అదానీ కంపెనీలకు షాక్‌

న్యూఢిల్లీ : అదానీ గ్రూపులోని మూడు కంపెనీలకు ఐక్యరాజ్య సమితిలోని కీలక విభాగం షాక్‌ ఇచ్చింది. ఉద్గారాల తగ్గింపులో పారిశ్రామికవర్గాలకు సహాయపడే ఐక్యరాజ్యసమితి మద్దతు గల సైన్స్‌ బేస్డ్‌ టార్గెట్స్‌ ఇనిషియేటివ్‌ (ఎస్‌బీటీఐ) ప్రకారం.. ఉద్గారాలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్న కంపెనీల జాబితాలో మూడు అదానీ గ్రూప్‌ కంపెనీలు తమ స్థానాన్ని కోల్పోయాయి. ఈ జాబితాలో అదానీ గ్రీన్‌, అదాని ట్రాన్స్‌మిషన్‌ లిమిటెడ్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ లిమిటెడ్‌లు ఉన్నాయని బ్లూమ్‌బర్గ్‌ ఓ రిపోర్ట్‌లో తెలిపింది. అదాని కంపెనీలు క్లైమట్‌ గ్రూప్‌ ఆమోదాన్ని కోల్పోయాయని వెల్లడించింది. తాజా వాతావరణ శాస్త్రానికి అనుగుణంగా వ్యాపారాలు ప్రతిష్టాత్మకమైన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను నిర్దేశించడంలో ఎస్‌బిఐటి సహయపడుతుంది. 2030 నాటికి ఉద్గారాలను సగానికి తగ్గించడానికి, 2050కి ముందు నికర సున్నాకు సాధించడానికి ఎస్‌బీటీఐ కృషి చేస్తోంది. చాలా మంది పెట్టుబడిదారులు స్థిరమైన ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టాలని భావించేవారు తరచుగా ఎస్‌బీటీఐ ఆమోదం కోసం ఎదురు చూస్తుంటారని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. గ్రీన్‌ ఎనర్జీలో భారీ పెట్టుబడులను ప్రకటించిన అదానీ గ్రూపునకు ఇది భారీ దెబ్బే అని నిపుణులు భావిస్తున్నారు. వచ్చే దశాబ్దంలో గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌లలో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నామని గౌతం అదానీ గతేడాదిలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఎస్‌బీటీఐ తాజా చర్యలు అదానీ కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయే ఎదురు చూడాలి.

Spread the love