బెంగళూరులో 65 కిలోమీటర్ల సొరంగ మార్గం

నవతెలంగాణ – బెంగళూరు
బెంగళూరులో ట్రాఫిక్‌ నియంత్రణకు 65 కిలో మీటర్ల మేర సొరంగ మార్గం ఏర్పాటు అనుమతులకై కేంద్రప్రభుత్వానికి రాష్ట్రం ప్రతిపాదనలు పంపింది. కేంద్ర భూ ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరిని ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్‌జార్కిహొళి బృందం భేటీ అయింది. ఇందుకు సంబంధించి మంత్రి నగరంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ బెంగళూరులో ట్రాఫిక్‌ తీవ్రమైన సమస్యగా మారుతోందని, ఫ్లై ఓవర్లు, రోడ్ల వెడల్పుతో సాధ్యం కావడం లేదని ప్రత్యామ్నాయమైన సొరంగ మార్గం ఏర్పాటు చేయదలిచామని వివరించామన్నారు. ప్రస్తుతం మెట్రో సొరంగ మార్గం పలు చోట్ల ఉందని అదే తరహాలో రోడ్డు మార్గాలకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. పీణ్యా-హెబ్బాళ, కేఆర్‌ పురం – హోసూరు మార్గాల్లో సొరంగం ఏర్పాటు చేయాల్సి ఉందని వివరించారు. మంగళూరు జాతీయ రహదారి శిరాడిఘాట్‌ వద్ద సొరంగ మార్గం అంశం ప్రస్తావించిన మేరకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు మంత్రి సతీశ్‌ జార్కిహొళి ప్రకటించారు. హొన్నావర – కుమట, బెంగళూరు హెబ్బాళ్‌ జంక్షన్‌లో ఫ్లై ఓవర్ల నిర్మాణాలకు అనుమతులు కోరారు. రాష్ట్రానికి సంబంధించి 38 రోడ్లను నేషనల్‌ హైవేలుగా పరిగణించాలని కోరారు.

Spread the love