నేటినుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు

– మే 26న రాతపరీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌ రాతపరీక్ష వచ్చేనెల 26న జరగనుంది. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులు అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత సాధించారు. శనివారం నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభ మవు తుంది. వాటి సమర్పణకు వచ్చేనెల ఏడో తేదీ వరకు గడు వున్నది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఐఐటీ మద్రాస్‌ నిర్వహిస్తున్నది. వచ్చేనెల 17 నుంచి 26 వరకు అడ్మిట్‌ కార్డులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. అదేనెల 26న ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 రాతపరీక్షలను నిర్వహిస్తారు. జూన్‌ తొమ్మిదిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాత పరీక్షల ఫలితాలను విడుదల చేస్తారు. అదే తేదీ నుంచి ఆర్కిటెక్చర్‌ ఆప్టి ట్యూడ్‌ టెస్ట్‌ (ఏఏటీ) కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభ మవు తుంది. జూన్‌ 12న ఏఏటీ రాతపరీక్ష జరుగుతుంది. అదేనెల 15న ఏఏటీ ఫలితాలు విడుదలవతాయి. ఐఐటీల్లో సీట్ల ప్రవేశాల ప్రక్రియ జూన్‌ 10 నుంచి ప్రారంభమవుతుంది.

Spread the love