నాన్‌మైనార్టీ వైద్య కళాశాలల్లో ఏ కేటగిరీ సీట్లను 60 శాతానికి పెంచాలి

Any category of seats in non-minority medical colleges should be increased to 60 percent– ప్రశ్నోత్తరాల్లో అక్బరుద్దీన్‌, భట్టి
సారు స్పీచ్‌పై సర్వత్రా ఆసక్తి…
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీఎం కేసీఆర్‌ ఆదివారం శాసనసభలో చేయబోయే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజైన గురువారం ఆయన సభకు విచ్చేశారు. ఆ తర్వాత శుక్ర, శనివారాల్లో సభ జరిగినప్పటికీ సీఎం రాలేదు. సమావేశాలకు ఆఖరి రోజుగా భావిస్తున్న ఆదివారం ఆయన కచ్చితంగా సభకు రానున్నారు. సుదీర్ఘంగా ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్‌సీ, ఐఆర్‌, గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె, ఐకేపీ వీవోల సమస్యలు, ఆర్టీసీ విలీనం, జర్నలిస్టుల ఇండ్ల సమస్యలు తదితరాంశాలపై ముఖ్యమంత్రి స్పందన కోసం ఆయా వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇదే సమయంలో ప్రస్తుత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కానున్నాయి. ఈ క్రమంలో గత ఐదేండ్లలో తాము చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు తదితరాంశాలపై సీఎం… సుదీర్ఘంగా ప్రసంగించే అవకాశాలున్నాయి. వచ్చే శాసనసభ ఎన్నికల దృష్ట్యా కూడా అధికార పక్షానికి ఈ సమావేశాలు చాలా కీలకమైనవి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ వివిధ అంశాలపై ఎలా స్పందిస్తారు..? ఏం మాట్లాడతారనేది వేచి చూడాల్సిన అంశంగా మారింది.
సర్కారుకు ఆ రెండే ఆదాయ మార్గాలు..కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఎద్దేవా
మద్యంతో పాటు భూముల అమ్మకాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం భావిస్తున్నదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి తెలిపారు. శనివారం అసెంబ్లీలోని మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు ఆ రెండేనని ఎద్దేవా చేశారు. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 44 శాతం అని చెబుతున్నారు.. కానీ ఆయా కంపెనీల్లో తెలంగాణ ఉద్యోగుల వాటా ఎంతని ప్రశ్నించారు. రాష్ట్రం వచ్చిన తర్వాత పాలకులు మారారు తప్ప… ప్రజల జీవన స్థితగతుల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు అవకాశాలు కల్పిస్తున్నారనీ, తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని చెప్పారు.
మిగిలిన కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్‌ చేయాలి : మండలిలో నర్సిరెడ్డి
ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో మిగిలిపోయిన కాంట్రాక్టు అధ్యాపకులనూ రెగ్యులరైజ్‌ చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం శాసనమండలిలో ప్రత్యేక ప్రస్తావన కింద ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. జీవోనెంబర్‌ 16 ప్రకారం కాంట్రాక్టు అధ్యాపకులను ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేసిందన్నారు. జూనియర్‌ కాలేజీల్లో 470 మంది, డిగ్రీ కాలేజీల్లో 600 మంది ఇంకా రెగ్యులరైజ్‌ కాకుండా మిగిలిపోయారని వివరించారు. వారు అర్హతలు కలిగి ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 1,339 మంది కాంట్రాక్టు అధ్యాపకులను కూడా రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ రెగ్యులరైజ్‌ అయిన కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఎక్కువ మంది విద్యాశాఖకు చెందిన వారే ఉన్నారని చెప్పారు. మిగిలిన వారిని రెగ్యులరైజ్‌ చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
స్పౌజ్‌ టీచర్ల బదిలీలు చేపట్టాలి : ఏవీఎన్‌ రెడ్డి
రాష్ట్రంలో స్పౌజ్‌ టీచర్లకు బదిలీలను చేపట్టాలని బీజేపీ సభ్యుడు ఏవీఎన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. భార్య ఒక చోట, భర్త మరోచోట విధులు నిర్వహించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వారిని ఒకే జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. స్కూల్‌ అసిస్టెంట్ల స్పౌజ్‌ బదిలీలు చేశారని వివరించారు. మిగిలిన ఎస్జీటీలు, భాషాపండితులు, పీఈటీలకు సంబంధించిన స్పౌజ్‌ బదిలీలు చేపట్టాలని సూచించారు. దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ సీఎం కేసీఆర్‌ సహకారంతో మూడు వేల మంది స్పౌజ్‌ టీచర్ల బదిలీలు చేపట్టామని గుర్తు చేశారు. మిగిలిన వారికి సంబంధించి ఆయా జిల్లాల్లో ఖాళీ పోస్టులను బట్టి స్పౌజ్‌ బదిలీలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని హామీనిచ్చారు.

