హక్కుల ఉల్లంఘనపై చర్చించండి

– మోడీ, బైడెన్‌లకు అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సూచన-
రెండు దేశాలలోనూ ఇవి తీవ్రంగా ఉన్నాయని వ్యాఖ్య

వాషింగ్టన్‌ : ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మధ్య గురువారం జరిగే సమావేశంలో రెండు దేశాలలోనూ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై చర్చించాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సూచించింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం మోడీ అమెరికా చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సీఓబీ (చైర్‌ ఆఫ్‌ బోర్డ్‌) ఆకార్‌ పటేల్‌ మాట్లాడుతూ భారత్‌, అమెరికా దేశాలలో మానవ హక్కులు తీవ్రంగా ఉల్లంఘనకు గురవుతున్నాయని, వాటిని కప్పిపుచ్చడానికి బదులు ఇరువురు నేతలు వాటిపై చర్చలు జరపాలని అన్నారు. మోడీకి అమెరికాలో ఘనస్వాగతం పలికారని, కానీ భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు.
మోడీ హయాంలో భారత్‌లో మానవ హక్కులు అత్యంత వేగంగా క్షీణిస్తున్నాయని, మైనారిటీలపై హింసాకాండ కొనసాగుతోందని, పౌర సమాజంలో అసమ్మతికి చోటే లేకుండా పోతోందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ (అమెరికా) ప్రభుత్వ వ్యవహారాల జాతీయ డైరెక్టర్‌ అమంద క్లాసింగ్‌ తెలిపారు. ముస్లింల ఆస్తులు విధ్వంసానికి గురవుతున్నాయని ఆయన చెప్పారు. భారత్‌లో మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్న విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ కూడా గుర్తించిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మత స్వేచ్ఛపై అమెరికా విదేశాంగ శాఖ 2022లో విడుదల చేసిన నివేదికను ప్రస్తావించారు. భారత్‌లో చట్టాలను తుంగలో తొక్కి హత్యాకాండ, వేధింపులు జరుగుతున్నాయని, పక్షపాత ధోరణితో అరెస్టులు చేస్తున్నారని ఆ నివేదిక ఎత్తిచూపిందని గుర్తు చేశారు. తన విదేశాంగ శాఖ ఇచ్చిన నివేదికను బైడెన్‌ విస్మరించకూడదని క్లాసింగ్‌ హితవు పలికారు. ‘అభ్యంతరకరమైన భాషను వాడవద్దని బీజేపీ నాయకులకు నచ్చచెప్పమని మోడీని కోరండి. అలాగే మైనారిటీలపై జరుగు తున్న దాడులపై విచారణ జరిపించి దోషులను శిక్షించేలా చూడాలని చెప్పండి’ అని ఆయన బైడెన్‌కు సూచించారు.
భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై మోడీతో చర్చించాలని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ ఆసియా విభాగం డైరెక్టర్‌ ఎలైన్‌ పియర్సన్‌ కూడా దేశాధ్యక్షుడిని కోరారు. కాగా భారత్‌లో పౌర స్వేచ్ఛ క్షీణించడంపై ఇటీవలి కాలంలో పలు అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. గడచిన పది సంవత్సరాల కాలంగా దారుణమైన నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్న దేశాల జాబితాలో భారత్‌ కూడా చేరిందని స్వీడన్‌కు చెందిన వెరైటీస్‌ ఆఫ్‌ డెమొక్రసీ సంస్థ పేర్కొంది. 180 దేశాలలో పత్రికా స్వేచ్ఛపై సూచికను విడుదల చేసిన ఓ సంస్థ 2022లో 151వ స్థానంలో ఉన్న భారత్‌ ఈ సంవత్సరంలో 161వ స్థానానికి దిగజారిందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే పలు మానవ హక్కుల సంఘాలు మోడీ అమెరికా పర్యటనకు నిరసనగా ప్రదర్శన నిర్వహించాలని యోచిస్తున్నాయి. ఇండియన్‌ అమెరికన్‌ ముస్లిం కౌన్సిల్‌, పీస్‌ యాక్షన్‌, వెటరన్స్‌ ఫర్‌ పీస్‌, బెథెస్డా ఆఫ్రికన్‌ సెమెటరీ కొయలేషన్‌ వంటి సంస్థలు ఆందోళనకు పిలుపునిచ్చాయి.

Spread the love