నవతెలంగాణ-తుంగతుర్తి
తుంగతుర్తి నియోజకవర్గంలో ఆదివారం రాత్రి భారీ ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో మామిడి తోటల్లోని మామిడికాయలు నేలరాలాయి. పంట పక్వానికి వచ్చిన సమయంలో ఈ నష్టం జరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ధరల పతనం, మధ్యవర్తుల మోసాలు, దిగుబడి వంటి సమస్యలతో అల్లాడుతున్న మామిడి రైతులకు ప్రకృతి కూడా కన్నెర్ర చేసిందని, ఈ అకాల వర్షం వారిని మరింత కష్టాల్లోకి నెట్టిందని, మామిడి పంటలకు దెబ్బ మీద దెబ్బ తగిలిందని వారు వాపోతున్నారు. సీజన్ ప్రారంభం నుండి పొగ మంచు విపరీతంగా రావడంతో మామిడి పూత అంతంత మాత్రమే పూసింది. పిందె దశనుండి కాయ దశకు వచ్చి, ఇప్పుడు పక్వానికి వచ్చిన సమయంలో ఈదురు గాలుల దెబ్బకు రైతు చతికిల పడ్డాడు. సాధారణంగా మే నెలలో మామిడి కాయలకు మంచి ధర వస్తుండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని మార్కెట్‌లో విక్రయించినా ధరలు తక్కువగా వస్తాయని ఆవేదన చెందుతున్నారు. ఈ భారీ నష్టాల మూలంగా మాకు పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాదని అల్లాడుతున్నారు.
తీవ్రంగా నష్టపోయాం: దాసరి అశోక్ కుమార్, కౌలు రైతు:- నాలుగు ఎకరాల మామిడి తోటను లక్ష రూపాయలకు కౌలు తీసుకున్నాను. మామిడి పూత దశలో రూ.60 వేల మందులు పిచికారి చేశాను. కాయలు బాగా పండాయి. ఒక్కసారిగా ఆదివారం రాత్రి గంటపాటు వీచిన ఈదురు గాలులకు మామిడికాయలు నేలరాలాయి. దీంతో తీవ్రంగా నష్టపోయాం. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మమ్ములను ఆదుకోవాలని కోరారు.