నాన్‌మైనార్టీ వైద్య కళాశాలల్లో ఏ కేటగిరీ సీట్లను 60 శాతానికి పెంచాలి ప్రశ్నోత్తరాల్లో అక్బరుద్దీన్‌, భట్టి
 కమిటీ వేస్తాం : మంత్రి హరీశ్‌రావు
రాష్ట్రంలోని మైనార్టీ మెడికల్‌ కాలేజీల్లో మాదిరిగానే నాన్‌మైనార్టీ కళాశాలల్లోనూ ఏ కేటగిరీ సీట్లను 60 శాతానికి పెంచాలని ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పట్టుబట్టారు. మైనార్టీ కళాశాలల్లో 60 శాతం ఏ కేటగిరీ సీట్లున్నాయని తెలిపారు. నాన్‌మైనార్టీ కాలేజీల్లోనూ ఏ కేటగిరీ కోటాను పెంచడం వల్ల ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు న్యాయం చేకూరుతుందని నొక్కి చెప్పారు. దీనిపై మంత్రి హరీశ్‌రావు వివరణ ఇస్తూ పరిశీలించి కమిటీ వేస్తామని హామీనిచ్చారు. దీనిపై అక్బరుద్దీన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ..’పేద విద్యార్థులకు నష్టం జరుగుతుంటే కమిటీలేంటి? కౌన్సిలింగ్‌ను ఆపేయండి’ అంటూ అరిచారు. రాష్ట్రంలో నూతన వైద్య కళాశాలల ఏర్పాటుపై శనివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో బీఆర్‌ఎస్‌ సభ్యులు గాదరి కిశోర్‌, డాక్టర్‌ సంజరుకుమార్‌, డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేవనెత్తిన అంశాలపై మంత్రి సమాధానం ఇచ్చారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో 29 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు మంజూరు చేశామన్నారు. 21 కళాశాలలు నిర్వహణలో ఉన్నాయని తెలిపారు. మరో 8 కళాశాలల ఏర్పాటు ప్రక్రియ జరుగుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో వైట్‌కోర్టు రెవల్యూషన్‌ నడుస్తున్నదన్నారు. ఒకనాడు రాష్ట్రంలో 2250 మెడికల్‌ సీట్లుంటే ఆ సంఖ్య నేడు 8,515కి చేరిందనీ, పీజీ సీట్ల సంఖ్య 2,890కి పెరిగిందని వివరించారు. ఎమ్‌బీబీఎస్‌ సీట్లు మూడు రెట్లు, పీజీ సీట్లు రెండున్నర రెట్లు పెరిగాయన్నారు. వంద సీట్ల మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు రూ.300 కోట్లు, 150 సీట్ల కళాశాలకు రూ.500 కోట్లు ఖర్చువుతున్నదని వివరించారు. ఒక్కో మెడికల్‌ విద్యార్థిపై రూ.30 లక్షలు, పీజీ విద్యార్థిపై రూ.45 లక్షలు, సూపర్‌ స్పెషాల్టీల తయారీకి రూ.75 లక్షలు ఖర్చవుతుందని సభకు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో డాక్టర్ల సంఖ్య ఉందని చెప్పారు.
కేంద్రం ప్రయివేటీకరిస్తుంటే..మేం కాపాడుతున్నాం : మంత్రి జగదీశ్‌రెడ్డి
సింగరేణి బొగ్గు గనుల వేలం అంశంపై సభ్యులు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, కాంగ్రెస్‌ సభ్యులు శ్రీధర్‌ బాబు, బీఆర్‌ఎస్‌ సభ్యులు కోరుకంటి చందర్‌, సండ్ర వెంకటవీరయ్య, దివాకర్‌రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి జి.జగదీశ్‌రెడ్డి సమాధా నాలిచ్చారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని చూస్తున్నది ఒక్క కేసీఆర్‌ ప్రభుత్వ మేనన్నారు. విద్యుత్‌ సంస్థ ప్రయివేటీకరణను వ్యతిరేకించిందీ తమ ప్రభుత్వమేనన్నారు. సింగరేణిపై కేంద్రం జోక్యం పెరుగుతున్నా చివరకు వరకు కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పా రు. సింగరేణి ప్రాంతంలో ఇతర నిక్షేపాలను వెలికి తీసే బాధ్యత ప్రయివేటుకు అప్పగించాలని కేంద్రం యత్నాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
ఎకరా పామాయిల్‌ తోటపై రూ.50,918 సబ్సిడీ : మంత్రి నిరంజన్‌రెడ్డి
రాష్ట్రంలో పామాయిల్‌ తోటల పెంపకంపై ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, సాగు ప్రోత్సహంపై అధికార పార్టీ సభ్యులు సండ్ర వెంకటవీరయ్య, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అడిగిన ప్రశ్నలకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆయిల్‌ ఫామ్‌ సాగుచేస్తున్న రైతులకు ఎకరాకు రూ.50918 సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. పన్నెండున్నర ఎకరాల వరకు రైతుల కేటగిరీ ప్రాతిపదిక 80 శాతం నుంచి 100 శాతం వరకు బిందు సేద్య సహాయాన్ని కల్పిస్తున్నామన్నారు. తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగును ప్రోత్సహించేవిధంగా అడుగులు వేస్తున్నామన్నారు. 25-30 ఎకరాల్లో కూడా సాగుచేసే రైతులకు సహాయం అందించే విషయంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
రాష్ట్రంలో 7.7 శాతం పచ్చదనం పెరిగింది : మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
రాష్ట్రంలో హరితహారం వల్ల పచ్చదనం 7.7 శాతం అధికంగా పెరిగిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. హరిత వనాల పెంపుపై అధికార పార్టీ సభ్యులు గువ్వల బాలరాజు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమి చ్చారు. రాష్ట్రంలో 13.44 ఎకరాల్లో అంతరించిపోయిన అడవులను పునర్జీవింపజేశామని తెలిపారు. 109 పట్టణ పార్కులకుగానూ ఇప్పటికే 73 పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. రాష్ట్రంలో 14864 నర్సరీలు, 19472 పల్లె ప్రకృతి వనాలు, 2011 బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామన్నారు.

Spread the love