Tuesday, May 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅధికార దాహం తప్ప రాష్ట్ర సమస్యల పరిష్కారంపై దృష్టేది?

అధికార దాహం తప్ప రాష్ట్ర సమస్యల పరిష్కారంపై దృష్టేది?

- Advertisement -


తెలంగాణ ప్రజలను నిరుత్సాహపరిచేలా ప్రధాని మోడీ ప్రసంగం : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణ ప్రజలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగం నిరుత్సాహపరిచందనీ, ఆయన ప్రసంగంలో అధికార దాహం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి లోపించిందని సీపీఐ(ఎం) విమర్శించింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. నీతి సూత్రాలు వల్లించి ఊకదంపుడుగా ఉపన్యాసం చేశారు తప్ప ఈ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎందుకు అడ్డుకుంటున్నారు? రాష్ట్రానికి ఆర్థికంగా రావాల్సిన నిధులు ఎందుకు తగ్గుతున్నాయి? అనే విషయాలకు సమాధానం చెప్పలేదని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తమతో జట్టుకట్టడంతో పాటు తమకు అనుకూలంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రికి పరోక్షంగా మోడీ సంకేతమివ్వడం సహేతుకం కాదన్నారు. పెట్రోల్ వాడకాన్ని నియంత్రించాలనీ, ప్రజారవాణా, మెట్రోరైళ్ల ద్వారా ప్రయాణాలు చేయాలనీ, బంగారం కొనొద్దనీ, విదేశీ పర్యటనలు చేయొద్దని ఉచిత సలహాలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. విదేశాంగ విధానం విషయంలో మోడీ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ధరలు పెరగడానికి ప్రధానకారణమైన యుద్ధాన్ని ఆపకుండా, అమెరికా అధ్యక్షుని ముందు మోకరిల్లే వైఖరిని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తోందని పేర్కొన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లు తేవడం, విద్యుత్‌ ‌ప్రయివేటీకరణ కోసం విద్యుత్ సవరణ చట్టం తేవడం దేశానికే ప్రమాదకరమని హెచ్చరించారు. మోడీ ఉపన్యాసంలో తెలంగాణ రాష్ట్ర సమస్యల ప్రస్తావన లేకుండా రాష్ట్రంలో అధికారంలోకి ఎలా రావాలనే అంశం మీదనే కేంద్రీకరణ కనిపించిందని విమర్శించారు. మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గడ్డ తెలంగాణ అనీ, అదే పోరాట స్ఫూర్తితోనే బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -