బెంగాల్‌ మారుతోంది..!

– హింసాకాండను ప్రతిఘటించి స్థానిక ఎన్నికల్లో వామపక్షాలకు ఆదరణ
– 2021 తర్వాత క్రమంగా తగ్గుతున్న బీజేపీ బలం
– బెదిరింపులు, గూండాగిరితో తృణమూల్‌ ఆధిపత్యం
కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితి క్రమంగా మారుతోంది. తృణమూల్‌, బీజేపీ పన్నాగాలను ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ఈ నెల 8న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చూస్తే ఇదే విషయం అర్థం అవుతుంది. 2021 తర్వాత జరిగిన వివిధ ఎన్నికల్లో సీపీఐ(ఎం), ఇతర వామపక్షాలతో పాటు కాంగ్రెస్‌, ఐఎస్‌ఎఫ్‌ వంటి పార్టీల బలం క్రమంగా పెరుగుతోంది. బీజేపీ ఓటింగ్‌ శాతం క్రమంగా తగ్గిపోతోంది.
తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలతో పోలీసులు జట్టుకట్టి ఈ ఎన్నికల్లో హింసాకాండ సృష్టించినా, పోలింగ్‌ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడినా ప్రజలు తమ శక్తిమేరా ప్రతిఘటించి వామపక్షాలను ఆదరించారు. గతంలో పోలిస్తే వివిధ ఎన్నికల్లో వామపక్షాలు క్రమంగా బలం పుంజుకుంటున్నాయి.
ఆధిపత్యం నిలుపుకున్న అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌
ఈ నెల 8న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేసి అనేక అక్రమాలకు పాల్పడిన అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. బుధవారం సాయంత్రం 7.30 ప్రాంతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం.. మొత్తం 63,229 గ్రామ పంచాయతీ స్థానాల్లో సగానికి పైగా స్థానాల్లో గెలుపొందింది. 34,913 గ్రామ పంచాయితీ స్థానాల్లో విజయం సాధించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ మరో 607 స్థానాల్లో ముందజలో ఉంది. తృణమూల్‌తో కుమ్మక్కు రాజకీయాలు సాగించిన బీజేపీ 9,722 సీట్లలో గెలుపొంది..మరో 150 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల నాటి ఫలితాలతో పోల్చి చూస్తే బీజేపీ ఓటింగ్‌ శాతం బాగా తగ్గిపోవడం గమనార్హం.
సీపీఐ(ఎం), కాంగ్రెస్‌ 6500 స్థానాల్లో విజయం సాధించాయి. వీటి బలం గతంతో పోలిస్తే క్రమంగా పుంజుకుంటూ వస్తోంది. సీపీఐ(ఎం) 2,938 సీట్లలో విజయం సాధించి 67 స్థానాల్లో ముందజలో ఉంది. కాంగ్రెస్‌ 2,543 స్థానాల్లో గెలుపొందింది..మరో 66 స్థానాల్లో ముందజలో కొనసాగుతోంది.
పంచాయతీ సమితి : మొత్తం 9,728 పంచాయతీ సమితి స్థానాలకు ఎన్నికలు జరగగా తృణమూల్‌ కాంగ్రెస్‌ 6,430 స్థానాల్లో గెలుపొందింది. మరో 195 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 982 సీట్లలో విజయం సాధించి 54 చోట్ల ముందజలో ఉంది. కాగా సీపీఐ(ఎం) 176 స్థానాలను గెలుపొంది మరో 15 స్థానాల్లో ముందజలో ఉంది. కాంగ్రెస్‌ 266 స్థానాలను గెలుపొంది..6 చోట్ల ముందజలో ఉంది.
జిల్లా పరిషత్‌ : మొత్తం 928 జిల్లా పరిషత్‌ స్థానాలకు ఎన్నికలు జరగగా తృణమూల్‌ కాంగ్రెస్‌ 674 స్థానాల్లో గెలుపొంది 149 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 21 స్థానాల్లో గెలుపొందింది. కాగా సీపీఐ(ఎం) 2 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 6 స్థానాల్లో గెలుపొంది మరో 5 స్థానాల్లో ముందజలో ఉంది.

Spread the love