– ప్రజా సహకారంతో సమరశీల పోరాటాలే శరణ్యం
– ‘బెఫీ’ తెలంగాణ ద్వితీయ మహాసభ ప్రారంభంలో దెబాశిష్ బసు చౌదరి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రం ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణను వేగవంతం చేసిందనీ, ప్రజా భాగస్వామ్యంతో ఈ చర్యల్ని సమర్థవంతంగా సమరశీల పోరాటాలతో తిప్పికొట్టాలని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బెఫీ) జాతీయ ప్రధాన కార్యదర్శి దెబాశిష్ బసుచౌదరి పిలుపునిచ్చారు. బెఫీ తెలంగాణ రాష్ట్ర శాఖ ద్వితీయ మహాసభలు ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. బెఫీ సీనియర్ నాయకులు ప్రకాష్‌పాండే బెఫీ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన దెబాశిష్ బసుచౌదరి మాట్లాడుతూ జాతీయ బ్యాంకుల విలీనంతో ఉద్యోగ సంఘాల బలం పెరిగినా, ప్రయివేటీకరణ ప్రమాదం వెంటాడుతూనే ఉందన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ను నిర్వీర్యం చేసినట్టే ప్రభుత్వరంగ బ్యాంకుల్నీ కార్పొరేట్లకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తూనే ఉందన్నారు. దానిలో భాగంగానే ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్రమేణా వినియోగదారుల సేవల్ని కుదిస్తున్నారనీ, వారికి విసుగు కలిగించేలా సర్వీసుల్ని ఆలస్యం చేస్తున్నారని వివరించారు. దీనికి కారణం రెండు దశాబ్దాలుగా బ్యాంకుల్లోని ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయకపోవడమేనని చెప్పారు. దేశంలోని బ్యాంకుల్లో దాదాపు 20 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయనీ, వాటిని భర్తీ చేయకపోవడం వల్ల ఉన్నవారిపై పనిభారం పెరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం అప్పుడప్పుడు ప్రచారార్భాటం చేస్తున్నదనీ, కానీ ఆ ఉద్యోగాలన్నీ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ల పేరుతో గంటలు, రోజువారీ వేతనాలు ఇచ్చేవేనని స్పష్టం చేశారు.
బ్యాంకుల్లో ఆ ప్రాతిపదికగా తీసుకున్న ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకు ఉద్యోగులు అందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. గ్రామీణ బ్యాంకుల ప్రయివేటీకరణ వేగవంతం అయ్యిందనీ, దాన్ని నిలువరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల్లోని నాబార్డ్ బ్యాంకుల్ని బలోపేతం చేయాలనీ, నియామకాలు చేపట్టి, నిధులు కేటాయించాలని కోరారు. సహకార రంగంలోని బ్యాంకుల్ని సైతం కేంద్ర ప్రభుత్వం వదిలిపెట్టట్లేదనీ, వాటినీ ప్రయివేటుకు అప్పగించేలా నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్‌కు చెందిన నందిని, అమూల్ వంటి సంస్థల్ని కలిపి, వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్నారంటూ కర్నాటక ఘటనల్ని ఉదహరించారు. బ్యాంకుల్లో సేవల్ని కుదిస్తే, గత్యంతరం లేక ప్రజలు ప్రయివేటుకు మొగ్గుచూపుతారనే దుర్నీతితోనే కేంద్రప్రభుత్వం ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. ఖాళీ పోస్టుల్లో తాత్కాలిక ప్రాతిపదికన రిటైర్డ్ ఉద్యోగులను నియమిస్తున్నారనీ, 30-35 ఏండ్లకు పైగా సర్వీసు చేసి, ఉద్యోగ విరమణ జీవితాన్ని అనుభవించాల్సిన వయసులో వారితో పనిచేయించుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థలపై జరుగుతున్న దాడుల్ని ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పాలనీ, ఆ సంస్థలు నష్టపోతే సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో కూడా వివరించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే ప్రయివేటీకరణను తిప్పికొట్టగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. సుందరరామ్ ప్రసన్న అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆలిండియా రీజినల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ఎస్ వెంకటేశ్వరరెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, బెఫీ తెలంగాణ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి పీ వెంకట్రామయ్య, ఆర్బీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి ఎమ్వీ హరీశ్‌బాబు, గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.