లక్నో సూపర్‌ విక్టరీ

పూరన్‌ ధనాధన్‌–  ఛేదనలో పంజాబ్‌ కింగ్స్‌ చతికిల
– లక్నో 199/8, పంజాబ్‌ 178/5
నవతెలంగాణ-లక్నో
ఐపీఎల్‌17లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బోణీ కొట్టింది. పంజాబ్‌ కింగ్స్‌పై 21 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. 200 పరుగుల భారీ ఛేదనలో పంజాబ్‌ కింగ్స్‌కు ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ (70, 50 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), జానీ బెయిర్‌స్టో (42, 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) 102 పరుగుల సెంచరీ భాగస్వామ్యంతో అదిరే ఆరంభం అందించారు. కానీ ప్రభుసిమ్రన్‌ (19), జితేశ్‌ శర్మ (6), శామ్‌ కరన్‌ (0) నిరాశపరిచారు. లియాం లివింగ్‌స్టోన్‌ (28 నాటౌట్‌, 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకపోయింది. 20 ఓవర్లలో పంజాబ్‌ కింగ్స్‌ 5 వికెట్లకు 178 పరుగులే చేసింది. అంతకుముందు, క్విరటన్‌ డికాక్‌ (54, 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో కదం తొక్కగా.. తాత్కాలిక కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ (42, 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్య (43 నాటౌట్‌, 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. డికాక్‌, పూరన్‌, కృనాల్‌ రాణించటంతో పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగుల భారీ స్కోరు సాధించింది.
డికాక్‌ దంచేశాడు :
టాస్‌ నెగ్గిన లక్నో సూపర్‌జెయింట్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ కెఎల్‌ రాహుల్‌ (15, 9 బంతుల్లో 1 ఫోర్‌, సిక్స్‌) అర్షదీప్‌ సింగ్‌కు విరుచుపడ్డాడు. ఓ సిక్సర్‌, ఫోర్‌ బాదాడు. కానీ అతడి ఓవర్లో వేగంగా వికెట్‌ కోల్పోయాడు. దేవదత్‌ పడిక్కల్‌ (9) మళ్లీ నిరాశపరిచాడు. మరో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (54) అంచనాలను అందుకున్నాడు. ఆరంభంలో జట్టును దూకుడుగా నడిపించాడు. రెండు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 34 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన డికాక్‌.. జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్లాడు. మార్కస్‌ స్టోయినిస్‌ (19) రెండు సిక్సర్లతో మెరిసినా.. వికెట్‌ నిలుపుకోలేదు. ఆయుశ్‌ బదాని (8) సైతం విఫలమయ్యాడు. ఈ సమయంలో నికోలస్‌ పూరన్‌ (42), కృనాల్‌ పాండ్య (43 నాటౌట్‌) దంచి కొట్టారు. పూరన్‌ మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో దండయాత్ర చేయగా.. పాండ్య సైతం నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో మోత మోగించాడు. డెత్‌ ఓవర్లలో ఈ ఇద్దరు ధనాధన్‌ మెరుపులతో చెలరేగటంతో లక్నో సూపర్‌జెయింట్స్‌ భారీ స్కోరు నమోదు చేసింది. పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లలో శామ్‌ కరన్‌ ఆకట్టుకున్నాడు. కరన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్‌ సింగ్‌ రెండు వికెట్లు తీసుకున్నాడు. రబాడ, రాహుల్‌ చాహర్‌ చెరో వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు. హర్‌ప్రీత్‌ బరార్‌ వికెట్‌ తీయకున్నా పరుగుల నియంత్రణ పాటించాడు. హర్షల్‌ పటేల్‌ (45/0) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

Spread the love