గెలుపెవరిది..?

– ముగిసిన కర్నాటక పోలింగ్‌
– 65.69శాతం పోలింగ్‌ నమోదు
– చెదురుమదురుగా ఘర్షణలు
– వెల్లడైన ఎగ్జిట్‌ పోల్స్‌
బెంగళూరు : చెదురుమదురు హింసాత్మక ఘటనలతో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు బుధవారం ముగిశాయి. సాయంత్రం 6గంటలకు పోలింగ్‌ ముగిసే సమయానికి 65.69శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. కాగా, శనివారం ఓట్ల లెక్కింపు జరిగి, ఫలితాలు వెల్లడి కానున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ భావిస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తుందని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. 61స్థానాల్లో పట్టు కలిగిన జేడీఎస్‌ కీలక పాత్ర పోషించే అవకాశం వుంది. 224 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ ప్రధానంగా పోటీ పడుతున్నాయి. మొత్తంగా 2165మంది అభ్యర్ధులు ఈసారి బరిలో వున్నారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతతో సహా వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలోనే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా ఇంటినుండే ఓటు వేసే అవకాశం వుందన్న విషయాన్ని తమకు తెలియచేయలేదని ,అందువల్లే తాము పోలింగ్‌ కేంద్రాలకు ఇబ్బంది పడికూడా రావాల్సివచ్చిందని సీనియర్‌ సిటిజన్లు, వికలాంగులు ఫిర్యాదు చేశారు. మరోవైపు, బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ వ్యాఖ్యానించారు. బిదాడిలో ఆయన తన ఓటు వేశారు. ఈసారి ప్రజలు పారదర్శక ప్రభుత్వం కావాలనుకుంటున్నారని ఖర్గే వ్యాఖ్యానించారు. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 72.36శాతం నమోదైంది.
ఘర్షణలు, దాడులు
కాల్బుర్గిలో బీజేపీ నిర్వహిస్తున్న కాల్‌ సెంటర్‌పై ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ దాడి చేసింది. కాంగ్రెస్‌ చేసిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. బీజేపీ అభ్యర్ధులకే ఓటు వేయాలంటూ ఆ కాల్‌సెంటర్‌ నుంచి ఓటర్లకు కాల్స్‌ వెళుతున్నాయని కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది.
విజయపురా జిల్లాలోని బసవనా బెగవాడి తాలుకాలో మసబినాల్‌ గ్రామంలో కోపోద్రిక్తులైన గ్రామస్తులు ఈవీఎంలను, వీవీపీఏటీ (ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రెయిల్‌) యంత్రాలను ధ్వంసంచేశారు. పోలింగ్‌ అధికారుల వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. పోలింగ్‌ అధికారిపై కూడా చేయి చేసుకున్నారు. పోలింగ్‌ను మధ్యలోనే ఆపేసి అధికారులు ఈవీఎంలు, వీవీపీఏటీలను మారుస్తున్నారని వదంతులు రావడతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి 23మందిని అరెస్టు చేసినట్లు ఇసి ప్రకటించింది.
బెంగళూరులోని పద్మనాభనగర్‌ నియోజకవర్గంలో పాపయ్యా గార్డెన్‌ పోలింగ్‌ బూత్‌ వద్ద కొంతమంది యువకులు కర్రలతో తమ రాజకీయ ప్రత్యర్ధులపై దాడి చేశారు. అక్కడ విధ్వంసం సృష్టించారు. దీంతో ఓటు వేయడానికి క్యూలో నిలుచున్న కొంతమంది మహిళలు గాయపడ్డారు. బళ్ళారి జిల్లాలోని సంజీవరాయనకోటలో కొంతమంది కాంగ్రెస్‌, బిజెపి కార్యకర్తలు ఘర్షణ పడ్డారు.
జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోం : కేపీసీసీ చీఫ్‌
కనకపురా నియోజకవర్గంలో ఓటు వేసిన అనంతరం కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ మాట్లాడుతూ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ల మధ్య ఎన్నికల అనంతర పొత్తు వుండబోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పారదర్శక ప్రభుత్వం కావాలనుకుంటున్నారు : ఖర్గే
ప్రగతిశీల, పారదర్శక, సంక్షేమ దృక్పథం కలిగిన ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని కర్ణాటక ప్రజలు నిర్ణయించుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ట్వీట్‌ చేశారు. పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కల్బుర్గిలోని బసవానగర్‌లోని కీర్తి స్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రానికి తన భార్య రాధాభారు ఖర్గేతో కలిసి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత 55 సంవత్సరాలుగా ఈ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేస్తున్నానని, ఇక్కడ ప్రజల ఉత్సాహాన్ని చూస్తే.. కచ్చితంగా కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తుందని, మెజార్టీతో పార్టీ గెలుపు సాధిస్తుందని నేను భావిస్తున్నా’నని అన్నారు.
దాడుల్లో రూ.58లక్షలు నగదు స్వాధీనం
మంగళవారం రాత్రి చిత్రదుర్గలో జేడీఎస్‌ అభ్యర్ధి రఘు ఆచార్‌ నివాసం నుండి రూ.58లక్షలను స్వాధీనం చేసుకున్నటు ఐటి, ఎక్సైజ్‌, ఎన్నికల, పోలీసు అధికారులు తెలిపారు. కవర్లలో పెట్టి పంపిణీకి సిద్ధంగా వున్న మొత్తాలు రూ.50లక్షలు వున్నాయని, మరో 8,83,000 నగదు విడిగా వుందని పోలీసులు చెప్పారు. 239 లీటర్ల బీరును కూడా స్వాధీనం చేసుకున్నారు. 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో నాలుగున్నర రెట్లు అధికంగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఇసి ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి 463కోట్ల విలువైన మొత్తాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో నగదు, లిక్కర్‌, ఆభరణాలు, మాదకద్రవ్యాలు, వంటి వున్నాయని తెలిపింది.

Spread the love