వెలుగు జిలుగులు

– విద్యుత్‌రంగంలో విశేష ప్రతిభ
– 9 ఏండ్లలో అనేక ఘన విజయాలు
– సాహౌ…సింగరేణి
– నేటి ‘దశాబ్ది’లో విద్యుత్‌,సింగరేణి ఉత్సవాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
స్వరాష్ట్రం వస్తే ఏమొస్తుందని ఉద్యమ సమయంలో సందేహాలు వ్యక్తం చేసిన వారికి గడచిన 9 ఏండ్లలో రాష్ట్రంలో వెదజల్లిన కరెంటు వెలుగులే ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి. సమైక్య పాలనలో సాధ్యంకాని మిగులు విద్యుత్‌ను ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ సాధించింది. అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఒడిసిపట్టి, కనీవినీ ఎరుగని రీతిలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నది. అన్నిరంగాలకు పుష్కలంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరాను చేస్తున్నది. ఈ మొత్తంలో విద్యుత్‌రంగ ఉద్యోగులు, అధికారుల కృషి ప్రధాన కారణమైతే, దానికి తగినట్టే రాష్ట్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారాన్ని అందించి, ఈ విజయాలను సాధించింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కోసం ప్రభుత్వం ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 18,453 మెగావాట్లకు పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 74 మెగావాట్లు మాత్రమే ఉన్న సోలార్‌ విద్యుదుత్పత్తి సామర్ధ్యం ఇప్పుడు 5,741 మెగావాట్లకు పెరిగింది. కొత్తలైన్ల నిర్మాణం చేపట్టి పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మెరుగుపరుచుకుంది. కాకతీయ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌) 7వ దశ నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. సింగరేణి ఆధ్వర్యంలో భూపాలపల్లి, జైపూర్‌ ప్లాంట్ల ద్వారా 1800 మెగావాట్ల విద్యుత్తును సమకూర్చుకుంది. జలవిద్యు దుత్పత్తినీ పెంచుకుంది. 1080 మెగావాట్లతో భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌, 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో యాదాద్రి అల్ట్రా మెగా పవర్‌ ప్లాంటు నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయి. రూ.22,502 కోట్ల వ్యయంతో సబ్‌ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కొత్త లైన్ల నిర్మాణం చేపట్టి, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేశారు. తలసరి విద్యుత్తు వినియోగం 1,356 యూనిట్ల నుంచి 2,126 యూనిట్లకు పెరిగింది. జాతీయ తలసరి వినియోగం కంటే, తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 69 శాతం ఎక్కువ. అనేక రంగాలకు సబ్సిడీలతో కూడిన కరెంటును రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది.
సింగరేణి అద్భుత ప్రగతి
స్వరాష్ట్ర సాధన తర్వాత సింగరేణి కాలరీస్‌ సంస్థ అద్భుత ప్రగతిని సాధించింది. లాభాల్లో 421 శాతం వృద్ధిని సాధించింది. బొగ్గు అమ్మకాల్లో 176 శాతం, ఉత్పత్తిలో 33 శాతం, రవాణాలో 39 శాతం అభివృద్ధిని కొనసాగిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 19 వేలకు పైగా కొత్త నియామకాలు చేపట్టారు. ఈ తొమ్మిదేండ్లలో 14 కొత్త గనులను ప్రారంభించారు. కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియ ద్వారా 15,250 మంది వారసులకు ఉద్యోగాలు ఇచ్చారు. కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కోల్‌ ఇండియా కూడా ఈ స్థాయిలో అభివృద్ధిని సాధించలేకపోయింది.

Spread the love