అదుపు తప్పుతున్న పొదుపు – ఆర్థిక వ్యవస్థ కుదుపు

Out-of-control austerity - economic shockదేశ స్థూలజాతీయ ఆదాయంలో 2022-23 ఆర్థిక సంవ త్సరాంతానికి నికర కుటుంబ పొదుపు 5.1శాతంగా నమోదై ఐదు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఆందోళన కర పరి ణామం. మరొకపక్క కుటుంబాల వార్షిక ఆర్థిక అప్పు గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న 3.8 శాతం కంటే మించి 2022 -23 నాటికి 5.8శాతానికి చేరడం కుటుంబాలలో పెరుగుతున్న రుణ భారానికి నిదర్శనం. ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వృద్ధిరేటును లేదా పురోగతిని కుటుంబ ఆదాయరంగం, ప్రభుత్వరంగం, కార్పొరేట్‌ రంగం అనే ప్రమాణాల ప్రాతిపదికగా నిర్ధారించవచ్చు.
కుటుంబాలలో వినియోగిత ఆదాయ ప్రాతిపదికగా పొదు పు సమీకరించబడుతుంది. నగదు, బ్యాంకు డిపాజిట్లు, డెట్‌ సెక్యూరిటీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇన్సూరెన్స్‌, ఇన్వెస్ట్‌మెంట్స్‌, చిన్న మొత్తాల పొదుపు పథకాలు వంటి వాటన్నింటిని కలిపి మొత్తంగా చేసే పొదుపును స్థూల కుటుంబ పొదుపుగా పరిగణి స్తారు. దీని నుంచి వివిధ బ్యాంకులు, నాన్‌- బ్యాంకింగ్‌ ఫైనా న్షియల్‌ కంపెనీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు ఇచ్చిన రుణా లను తీసివేయగా వచ్చేది నికర హౌస్‌హోల్డ్‌ సేవింగ్స్‌గా పరిగణి స్తారు. 2012 నుంచి 2017కు ఆర్థిక వ్యవస్థలో పొదుపుతీరును విశ్లేషిస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థ పొదుపులో హౌస్‌ హోల్డ్‌ సెక్టార్‌ నుంచి 60.93శాతం, ప్రయివేటు కార్పొరేషన్ల నుండి 35శాతం, పబ్లిక్‌ సెక్టార్‌ నుంచి 4.07శాతంగా ఉంది.
నికర ఆర్థిక పొదుపురేటు 2023 మార్చి నాటికి దాదాపు 55శాతం క్షీణించి దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపి)లో 5.15 శాతానికి పడిపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గడిచిన యాభై ఏండ్లలో ఇంత తక్కువ స్థాయిలో పొదుపురేటు నమోదు కావడం ఇదే ప్రథమం. ఆదాయ స్థాయిలో స్తబ్ధత ఏర్పడి ద్రవ్యో ల్బణం పెరగటం వలన కూడా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదాయస్థాయి, పంపిణీ, వినియోగదారుని అంచనాలు, వడ్డీరేటు వంటి అంశాలు వినియోగదారునిపై ప్రభావం చూపుతున్నాయి. అభిరుచులు, ప్రాధాన్యతలు, సంపద నిలువ ఉన్న పరిమాణం, వినియోగితా వస్తువుల పరి మాణం, పన్నుల విధానం, వివిధ వ్యాపార సంస్థలు అమ్మకాలు పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలు, వినియోగదారునికి రుణం లభించే విధివిధానాలు వంటి వివిధ అంశాలు కుటుంబ ఆదాయ వినియోగాన్ని, పొదుపును ప్రభావితం చేస్తాయి.
