనివ్వు తత్వ” అని మాట్లాడుకుంటూ లోపలికి ఉన్న మీటింగ్‌ హాల్‌ నుంచి రోడ్డు మీదకు అప్పుడే వచ్చామా అన్నట్టు వెనక్కి తిరిగి మీటింగ్‌ హాల్‌ చూస్తుంది వివిధ.
”సరే చెప్పు వివిధ నువ్వే ముందు…” అంటుండగానే పక్కనే చెట్లలో నక్కిన పోలీసులు చటుక్కున తత్వ నోరు మూసి, సర్రున వచ్చిన జీపులో వేసుకుని మెరుపు వేగంతో, గద్దొచ్చి కోడిపిల్లను తన్నుకపోయినట్టు ఎత్తుకెళ్లిపోయారు. ”తత్వ తత్వ తత్వా….” అని అరుస్తూ ఆ జీపు వెనుకాల పరుగెడుతోంది వివిధ..

– ఎం. విప్లవకుమార్‌, 9515225658

Spread the love