– రాజస్థాన్ సీఎం గెహ్లాట్
జైపూర్ : బీహార్ తరహాలోనే రాజస్థాన్‌లో కూడా కులగణన చేపడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. రాజస్థాన్‌లో ఈ సంవత్సరం చివరలో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గెహ్లాట్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. జైపూర్‌లో శుక్రవారం రాష్ట్ర పీసీసీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కులగణనపై చర్చించారు. ఇందులో గెహ్లాట్‌తో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సుఖ్‌జిందర్ రణధావా, పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొతాస్రా తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం గెహ్లాట్ విలేకరులతో మాట్లాడుతూ కులగణనపై ప్రకటన చేశారు. కులగణన జరగాలని, దానిని బట్టి ఆయా కులాల భాగస్వామ్యాన్ని పెంచాలని పార్టీ అగ్రనేత రాహుల్ భావిస్తున్నారని చెప్పారు. పార్టీ నిర్ణయానికి అనుగుణంగానే రాష్ట్రంలో కులగణన జరపాలని నిర్ణయించామని తెలిపారు. ‘దేశంలో అనేక కులాలు ఉన్నాయి. వివిధ మతాలకు చెందిన వారు జీవిస్తున్నారు. ఒక్కో కులం వారు ఒక్కో పని చేస్తుంటారు. ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో తెలిస్తే వారి కోసం ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. అప్పుడు కులాల వారీగా పథకాలను తయారు చేసుకోవచ్చు’ అని గెహ్లాట్ వివరించారు.