నవతెలంగాణ – హైదరాబాద్
దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ మరే ఆటకు లేదు. క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించే అభిమానులు కోకొల్లలు. క్రికెట్‌ను ఒక మతంగా భావించే మన దేశంలో సరిగ్గా పుష్కర కాలం తర్వాత ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ జరుగబోతున్నది. నాలుగోసారి ఆతిథ్యమివ్వబోతున్న భారత్ అందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. ప్రపంచంలోనే ధనిక బోర్డుగా వర్ధిల్లుతున్న బీసీసీఐ తమ రేంజ్‌లో ఏర్పాట్లు చేస్తున్నది. మెగాటోర్నీకి మరో వంద రోజులు మిగిలిఉన్న నేపథ్యంలో ఐసీసీ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. మొత్తం పది ప్రధాన వేదికలుగా మ్యాచ్‌లు జరుగనున్నాయి. అయితే ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. అసలు ముచ్చట ఏంటంటే మెగాటోర్నీలో కీలకమైన మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌కు కేటాయిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రధాన వేదికలైన ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరుకు అప్రాధాన్య మ్యాచ్‌లు ఇచ్చిన బోర్డు అహ్మదాబాద్‌కు మాత్రం పెద్దపీట వేసింది. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌కు అగ్రతాంబూలం వేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తనయుడు, బోర్డు కార్యదర్శి జై షా చక్రం తిప్పినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. మెగాటోర్నీలో తొలి మ్యాచ్, ఫైనల్ ఫైట్‌తో పాటు కోట్లాది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల పోరు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కూడా అహ్మదాబాద్ ఎగురేసుకుపోయింది.