బీసీలు, మహిళా ఓటు బ్యాంకే లక్ష్యంగా..

BCs target women's vote bank– త్వరలో రెండు కొత్త పథకాలు…
– ఆయా వర్గాల సాధికారతపై ఫోకస్‌
– ఎన్నికల ప్రణాళికలో చేర్చనున్న సీఎం కేసీఆర్‌
– ఇప్పటికే కసరత్తులు పూర్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా దళిత బంధు పథకాన్ని తెరపైకి తెచ్చిన సీఎం కేసీఆర్‌.. అదే తరహాలో ఇప్పుడు బీసీలు, మహిళా ఓటర్లే లక్ష్యంగా మరో రెండు కొత్త స్కీములకు రూపకల్పన చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయన పార్టీలోని సీనియర్లు, ఉన్నతాధికారులతో కలిసి కసరత్తులు పూర్తి చేసినట్టు తెలిసింది. దళిత బంధు తరహాలో వాటికి బీసీ బంధు, మహిళా బంధు తదితర పేర్లను పెట్టే అవకాశముంది. ఇటీవల బీఆర్‌ఎస్‌ ప్రకటించిన తొలి విడత అభ్యర్థుల జాబితాలో బీసీలకు అన్యాయం జరిగిందనే విమర్శలను ఆ పార్టీ ఎదుర్కొంటున్నది. మరోవైపు కాంగ్రెస్‌ గతంలో విడుదల చేసిన యూత్‌ డిక్లరేషన్‌, తాజాగా ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ కూడా గులాబీ పార్టీని ఆలోచనలో పడేశాయి. దీంతో బీసీల్లోని అసంతృప్తిని చల్లార్చేందుకు, హస్తం వైపు జనాల గాలి మళ్లకుండా చూసేందుకు బీసీ, మహిళా పథకాలను ముందుకు తెస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా ఈ రెండు సెక్షన్లలోని లబ్దిదారులకు రూ.10 లక్షల మేర ఆర్థిక సాయం ప్రకటించే అవకాశముంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం… ఇప్పుడు కొనసాగుతున్న ‘బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం పథకాని’కి రాబోయే స్కీము అదనంగా ఉండబోతున్నది. మరోవైపు రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు మినహా మహిళల ఆర్థిక స్వావలంబనకు సంబంధించిన పథకాలేవీ లేవని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. అందువల్ల వారిని ఆర్థికంగా పైకి తీసుకు రావాటానికి మరో పథకాన్ని సీఎం ప్రకటించనున్నారు. ఇలాంటి అంశాలన్నింటినీ క్రోడీకరించి బీఆర్‌ఎస్‌ తన ఎన్నికల ప్రణాళికను రూపొందించనుంది. వీటితోపాటు నిరుద్యోగులకు కూడా ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కేసీఆర్‌ యోచిస్తున్నారు. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో గులాబీ పార్టీ ‘నిరుద్యోగ భృతి’ని ప్రకటించింది. ఆ అంశాన్ని మ్యానిఫెస్టోలో కూడా చేర్చారు. కానీ ఆ తర్వాత అధికార పార్టీ ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించింది. ఇప్పుడు మళ్లీ నిరుద్యోగులు దూరం కాకుండా ఉండేందుకు వారి కోసం ఓ కొత్త స్కీమును ప్రకటించనున్నారని తెలంగాణ భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌… ‘మా అమ్ముల పొదిలో అనేక అస్త్రాలున్నాయి.. వాటిని ఒక్కోటిగా విడుదల చేస్తాం…అప్పుడు ప్రతిపక్షాలకు దిమ్మ తిరగటం ఖాయం…’ అంటూ వివిధ వేదికల మీద వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కారు పార్టీ ప్రవేశపెట్టబోయే బీసీ, మహిళా పథకాలు, నిరుద్యోగులకు వరాలనేవి ఎప్పుడు, ఏ రూపంలో బయటకు వస్తాయనేది వేచి చూడాలి. అక్టోబరులో వరంగల్‌లో భారీ బహిరంగ సభకు ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో అక్కడ ఈ పథకాలను ప్రకటిస్తారా..? లేదంటే వేరే సందర్భంలో వెల్లడిస్తారా..? అనేది ఇప్పుడప్పుడే చెప్పలేమని ఓ సీనియర్‌ నేత ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

Spread the love