– క్షణం క్షణం టెన్షన్.. టెన్షన్…!
– డ్యామ్ వద్దకు చేరుకున్న ఇరిగేషన్ ఉన్నతాధికారులు
– 1000 మంది పోలీసు బలగాలతో పహారా
– సాగర్ చేరుకోనున్న నీటి పారుదల ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్
– ఆంధ్ర ప్రాంతం నుండి ఆంధ్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు
– మధ్యాహ్నం ఆంధ్ర అధికారులతో చర్చలు జరిపే అవకాశం
నవతెలంగాణ పెద్దవూర
నాగార్జునసాగర్ వద్ద మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది.తెలంగాణ ప్రాంతం నుండి దాదాపు వేయి మంది పోలీస్ బలగాలతో పహారా కాస్తున్నారు.ఇటు తెలంగాణ పోలీసులు,అటువైపు ఆంధ్ర పోలీసులు బలగాలతో డ్యామ్ పరిసరాలు క్షణం..క్షణం ఉత్కంఠ నెలకొంది. గురువారం ఏపీ అధికారులు కృష్ణ రివర్ యాజమాన్యానికి గాని తెలంగాణ ప్రభుత్వానికి గాని ఎలాంటి సమాచారం లేకుండా ఏకపక్ష నిర్ణయాయంతో బలవంతంగా నాగార్జునసాగర్ కంట్రోల్ రూమ్ ను పూర్తిగా తమ ఆధీనంలో తీసుకొని కుడి కాలువ నుండి 2వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసుకున్నారు. తాగునీటి కోసమే నీటి విడుదల చేసుకున్నట్లు ఏపీ ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 523అడుగుల చేరువలో ఉంది. మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరోజికి చేరే అవకాశం ఉంది. నిన్నటి నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. దీంతో హైదరాబాద్ తాగునీరు సమస్య ఏర్పడే అవకాశం ఉందని నీటిపారుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే కృష్ణ రివర్ బోర్డ్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. పలనాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆంధ్ర ప్రాంతం వైపు నాగార్జునసాగర్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో డ్యాం వద్ద ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.
13 గేట్లు మావే అంటున్న ఆంధ్రప్రదేశ్
నాగార్జున సాగర్ డ్యామ్ విషయంలో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య బుధవారం మొదలైన వివాదం శుక్రవారం కూడా కొనసాగుతుంది. ప్రాజెక్టులోని 26 గేట్లలో 13 గేట్లు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తాయని ఏపీ పోలీసులు పేర్కొంటున్నారు. డ్యామ్‌ని కబ్జా చేసేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నారు.13వ గేటు వద్ద మూడంచెల భారీకేడ్లను మరియు కంచెను ఏర్పాటు చేసున్నారు.శుక్రవారం మధ్యాహ్నం నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్మితా సబర్వాల్ నాగార్జునసాగర్ చేరుకొని ఆంధ్ర ప్రభుత్వం మరియు ఇరిగేషన్ అధికారులతో చర్చలు జరపనున్నారు. ఉదయం ఇరిగేషన్ ఉన్నత అధికారులు మరియు పోలీస్ అధికారులు నాగార్జునసాగర్ డ్యాం కు చేరుకొని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతం వైపు ఆంధ్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు హాజరౌతున్నట్లు సమాచారం.శుక్రవారం మధ్యాహ్నం నాగార్జున సాగర్ ఇరిగేషన్ అధికారుల తో కేఆర్ఎంబీ బృందం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు.
కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు
నాగార్జునసాగర్ డ్యామ్‌పై బుధవారం అర్ధరాత్రి నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.. ఏపీ ఇరిగేషన్ అధికారులు సుమారు 500 మంది పోలీసులతో బుధవారం అర్ధరాత్రి ఆంధ్రా ప్రాంతం వైపు ఉన్న ఎంట్రెన్స్ నుంచి డ్యామ్‌పైకి ప్రవేశించారు.బుధవారం అర్ధరాత్రి ఆంధ్రా ప్రాంతం వైపు ఉన్న ఎంట్రెన్స్ నుంచి డ్యామ్‌పైకి అక్రమంగా ప్రవేశించి దాడికి పాల్పడ్డారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్‌పీఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆంధ్రా పోలీసులు డ్యామ్ సెక్యూరిటీ గేట్‌పైనుంచి దూకి, గేట్ మోటర్‌ను ధ్వంసం చేసి గేట్‌ను తెరుచుకొని లోపలికి చొరబడ్డారు. వారిని నియంత్రిస్తున్న ఎస్‌పీఎఫ్ సిబ్బందిపై దాడిచేశారు.ఆంధ్ర ఇరిగేషన్ పోలీస్ శాఖ అధికారులపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు సాగర్ డ్యాం పై విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు తో పాటు నీటిపారుదల శాఖ తెలంగాణ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు సెక్షన్ల 441,448,427 క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.