కుటుంబాల వినియోగిత అనేది సమకూరే ఆదాయం మీద ఆధారపడే అంశం. వ్యక్తి ఆదాయ స్థాయి ఎక్కువగా ఉంటే విని యోగిత పరిమాణం కూడా ఎక్కువగానే ఉంటుంది. వినియోగ దారుని ఖర్చులను రూపాయి విలువ, అధిక ధరలు, నిరుద్యో గిత, అందుబాటులో ఉండే ఆదాయం వంటి వివిధ భవిష్యత్‌ అంచనాలు కూడా ప్రభావితం చేస్తాయి. పొదుపుకు ప్రతిఫలం గా ఇచ్చే వడ్డీరేట్ల ప్రభావం పొదుపుపై ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ వడ్డీరేట్లు కొనసాగుతున్న సమయంలో పొదుపు వృద్ధి రేటు కూడా పెరుగుతుంది. ప్రజల అభిరుచులు, వారి సంక ల్పం, ప్రాధాన్యతల తీరుతెన్నులు పొదుపురేటును నిర్ధారిస్తాయి. సంవదను పొదుపు చేసి భవిష్యత్‌ తరానికి అందించాలనే ధృక్పథం ఉన్న పాతతరానికి, అందుబాటులో ఉన్న సౌకర్యాలకు, విలాసాలకు ఖర్చుచేయాలన్న కొత్తతరానికి మధ్య పొదుపు గుణంలో చోటుచేసుకున్న వైరుధ్యాల ప్రభావం కుటుంబాల పొదుపు వృద్ధిరేటుపై పడుతోంది.
రుణ లభ్యతను అందుబాటులోనికి తెచ్చే తీరు తెన్నులు పొదుపును బలహీన పరుస్తున్నాయి. వాయిదాల పద్ధతిలో కన్సూమర్‌ డ్యూరబుల్స్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, స్మార్ట్‌ఫోన్స్‌ వంటివి అందించే వివిధ రుణ సంస్థల వలన కూడా పొదుపు తగ్గి వినియోగిత పెరుగుతోంది. ఒక్క ఆర్థిక సంవత్సరం లోనే నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీల ద్వారా దేశంలో దేశీయ కుటుంబాలు రూ.2100 కోట్ల మేర అప్పులు తీసుకున్నాయి. మొత్తం కుటుంబ రుణాలు 15.6 లక్షల కోట్ల మేరకు చేరాయి.
ఆర్థిక వృద్ధి లక్ష్యానికి పొదుపుసూత్రం అనివార్యమని భావిం చినపుడు, వృద్ధిరేటు పెరుగుదలలో కుటుంబ పొదుపు ముఖ్య భూమిక పోషిస్తుందనేది వాస్తవం. ప్రభుత్వం ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి, ఇతర రంగాల అభివృద్ధికి దేశీయ పొదుపు కీలకం. నోట్ల రద్దు, చిన్న మొత్తాల పొదుపు పథకాలమీద ఉద్దేశపూర్వకంగా వడ్డీరేట్లను తగ్గించడం, కరోనా విపత్తు కాలంలో ప్రజలు నిజ ఆదాయాన్ని కోల్పో వటం, ఇన్సూరెన్స్‌ వంటి సామాజిక భద్రతా పొదుపు పథకాలపై కూడా జీఎస్‌టి భారాన్ని మోపడం, బ్యాంకు డిపాజిట్ల మెచ్యూరిటీ మొత్తాల మీద ఇన్‌కమ్‌ట్యాక్స్‌ విధించడం వంటి అనేక కారణాల వలన కుటుంబాల పొదుపు రేటు తగ్గుదలకు ఆస్కారం ఏర్పడింది.
కుటుంబ ఆదాయం అంటే ఒక కుటుంబంలోని అందరి వ్యక్తుల ఆదాయంగా పరిగణించాలి. రిజర్వ్‌ బ్యాంకు గణాంకాల ప్రకారం, జీడీపిలో అప్పును శాతంగా చూసినట్లయితే 2023 – 5.8శాతం, 2022 – 3.8శాతం, 2021 – 3.9శాతం, 2020 – 3.9 శాతం, 2019 – 4.1శాతంగా ఉన్నది. గత మూడేండ్ల లో కుటుంబాలు బ్యాంకులలో తీసుకున్న రుణాలను జీడీపిలో శాతంగా చూసినపుడు 2023లో 4.4శాతం, 2022లో 3.3 శాతం. 2021లో 3.2శాతంగా ఉంది. కుటుంబాలు తమ విని యోగితా అవసరాలకు అప్పుపై ఆధారపడే పరిస్థితిని ఇది ప్రతి బింబిస్తోంది. కానీ ఒక దేశంలో ఎక్కువ పొదుపు మొత్తాలు ఉంటే ఆ దేశ అభివృద్ధి ఎక్కువగా ఉంటుందనేది ప్రాథమిక నిర్ధారణ. తూర్పు ఆసియా దేశాలు అభివృద్ధి చెందటానికి ఆయా దేశాలలో పొదుపురేటు ఎక్కువగా ఉండడమే కారణం. చైనాలో ఒకదశలో పొదుపు 50శాతానికి కూడా చేరింది.
