– ప్రగతిభవన్ ముట్టడి యత్నం
– 317 జీవో రద్దు చేయాలని డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
స్థానికతకు అడ్డుగా ఉన్న 317 జీవోను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం జీవో రద్దు డిమాండ్‌తో ఉపాధ్యాయులు ఒక్కసారిగా ప్రగతిభవన్ ముట్టడికి బయల్దేరారు. గమనించిన పోలీసులు ఎక్కడివారిని అక్కడే అరెస్టులు చేసి, గోషామహల్ పోలీస్ స్టేడియంకు తరలించారు. దీంతో ఉపాధ్యాయులు అక్కడే తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. రాత్రి పొద్దు పోయిన తర్వాత సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో 317 జీవో రద్దు డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. 317 జీవో కారణంగా తాము స్థానికత కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర జిల్లాల్లో ఉద్యోగాలు చేయడం వల్ల కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని, తమకు సొంత జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వాలని కోరారు.
జీవో 317 బాధితుల సమస్యను పరిష్కరించాలి : టీఎస్‌యూటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జీవో 317 బాధితుల సమస్యలను పరిష్కరించాలని టీఎస్‌యుటీఎఫ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం టీఎస్‌యుటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ జీవో కారణంగా స్థానికతను కోల్పోయి ఇతర జిల్లాలకు బలవంతంగా బదిలీ అయిన ఉపాధ్యాయులు గత రెండేండ్లు గా మొరపెట్టుకుంటున్నా, ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ డిఎస్సీకి 5089 పోస్టులు మాత్రమే నోటిఫై చేశారని తెలిపారు. గనుక మిగిలిన ఖాళీల్లో వీరిని బదిలీ చేసే వీలుందని సూచించారు. ప్రభుత్వం 317 అమలు వలన స్థానికత కోల్పోయిన వారిని, స్పౌజ్ ఉపాధ్యాయులందరినీ బదిలీ చేసి సమస్యకు ముగింపు పలకాలని కోరారు. ఆదివారం తమ గోడు చెప్పుకోవటానికి ప్రగతి భవన్ వద్దకు వచ్చిన ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి పొద్దుపోయేవరకు పోలీసు స్టేషన్లోనే నిర్బంధించటాన్ని వారు ఖండించారు.