గ్రూప్‌ 1పై అప్పీల్‌ డిస్మిస్‌

Appeal dismissed against Group 1– సర్వీస్‌ కమిషన్‌కు చుక్కెదురు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పేపర్‌ లీకేజీ తర్వాత కూడా గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ను సమర్ధంగా నిర్వహించలేకపోయారని సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ)ని హైకోర్టు తప్పుపట్టింది. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షను సింగిల్‌ జడ్జి రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును బెంచ్‌ సమర్ధించింది. పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో టీఎస్పీఎస్సీ విఫలమైందని చెప్పింది. ఆ తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. కమిషన్‌ వ్యవహార తీరు ఫలితంగా లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్‌ ఆయోమయంగా మారుతోందని అభిప్రాయపడింది. ఒకసారి లీకేజీ అయ్యాక రెండోసారి పరీక్షలను నోటిఫికేషన్‌ రూల్స్‌కు అనుగుణంగా చేయలేకపోయిందని ఆక్షేపించింది. కమిషన్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌లోని నిబంధనలు కమిషనే అమలు చేయకపోవడాన్ని తప్పపట్టింది. తొలిసారి గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన పరీక్షలకు బయోమెట్రిక్‌ అమలు చేసినప్పుడు లేని సమస్యలు రెండోసారి పరీక్షల నిర్వహణలో ఎందుకు వచ్చాయని తీర్పులో ప్రశ్నించింది. బయోమెట్రిక్‌ తీసుకోకపోవడానికి కారణాలను కమిషన్‌ చెప్పలేకపోయిందని వ్యాఖ్యానించింది. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షలను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సర్వీస్‌ కమిషన్‌ సెక్రటరీ దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. ఈ మేరకు జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌ల డివిజన్‌ బెంచ్‌ బుధవారం తీర్పు చెప్పింది.
”ఒకసారి పేపర్‌ లీకేజీ, పరీక్షల రద్దు తర్వాత రెండోసారి నిర్వహించిన గ్రూప్‌ 1 పరీక్షను సమర్థంగా నిర్వహించకపోవడం శోచనీయం. గ్రూప్‌ 4 పరీక్షలో మాత్రం బయోమెట్రిక్‌ తీసుకోవడం లేదని పేర్కొంటూ అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చే సినట్లుగా గ్రూప్‌ 1 పరీక్షలకు ఎందుకు జారీ చేయలేదు. పరీక్ష పెట్టిన వెంటనే ప్రకటించిన అభ్యర్థుల సంఖ్యకు. కమిషన్‌ వెబ్‌నోట్‌లోని అభ్యర్థుల సంఖ్య 258 తేడా ఎందుకు వచ్చిందో కమిషన్‌ చెప్పలేదని తప్పుపట్టింది. ఆ 258 మంది దొడ్డి దారిలో వచ్చి గ్రూప్‌ 1 వంటి కీలక పోస్టుల్లో చేరితే ప్రతిభావంతులైన అభ్యర్థుల పరిస్థితి ఏమిటని కమిషన్‌ను ప్రశ్నించింది. ఆ పోస్టులకు ఎంపికయ్యే వారంతా కొన్నేళ్లకు ఐఏఎస్‌ వంటి కన్ఫర్డ్‌ అధికారులు అవుతారని గుర్తు చేసింది. కన్ఫర్డ్‌ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయ్యాక అలాంటి వారు నిర్ణయాలు తీసుకుంటే ప్రజల భవిష్యత్తు ఏం కావాలని ప్రశ్నించింది. కమిషన్‌ నిర్వాకం వల్ల లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్‌ ప్రశ్నార్ధకంగా మారింది. గ్రూప్‌ 4 పరీక్షలకు బయోమెట్రిక్‌ తీసుకోవడం లేదని అనుబంధ నోటిఫికేషన్‌ ఇచ్చిన కమిషన్‌ గ్రూప్‌ 1 విషయంలో అవసరం లేదని ఎలా చెబుతుంది. 258 అభ్యర్థుల సంఖ్య తేడాగా కమిషన్‌ చెప్పింది. బయోమెట్రిక్‌ తీసుకోకపోవడంపై అక్రమాలు జరిగాయనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ సందేహాలకు, అనుమానాలకు కమిషనే ఆస్కారం ఇచ్చింది. నోటిఫికేషన్‌ నిబంధనలను సవరిస్తూ అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేయకపోవడం చట్ట వ్యతిరేకమే. ఈ మేరకు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు ఆమోదయోగ్యంగానే ఉంది. ఆ తీర్పులో జోక్యం చేసుకోబోము. నోటిఫికేషన్‌ను సవరించే అధికారం కమిషన్‌కు ఉన్నప్పటికీ ఆ సవరణలపై అనుబంధ నోటిఫికేషన్‌ ఇవ్వాలని నిబంధనలను గుర్తు చేసింది. పరీక్షలు అవ్వగానే 2,33,348 మంది అభ్యర్థులు హాజరయ్యారని చెప్పిన కమిషన్‌ 17 రోజుల తర్వాత ఆ సంఖ్య 258 మందిని పెంచి ఎలా చెబుతుందని ప్రశ్నించింది. అక్టోబర్‌లో జరిపిన పరీక్షకు 2,85,968 మంది హాజరయ్యారు. అధికారుల నిర్వాకం ఫలితంగా పేపర్‌ లీకేజీ అవ్వడంతో రెండోసారి పరీక్ష నిర్వహిస్తే సుమారు 50 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాయేలేదని చెప్పింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నోటిఫికేషన్‌కు కట్టుబడి ఇరుపక్షాలు (కమిషన్‌-అభ్యర్థులు) ఉండాలి. దానిని సవరించే అధికారం కమిషన్‌కు ఉన్నప్పటికీ సవరణ నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడం చెల్లదు. బయోమెట్రిక్‌ తొలిసారి పరీక్షలకు తీసుకున్నప్పుడు లేని అభ్యంతరం రెండోసారి పరీక్షల నిర్వహణ సమయంలో ఎలా వచ్చింది. పైగా 50 వేల మంది అభ్యర్థులు తగ్గిన తర్వాత కూడా కమిషన్‌ టెక్నికల్‌ సమస్యలని చెప్పడం సరికాదు. అందుకే కమిషన్‌ వేసిన అప్పీల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నాం. సింగిల్‌ జడ్జి తీర్పును ఆమోదిస్తున్నాం. తిరిగి గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించాల్సిందే.. ” అని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు చెప్పింది.

Spread the love