అదానీపై సుప్రీంకు నివేదిక

– సీల్డ్‌ కవర్‌లో అందజేసిన నిపుణుల కమిటీ
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ సంస్థ చేసిన ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ న్యాయస్థానానికి తన నివేదికను సీల్డ్‌ కవరులో అందజేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరుపుతుంది. అయితే సుప్రీంకోర్టు లేవనెత్తిన అన్ని అంశాల పైన ఈ కమిటీ విచారణ జరిపిందీ లేనిదీ తెలియరాలేదు. అలాగే విచారణను పూర్తి చేసేందుకు మరికొంత సమయం అడుగుతుందా లేదా అన్నది కూడా తెలియడం లేదు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు కేంద్ర ప్రభుత్వం సూచించిన సభ్యుల పేర్లను న్యాయస్థానం ఫిబ్రవరి 17న తిరస్కరించింది. సొంతగా ఆరుగురు నిపుణులతో కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎఎం సప్రే నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో మాజీ బ్యాంకర్లు కేవీ కామత్‌, ఓపీ భట్‌, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని, సెక్యూరిటీస్‌ న్యాయవాది సోమశేఖర్‌ సుందరేశన్‌, రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తి జేపీ దేవధర్‌ సభ్యులుగా ఉన్నారు. రెండు నెలలలో విచారణను పూర్తి చేయాలని కమిటీని, సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సెబీ మాత్రం మరో ఆరు నెలల గడువు కోరింది.

Spread the love