సాయి భగీరథ అరెస్టుకు అశ్వారావుపేట లో నిరసన
మైనర్ బాలికకు న్యాయం చేయాలని ప్లకార్డులతో ప్రదర్శన
నవతెలంగాణ – అశ్వారావుపేట
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో అశ్వారావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైనర్ బాలికపై జరిగిన ఘటనలో బండి సాయి భగీరథపై పోక్సో కేసు నమోదైనా ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బండి సంజయ్‌ను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుమారుడిని కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నిందితుడిని అరెస్టు చేయడంలో ఆలస్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తాత్సారం ప్రదర్శిస్తోందని విమర్శించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, బాధిత మైనర్ బాలికకు వెంటనే న్యాయం చేయాలని నాయకులు కోరారు. నిందితుడు ఎంతటి వారైనా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అశ్వారావుపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



