జైలు గోడలు దాటి..

జైలు గోడలు దాటి..వంచితుల వాక్కువయినందుకే
సత్యాన్ని సమాధి చేయాలని
తరగతి గదిలోంచి నిన్ను
చీకటి గుహలోకి బదిలీ చేశారు
కానీ, సత్యం కూడా శక్తి నిత్యత్వ నియమమేనని
కాలం మరో మారు నిరూపించింది
దేహం అచేతనత్వ గేహమైనా
గాయాలను కానుకిచ్చిన కాల సర్పాలు
అడుగు కదపజాలని అతి సున్నితునికి
అండాసెల్‌ ఓ అనకొండ కౌగిలి
అసహన శక్తుల ఆజ్ఞల అగ్నిపరీక్షలో
నిప్పుల గుండం లోంచి విరిసిన నిజాయితీ పుష్పానివి
ఈ దేశపు మానవహక్కుల ప్రతీకవై
ప్రపంచ యవనికపై ప్రదర్శితమైన
పాలకుల పరిహాస ప్రయోగానివి నువ్వు
ఏం చేయగలిగింది రాజ్యం నిన్ను..
కనురెప్పలు దాటనీయకుండా కొన్ని కలల్ని కత్తిరించింది
మోడు వారిన నిన్ను చిగురింపజేస్తున్న
వాత్సల్యపు ‘వసంతా’నికి బలవంతపు శిశిరాన్ని బహూకరించింది
విలువైన నీ జీవన వక్షపు
కొమ్మల్ని కొన్నింటిని కొట్టివేసింది
భుజాలపై మోసి అక్షరాలకు చేరువ చేసిన
అమ్మ ఆఖరి చూపుకు అడ్డుగోడై నిలిచి
పేగు బంధపు పెనుగులాటల పెంజీకట్లు పరిచింది
నిషీధిని వెక్కిరించిన ఋషిత్వం నీది
నిజాయితీని కత్తిమొనపై మోపిన సాహసం నీ ఆశయానిది
నిన్ను వాడిపోనీయకుండా
తలా చెంబెడు కరుణ జలాలను పోసి
కాపాడుకున్న సమాజ చలనాల సమిస్ఠి విజయం నీ విడుదల
కదలిక లేని నీ పాదాలు నిరంకుశ చట్టాలను తొక్కుకుంటూ
వేచి ఉన్న వేల కరచాలనాల కోసం
విముక్తి గీతాలు ఆలపిస్తూ వస్తున్నావు
రా.. చావును నిరాకరించిన నిశ్శబ్ద యుద్ధ వీరుడా
నియంతలు నిర్మూలించలేనిది
నిర్బంధాలు నిరోధించజాలనిది
సత్యమొక్కటేనన్న సందేశాన్ని మోసుకుంటూ
జైలు గోడలను దాటి ..జన సమూహంలోకి రా..
వీల్‌ ఛేర్‌ పై విస్ఫులుంగ దశ్యమై రా..
– గాజోజు నాగభూషణం, 9885462052

Spread the love