గడిచిన మూడేండ్లలో వివిధ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపనీల దగ్గర కుటుంబాలు పొందిన రుణాల మొత్తాన్ని దేశ స్థూల జాతీయోత్పత్తిలో శాతంగా విశ్లేషించి నపుడు 2023-0.40 శాతం, 2022- 0.40శాతం, 2021- 0.30 శాతంగా ఉంది. కుటుంబాల రుణభారం పెరుగుతోం దని వివిధ బ్యాంకులు, రిసెర్చ్‌ సంస్థలు నివే దికలిస్తున్నప్పటికీ ఆర్థిక మంత్రిత్వ్ర శాఖ మాత్రం కుటుంబాల పొదుపుస్థాయి తగ్గిం దన్న వాస్తవాన్ని, రుణభారం పెరిగిందన్న అంశాన్ని అంగీకరించకపోవడం ఆక్షేపణీయం.
కుటుంబ ఆదాయంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణా మాలు ఆర్థిక వ్యవస్థ స్వల్పకాలిక వృద్ధి అంచనాలపై ప్రభావాన్ని చూపే పరిస్థితి నెలకొని ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం విని యోగదారులు ఆర్థిక వ్యవస్థమీద పెరిగిన విశ్వాసంతో గృహ, వాహన రుణాలను తీసుకోవడం ప్రారంభించారని, మొత్తం బ్యాంకులు ఇచ్చిన వ్యక్తిగత రుణాలలో రియల్‌ ఎస్టేట్‌, వాహన రుణాలు 62శాతంగా ఉన్నాయని, ఇది కేవలం వినియోగదా రుని ప్రాధాన్యతలలో వచ్చిన మార్పు తప్ప రుణభారం పెరుగు దల కాదని వాదన చేయడం హాస్యాస్పదం.
2014 సంవత్సరం నుండి 2022 మధ్యకాలంలో హౌస్‌ హౌల్డ్‌ సేవింగ్స్‌ 9.2శాతం కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేటును సాధించాయని, ఇదే సమయంలో జీడీపి 9.65శాతంగా ఉందని కాబట్టి దేశ స్థూల జాతీయోత్పత్తిలో భాగంగా హౌస్‌ హౌల్డ్‌ సేవింగ్స్‌ను పోలిస్తే దాదాపు స్థిరంగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ కుటుంబ పొదుపు వృద్ధిరేటు కుంగుబాటుకు గురైతే, వివిధ రకాల ప్రభుత్వ పెట్టుబడులకు, పథకాల అమలుకు విదేశీ పెట్టుబడులపై ఆధారపడే పరిస్థితులు ఏర్పడుతాయన్న వాస్తవాన్ని విస్మరిస్తోంది.
కుటుంబాల అప్పులు పెరిగి పొదుపురేటు క్షీణించడం సమాజంలో పెరుగుతున్న అసమానతలకు సంకేతం. ఈ పరి ణామాలను అధిగమించడానికి ప్రభుత్వపరంగా స్థూల జాతీయ పొదుపురేటు పెరిగేలా చర్యలు తీసుకోవటం అనివార్యం. ద్రవ్యో ల్బణాన్ని నియంత్రించడం, ఉపాధి అవ కాశాలను పెంచడం, వడ్డీరేట్ల భారాన్ని సామాన్యులపై పడకుండా చూడడం అవసరం. ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను అమలుపర్చడం, ద్రవ్యలోటును కట్టడి చేయడం వంటి చర్యలు చేపట్టడం ఆవశ్యకం.
– జి. కిషోర్‌ కుమార్‌, 9440905501

Spread the love