జవాబుదారీతనం లేని ప్రధాని

 An unaccountable prime ministerదాదాపు గత మూడు మాసాలుగా జాతీయ రాజకీయ పరిణామాల్లో తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న మణిపూర్‌ ఘటనలు నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలన ఎంత ముదనష్టంగా ఉందో కండ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఈ నిరంకుశ ప్రభుత్వం ఎవరికీ జవాబుదారీ వహించడం లేదు. జాతులు, తెగల మధ్య హింసాకాండతో మణిపూర్‌ అట్టుడుకుతోంది. ఇంతవరకు 150మందికి పైగా చనిపోయారు. వేలాదిమంది నిరాశ్రయు లయ్యారు. ముఖ్యంగా మహిళలపై భీతిగొలిపే రీతిలో నేరాలు జరుగు తున్నాయి. ఈ పరిణామాలను యావద్దేశం తీవ్ర ఆందోళనతో తిలకిస్తున్నది. అడ్డు అదుపు లేకుండా సాగుతున్న ఈ హింసను అరికట్టి, శాంతిని తిరిగి నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని ఎవరైనా ఆశిస్తారు. వాస్తవంగా అక్కడ జరుగుతున్నది ఎవరూ ఊహించనిది. సున్ని తమైన ఈ ఈశాన్య రాష్ట్రంలో చెలరేగుతున్న విషా దాన్ని గురించి మాట్లాడేందుకు దేశ ప్రధాని మొం డిగా తిరస్కరిస్తున్నారు. డబులింజన్‌ ప్రభుత్వం (కేంద్ర రాష్ట్రాల్లో రెండు చోట్లా బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి) ప్రధానిగా మణిపూర్‌లో జరుగుతున్న నర మేధానికి ఎలాంటి జవాబుదారీ వహించడం లేదు.
సాయుధులైన మెయితీ పురుషులు ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో, అందునా పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభ సమయం కావడంతో ప్రధాని మోడీ మణి పూర్‌పై నోరువిప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది. అది కూడా పార్లమెంట్‌ వెలుపల మాట్లాడారు. ఆ ఇద్దరు మహిళలకు జరిగిన దాని పట్ల దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. కానీ ఆ వెంటనే, మహిళలపై ఇటువంటి నేరాలు జరిగినప్పుడు రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో కఠినంగా అణచివేయాలంటూ సమస్యను పక్కదారి పట్టించే యత్నం చేశారు. రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, చత్తీస్‌గఢ్‌ వంటి ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరిగే దాడులు, నేరాల విషయాన్ని ప్రస్తావించాలని తన పార్టీ నేతలకు, పార్టీ అధీనంలోని ఐటి విభాగానికి ఆయన ఈ విధంగా ఒక సంకేతమిచ్చినట్లైంది.
మణిపూర్‌లో తలెత్తిన పరిస్థితుల తీవ్రతను ప్రధాని, బీజేపీ గుర్తించ నిరాకరించే ఈ ధోరణి ఒక మానసికోన్మత్తత నుంచి వచ్చిందే తప్ప మరొకటి కాదు. మహిళలపై దాడులు ఏ రాష్ట్రంలో జరిగినా వాటిని నిర్దిష్ట నేరాలుగానే చూడాలి. మణిపూర్‌లో పరిస్థితి అలాంటిది కాదు. ఇక్కడ, ఒక ప్రత్యేక తెగకు చెందిన మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. వారు ఆ కమ్యూనిటీకి చెందడమే నేరం అన్నట్టుగా ఉంది. కుకీ మహిళలపై జరుగుతున్న హింస, అకృత్యాలన్నీ ముందస్తు పథకం ప్రకారం జరిగినవే. ఫాసిస్టు ఆరెస్సెస్‌ ప్రవచించే జాతుల ప్రక్షాళనా కార్యక్రమంలో భాగమే ఇదంతా. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఘటనలతో మణిపూర్‌ ఘటనలను ప్రధాని పోల్చడమే తప్పు. మణిపూర్‌ పరిస్థితులపై ప్రధాని ఒక ప్రకటన చేయాలంటూ పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌ అత్యంత సముచితమైనది. ప్రధానిగా ఆయన పార్లమెంట్‌కు వచ్చి కీలకమైన మణిపూర్‌పై ఒక ప్రకటన చేయాల్సి ఉంది. ప్రధాని, పార్ల మెంటుకు జవాబుదారీ అన్న మౌలిక సూత్రాన్ని సైతం ఆయన గుర్తించడం లేదు. అందుకే ప్రధాని, పాలక పార్టీ ఇటువంటి ప్రకటన చేయడానికి ససేమిరా అంటున్నాయి. అలా ప్రకటన చేసినట్లైతే ఉభయసభల్లోనూ చర్చకు అది ఒక ప్రాతిపదికగా ఉంటుంది. అందుకు ప్రధాని తిరస్కరిస్తుండడం వల్లే అది పార్లమెంటులో ప్రతిష్టంభనకు దారి తీసింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ప్రారంభం నుండీ ఇదే పరిస్థితి.
