నవతెలంగాణ – అశ్వారావుపేట
గ్రామీణ ప్రజల విద్య, వైద్యం, ఉద్యోగాలు, ప్రభుత్వ కార్యాలయాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన బస్ సర్వీసులను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. మంగళవారం అశ్వారావుపేట బస్ స్టాండ్ లో కొత్తగూడెం – అశ్వారావుపేట నూతన బస్ సర్వీస్ ను ఆయన ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పల్లె రవాణా వ్యవస్థ మెరుగుపడుతోందన్నారు.తన ప్రత్యేక కృషితో అశ్వారావుపేట మండల గ్రామీణ ప్రజలకు మరింత రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు.
కొత్తగా ప్రారంభించిన ఈ బస్ సర్వీస్ ములకలపల్లి, జగన్నాధపురం, గండిముత్యాలమ్మ ఆలయ ప్రాంతం మీదుగా రెడ్డిగూడెం, తిరుమలకుంట, వినాయకపురం వైపుగా ప్రయాణిస్తూ మండలంలోని పలు గ్రామపంచాయతీల ప్రజలకు జిల్లా కేంద్రానికి చేరుకోవడంలో ఉపయోగకరంగా మారనుంది. ఈ బస్ ఉదయం 7:30 గంటలకు అశ్వారావుపేట నుంచి బయలుదేరి 9:40 గంటలకు కొత్తగూడెం చేరుకోనుండగా, తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4:30 గంటలకు కొత్తగూడెం నుంచి బయలుదేరి 6:20 గంటలకు అశ్వారావుపేట చేరుకోనుంది.
అదేవిధంగా సత్తుపల్లి డిపో నుంచి భద్రాచలం వరకు మరో నూతన పల్లెవెలుగు బస్ సర్వీస్‌ను కూడా ప్రారంభించారు. ఈ సర్వీస్ ములకలపల్లి, పొగళ్లపల్లి, తిమ్మంపేట మీదుగా భద్రాచలం చేరుకుని తిరిగి సత్తుపల్లికి ప్రయాణించనుంది. గ్రామీణ ప్రాంత ప్రజలు సులభంగా ప్రయాణించేలా ఈ కొత్త బస్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజక వర్గంలోని చండ్రుగొండ,దమ్మపేట,మందలపల్లి బస్ స్టాండ్ లను పునరుద్ధరించి,అశ్వారావుపేట బస్ స్టాండ్ ను డిపో గా ఆధునీకరణ చేస్తామని అన్నారు.
అడిగిన వెంటనే సౌకర్యాలు కల్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి,ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ లకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిపో మేనేజర్లు రాజ్యలక్ష్మి, లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ విజయ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.



