మధ్యప్రదేశ్‌లో 39 మంది కాంగ్రెస్‌ నేతలపై వేటు

39 in Madhya Pradesh Attack on Congress leaders– పార్టీ అభ్యర్థులపై రెబల్‌ గా పోటీ చేసినందుకు చర్యలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మధ్యప్రదేశ్‌లోని 39 మంది కాంగ్రెస్‌ నేతలపై ఆ పార్టీ వేటు వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేసినందుకు ఈ 39 మంది నాయకులను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి ఆరేండ్లపాటు బహిష్కరించారు. పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ ఆదేశాల మేరకు వీరిని కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించినట్లు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్‌ సింగ్‌ ప్రకటనలో తెలిపారు. బహిష్కరణకు గురైన నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా, బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) టిక్కెట్‌పై ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మాజీ ఎంపీ ప్రేమ్‌చంద్‌ గుడ్డు (అలోట్‌), మాజీ ఎమ్మెల్యే అంతర్‌ సింగ్‌ దర్బార్‌ (మోవ్‌), మాజీ ఎమ్మెల్యే యద్వేంద్ర సింగ్‌ (నాగోడ్‌), రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి అజరు సింగ్‌ యాదవ్‌ (ఖర్గాపూర్‌), నాసిర్‌ ఇస్లాం ( భోపాల్‌ నార్త్‌), అమీర్‌ అక్వీల్‌ (భోపాల్‌ నార్త్‌) పోటీ చేస్తున్నారు.
బీజేపీ మంత్రి నారాయణ్‌ త్రిపాఠి తిరుగుబాటు
బీజేపీ మంత్రి నారాయణ్‌ త్రిపాఠి తన పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తన సొంత పార్టీ ‘వింధ్య జనతా పార్టీ’ (విజెపి)ని ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం త్రిపాఠి తన కొత్త పార్టీ నుండి 25 మంది అభ్యర్థులను బరిలోకి దింపారు. నారాయణ్‌ త్రిపాఠి స్వయంగా మైహార్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల జాబితాలో 10 షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ) రిజర్వ్‌డ్‌ సీట్లు, ఒక షెడ్యూల్డ్‌ కులం (ఎస్సీ) రిజర్వ్‌డ్‌ సీటు, 14 జనరల్‌ కేటగిరీ సీట్లు ఉన్నాయి. 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి నవంబర్‌ 17న ఎన్నికలు జరగనున్నాయి.

Spread the love