ఖమ్మంలో ఆశాల అరెస్టు..

– ఖమ్మంలో ఆశాల అరెస్టు
– మంత్రి అజయ్ కు వినతిపత్రం ఇవ్వకుండా అడ్డుకున్న పోలీసులు
– టూ టౌన్ పోలీస్టేషన్ లోనూ కొనసాగిన ఆశాల ఆందోళన
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి: తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఖమ్మంలోని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయానికి వినతిపత్రం ఇచ్చేందుకు మంగళవారం వెళ్లిన ఆశాలను పోలీసులు దౌర్జ్యన్యంగా అరెస్టు చేశారు. ఖమ్మం టూ టౌన్ పోలీసుస్టేషన్ కు తరలించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు విష్ణును బలవంతంగా ఎత్తుకెళ్లి పోలీసు వ్యాన్ లో పడవేశారు. అరెస్ట్ అయిన ఆశలందరూ పేర్లు, సంతకాలు ఇవ్వాలని పోలీసు అధికారులు ఒత్తిడి చేయడంపై ఆశాలు అభ్యంతర పెట్టారు. ముఖ్యుల సంతకాలతో ఇస్తామన్నా ఒప్పుకోక పోవడంతో స్టేషన్ లో ఆందోళన నిర్వహించారు. సీఐ కుమారస్వామి జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఆశావర్కర్లకు ఫిక్స్ డ్ వేతనం 18000 ఇవ్వాలని, వర్కర్లలందరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఇతర సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పి. రమ్య, వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంగమ్మ, నాయకులు రమణ, రమ్య, శశిరేఖ, విజయ, హవేలీ మండల కన్వీనర్ పవన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love