టీసాక్స్‌లో ఏపీడీ ఇష్టారాజ్యం

– పీడీ అనుమతి లేకుండానే డాక్టర్లకు డిప్యూటేషన్‌?
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ మండలి (టీసాక్స్‌)లో అడిషనల్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మురళీధర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీసాక్స్‌ కు ప్రాజెక్టు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న కుటుంబ సంక్షేమ కమిషనర్‌ శ్వేతా మహంతి దృష్టికి తీసుకెళ్లకుండానే ముగ్గురు డాక్టర్లను టీశాక్స్‌ పరిధిలో డిప్యూటేషన్‌ ఇచ్చారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. టీశాక్స్‌లో ఇతర కేడర్లలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది గతంలో తమకు డిప్యూటేషన్‌, బదిలీ కావాలని కోరినప్పటికీ వారి డిమాండ్‌ నెరవేరలేదు. అయితే ఉన్నపళంగా ముగ్గురు డాక్టర్లకు మాత్రం డిప్యూటేషన్‌ ఎలా సాధ్యమైందని? వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దాదాపు ప్రతి రోజు జూమ్‌ సమావేశాలు ఏర్పాటు చేసి అసభ్యకరమైన భాషతో మహిళా ఉద్యోగులను హేళన చేస్తూ మానసికంగా ఇబ్బం దులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ రోగుల సేవలకు, ఆ వ్యాధి నియంత్రణకు ఉపయోగించాల్సిన నిధులను అవసరం లేని సమావేశాలకు ఖర్చు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Spread the love