హిందూత్వ-నిరంకుశ ప్రభుత్వ స్వభావాన్ని సరిగా గ్రహించలేకపోతే, మణి పూర్‌పై ప్రధాని మాట్లాడడానికి, పార్లమెంటుకు జవాబుదారీ వహించడానికి ఎందుకు తిరస్క రిస్తున్నారో అర్థం చేసుకోలేరు. మణి పూర్‌లో ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ కుకీ గిరిజన మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని మెయితీలలో మత దుర హం కారాన్ని రెచ్చగొడుతున్నారు. కుకీ కమ్యూనిటీకి బహిరంగంగానే వ్యతి రేకంగా మాట్లాడుతూ వారిని విదేశీ యులుగా, గంజాయి సాగుచేసే వారిగా ముద్ర వేశారు. ”విదేశీయు లైన కుకీ వలసవాదులు సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవహారాలపై ఆధిపత్యం సాధించిన తర్వాత ఆది వాసులైన రాష్ట్ర ప్రజలు రెండో తరగతి పౌరుల స్థాయికి కుదించబడ్డారు” అంటూ మేలో ఈ అల్లర్లు తలెత్తడానికి కేవలం ఒక నెల రోజుల ముందే ముఖ్య మంత్రి ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక అయిన ఆర్గనైజర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అస్సాం, ఈశాన్య ప్రాంతాల నుండి అక్రమంగా వలసవాదులు వెల్లువెత్తారన్న ఆర్‌ఎస్‌ఎస్‌ సుదీర్ఘకాల ప్రచారాన్నే ఆయన కూడా పునరుద్ఘాటించారు.
మెయితీ తీవ్రవాద సంస్థ అయిన ఆరంబై తెంగోల్‌ను బీరేన్‌ సింగ్‌ ప్రోత్సహిస్తున్నారు. ఈ సంస్థకి చెందిన వారే లోయలో కుకీ మహిళలపై, ఇళ్ళపై జరిగే దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. దాడులు, ప్రతిదాడులతో మెయితీ, కుకీ కమ్యూ నిటీలకు చెందినవారు బాధితులుగా మారు తున్నారు. జాతుల మధ్య హింసను ప్రేరేపించడంలో బీరేన్‌సింగ్‌ చేసిన నేరం ఇది. నరేంద్ర మోడీ, బీజేపీ ఈ అంశాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నాయి. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడ్డారని, వారు నిష్పాక్షికంగా వ్యవహరించలేక పోతున్నారని, పరిస్థితిని అదుపుచేయలేక పోతున్నారని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వమే పరిస్థితిని అదుపు చేయ గలదనే రీతిలో కేంద్ర ప్రభుత్వం మాట్లాడు తోంది. 2002 అల్లర్లు, హింసాకాండ సమయంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ ఏ రీతిన వ్యవహ రించారో, అదే రీతిలో బీరేన్‌సింగ్‌ కూడా వ్యవహరి స్తున్నారు. మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులకు మూల కారణమేంటనేదీ మోడీకి బాగా తెలుసు. జాతులపరంగా వైవిధ్య భరితమైన, సున్నితమైన రాష్ట్రంలో విచ్ఛిన్నకర హిందూత్వ రాజకీయాలే దీనికి కారణం అనే విషయం నిరంకుశ నేతగా మోడీ తానెవరికీ చివరకు పార్లమెంట్‌కు సైతం జవాబు దారీ వహించాలని అనుకోవడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాయి. చర్చ ద్వారా మణిపూర్‌లో పరిస్థితిని ప్రముఖంగా ప్రస్తావించ డానికి, ఆచర్చకు స్పందించేలా మోడీ మెడలు వంచడానికి ఇదొక్కటే మార్గం.
(పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకీయం)

Spread the love