రంగుల హోలీలో జర జాగ్రత్త…

In colorful Holi
Be careful...రంగుల పండుగ హౌలీని ఎంతో ఉత్సాహంగా.. ఉల్లాసంగా జరుపుకుంటాం. అంతా రంగులు, రంగుల నీళ్లు చల్లుకుంటూ ఎంజారు చేస్తారు. ఈ సందర్భంలో జుట్టు, చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. మార్కెట్‌లోని అసహజ రంగులు చర్మానికి హాని కలిగించడమే కాకుండా కండ్లను కూడా దెబ్బతీస్తాయి. హౌలీ అడే సందర్భంలో అనుసరించాల్సిన కొన్ని సూచనలు, సలహాలను నిపుణులు అందిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం..
ప్రస్తుతం మార్కెట్లో సైతం సేంద్రీయ, సహజ రంగులు అందుబాటులోకి వచ్చాయి. వాటినే కొనుక్కోవాలి. రసాయనాలతో నిండిన రంగులను వాడకపోవటమే మంచిది. ఎందుకంటే వాటి వల్ల చర్మం, కళ్ళు, జుట్టుకు హాని కలుగుతుంది. గోరింటాకులతో ఆకుపచ్చని రంగు ద్రావణాన్ని, బీట్‌ రూట్‌తో గులాబి రంగు ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. పసుపు కొమ్ములను దంచి నీళ్లలో నానబెట్టి పసుపు రంగు వాటర్‌ను ఇలా చెట్ల ఆకులు, పూలతోనే ఇంట్లోనే సహజంగా రంగుల ద్రావణాలు తయారు చేసుకోవటం మంచిది.
హోలీ ఆడే ముందు మీ శరీర చర్మానికి, వెంట్రుకలకు నూనె రాసుకోవటం మంచిది. ఎవరైనా రసాయనాలతో నిండిన రంగులను ఉపయోగిస్తే, ఆ నూనె మీ చర్మానికి రక్షణ పొరలా పనిచేస్తుంది. నూనె జుట్టు , చర్మంపై జిడ్డుగల రక్షణ పొరను సృష్టిస్తుంది. ఈ పొర జుట్టు, మన చర్మం యొక్క ఫోలికల్స్‌లో రంగులు చొరబడకుండా అడ్డంకిగా పనిచేస్తాయి. ఆయిల్‌ ఆధారిత లేయర్‌ను హౌలీ వేడుకల తర్వాత రంగును సులభంగా కడుక్కోవడానికి వీలుంటుంది. మీ చర్మాన్ని కొబ్బరి, ఆలివ్‌, బాదం, ఇతర నూనెల నుండి ఎంచుకోవటం మంచిది. ఈ నూనెలు మీ చర్మాన్ని రక్షించడమే కాకుండా పోషణ , హైడ్రేట్‌గా పని చేస్తాయి.
హోలీ తర్వాత, సహజ సబ్బులతో స్నానం చేయటం మంచిది. ఎందుకంటే హెర్బల్‌ సబ్బులు రంగును సున్నితంగా తొలగించడమే కాకుండా చర్మానికి పోషణను అందిస్తాయి. గంథం, పసుపుతో చేసిన సబ్బులు, యాక్టివేటెడ్‌ చార్‌కోల్‌, తేనె , బాదం నూనెతో చేసిన సబ్బులు హోలీ తర్వాత ఉపయోగించడానికి ఉత్తమమైన సబ్బులు. అవి మీ చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి.
కళ్లల్లోకి రంగు వెళ్లకుండా ఏదైనా అద్దాలు ధరించాలి. లేనిపక్షంలో కళ్లల్లోకి రంగు వెళ్లి కంటి చూపుపై సైతం ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. చర్మ సంబంధమైన చికిత్స చేయించుకున్న వారు రంగుల జోలికి వెళ్లకూడదు. దానివల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం కనిపించవచ్చు. కొన్నిసార్లు దీర్ఘకాలిక సమస్యల బారిన పడతారు.
ముందుగా ఇది సమ్మర్‌ కాబట్టి సెలబ్రేషన్‌ను ఉదయం లేదా సాయంత్రం పూటల్లో జరుపుకుంటే మంచిది. ఒక పక్క ఎండ, మరో పక్క రంగుల దెబ్బకు చర్మం మరింత ఎక్కువ పాడవుతుంది. ఎండకు డీహైడ్రేషన్‌ కూడా అవ్వొచ్చు.

Spread the love