మరో పోరాటం

మరో పోరాటంనాగలి భుజాన పెట్టినప్పుడే
తాము యుద్ధాన్ని విరమించనట్లు
పంటపతాకాన్ని ఎగురేస్తనే ఉంటరు
ఎరువు కోసం నెత్తురు చిందించారు
విత్తనాల కోసం లాఠీలను భరించారు
కాలం పొడూత కొలిమిలా మండుతూ
ఇండియా గేట్‌ ముందు కవాతు

నేలంటే గుండెంత ప్రేమ
మట్టిలో గింజలు వాళ్ల చెమటదారలు
మెతుకు మెతుకుమీద పేరు మెరుస్తున్నా
వాళ్లెవరికీ యాదుండదు అధికారంలో సోయిండదు
పాలకులకు వాళ్లంటేనే శత్రువులు
అవసరాలకు వాళ్లను
జై కిసాన్‌ జై జవాన్‌ అని ఘనంగా కీర్తించినా
కుర్చీలెక్కాక పెంటమీద విసిరేసినాకులే
రైలు పట్టాల మీద రూపాయిబిళ్లలా
నలిగిపోయే నాగలి బిడ్డలు

రాముడంత ప్రయారిటీ రైతులు కారేమో
నినదించని నేలలేదు అడుగని దినం లేదు
ఎలుగెత్తిన నినాదాలతో రోడ్లమీదనే ఎండిపోతున్నరు
పొలాలను విడిచి రోడ్లెక్కటం ఈ దేశ దౌర్బాగ్యం
స్వామినాథన్‌ కు భారతరత్నను బహుమానమిచ్చి
కార్పొరేట్‌ కత్తుల చట్టాలతో గొంతులు కోస్తున్నరు

మేమున్నామని అన్నింటికీ అభయ మిచ్చారు
గళమెత్తకుండా నేడు బారికేడ్లతో రోడ్లు తవ్వుతున్నరు
తీవ్రవాదుల్లా చూస్తున్నరు
కర్షకుల ఉసురు పెప్సీకోలాలా తాగి
దళారుల కంపెనీలకు జయజయహోలు పాడుతున్న ‘విశ్వగురు’

నేలకు బువ్వపెట్టడానికి
నిరంతరం పొలంలో పురుగై పారాడి
పంటకంకులను కన్నబిడ్డల్లా సాదుకుంటరు
పొలంనుండి పొలాన్ని వెలిగించే పంటకాపులు
ఏడాదికేడాది కొత్తకొత్త వంగడాలతో
దేశం కడుపునింపె అన్నం చేతులు

శరీరమే సేద్యమై సర్వస్వం దారపోసినా
కృవలుడు వంచించబడుతున్నాడు
ఎండను సెల్లరూమాలుగా చుట్టి పొలం చేయటం
ఏ యుద్ధవీరుడు సాగుదారుకు సాటిరాడు
బాధలు కష్టాలతో కాలం ఎల్లదీస్తున్న శ్రవణకుమారులు
కరువు యుద్ధాలన్నీ వ్యవసాయదారుల ముందు దిగదుడుపు
అతివృష్టీ అనావృష్టి అనార్దాలన్నీ తోకముడుచినవి
మరో పోరాటమంటే హాలికులదే
ధైర్యం ఉక్కుగుండంటే రైతులదే కర్షకులదే…

(ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా..)
– వనపట్ల సుబ్బయ్య,9492765358

Spread the love