బీజేపీ, కాంగ్రెస్‌ దొందూ దొందే

BJP and Congress are together– త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించుకున్నాం
– 10 ఏండ్ల అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు
నవ తెలంగాణ -దౌల్తాబాద్‌
ప్రజల్ని ఆదుకోవడంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు దొందూ దొందేనని, ఆ రెండు పార్టీలను పార్లమెంట్‌ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ది చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌లో జరిగిన నియోజకవర్గ స్థాయి బీఆర్‌ఎస్‌ యువజన విభాగం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశానికి చేసిందేమీ లేదన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా దేశంలో నిరుద్యోగ సైన్యాన్ని పెంచిన మోడీకి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయాలో చెప్పాలన్నారు.
పేదల సంక్షేమాన్ని విస్మరించి పెద్దల లాభాలు చేకూర్చడం తప్ప మోడీ చేసిందేమీ లేదన్నారు. మాయ మాటల రఘునందన్‌ గురించి దుబ్బాక ప్రజలకు తెలుసన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వంద రోజుల పాలనలో చేసిందేమీలేదన్నారు. ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తామని రైతుల్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్‌కు రైతులు ఎందుకు ఓటు వేయాలన్నారు. మిరుదొడ్డిలో మహిళా రైతులతో మాట్లాడితే మార్కెట్లో పోసిన ధాన్యాన్ని ఎవ్వరూ కొనడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
మహాలక్ష్మి ద్వారా మహిళలకు ఇస్తామన్న రూ.2500, నిరుద్యోగ భృతి వంటి హామీల పరిస్థితి ఎండమావిగా మారిందన్నారు. జాయింట్‌ కలెక్టర్‌, కలెక్టర్‌గా పనిచేసిన పి వెంకట్రామరెడ్డి మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలందరికీ సుపరిచితుడన్నారు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, దానిని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి, టీ ఎస్‌ రెడ్కో చైర్మన్‌ వై సతీష్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు మనోహర రావు, రొట్టె రాజమౌళి పంతులు, నమిలే భాస్కరాచారి, కత్తి కార్తీక, యూత్‌ నాయకులు సురేష్‌ గౌడ్‌, శేఖర్‌ గౌడ్‌, మహేష్‌ రెడ్డి పాల్గొన్నారు.

Spread the love